*చతుర్థ స్కంధము - 08*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 48*
*నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ!*
*నిశ్శంశయా సంశయాఘ్నీ నిర్భవా భవనాశినీ!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*శుక్రాచార్యుడి తపస్సు* చదువుకున్నాము.
*అమ్మ దయతో......* ఈ రోజు
*"విష్ణుమూర్తికి భృగుశాపం"*
చదువుకుందాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *విష్ణుమూర్తికి భృగుశాపం* 💐
శుక్రాచార్యుడు ధూమపాన తపస్సుకు ఉపక్రమించాడన్న సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా! మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు - అంటూ మండి పడ్డారు. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా! ఇది మీకు భావ్యం కాదు. ధర్మమూ కాదు. మేము నిరాయుధులం. తపోవృత్తితో బతుకుతున్నాం. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్నవాడినీ, భయభీతుడినీ, ఆచార్యుణదణ్ణీ, వ్రతాచరణలో ఉన్నవాడినీ చంపకూడదనికదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా?
దొంగనన్నాసుల్లారా ! మాకు, మీరు, ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుణ్ణి పంపించారుగా తపస్సుకి, వస్తాడు, దివ్యమంత్రాలు తెస్తాడు. మా మీద ప్రయోగిద్దురుగాని - అని ఎకసక్కెమాడుతూ దేవతలు భీకరమారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని (భృగుమహర్షి భార్య) శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, భయపడకండి, వా నవ్నిధిలో ఆసలు భయపడకండి - అంది. రాక్షసులు హమ్మయ్య అనుకున్నారు.
తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు, అయ్యో, ఆశ్రమం అనైనా చూడకుండా చొరవగా ప్రవేశించి, కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా వినకుండా, రాక్షసులను చాలామందిని పట్టుకుని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలనందరినీ నిద్రావివశుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు.
ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావశుల్ని చేసింది. ఇద్దరూ స్తబ్ధులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలూ హాహాకారాలు చేశారు.
*మహావిష్ణూ!* ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిణిని వెంటనే సంహరించు. లేదంటే మనలనే (భక్షిస్తుంది) సంహరిస్తుంది - అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు. ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్రనుంచి విముక్తులయ్యారు. ఇంద్రావిష్ణువులకు సంబరంగానే ఉంది కానీ, భృగుమహర్షి వచ్చి శపిస్తాడనే శంకకూడా మనస్సుని పట్టిపీడిస్తూనే ఉంది.
*(అధ్యాయం - 11. శ్లోకాలు - 57)*
భార్య మరణించిన వార్త భృగువుకి తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్త్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎలా చెయ్యగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనక, నన్ను విధురుణ్ణి చేశాడు కనక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు విష్ణువే కనక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు.
*మధుసూదనా!* నువ్వు మోసగాడివి. నిన్ను సాత్త్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావు కనక, నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ, గర్భవాస దుఃఖాన్ని అనుభవింతువుగాక! - అని శపించాడు.
*జనమేజయా!* భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేకావతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తుంటాడు.
దానికేమి, అది అలా ఉండనీ. జనమేజయా! ఇక్కడొక అత్యద్భుతమైన పన్నివేశం జరిగింది. విను.
భృగుమహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండేనికి అతికించాడు. దేవీ! విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పనివాడిని అయితే శీలసంపన్నుడనైతే ఆడితప్పనివాడినైతే నా భార్య జీవించుగాక! నా తేజశ్శక్తిని దేవతలంతా గ్రహింతురుగాక! - ఆంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్విని లేచికూచుంది. నిద్రనించి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధుసాధు నినాదాలతో దంపతులను అభినందించింది.
భార్యపట్ల భృగుమహర్షికున్న ప్రేమకూ తపశ్శక్తికీ అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు.
*(రేపు.... "శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుని ఎత్తుగడ" )*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹