‘చంపకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచా’
ఈ నామము కూడా మధ్యలో ఆపకుండా చెప్పాలి. ఏ గుడిలో కూడా అమ్మవారి కబరీబంధము, ఆవిడ పెట్టుకున్న పువ్వులు దర్శనము అవదు. శుక్రవారమునాడు అమ్మవారి కొప్పు గురించి, పువ్వులగురించి వింటే స్త్రీలకు ఐదవతనము నిలబడుతుంది.
చంపకము ఎరుపు, పసుపు రంగులతో కలసిన అరవిరిసిన సంపంగిపువ్వు. వాటిని మాలలుగా కట్టి అమ్మవారు కొప్పులో పెట్టుకుంటుంది. దానిమీద అశోకపుష్పముల మాల, దానిమీద పున్నాగ పువ్వులతో కట్టినమాల, దానిమీద పెద్ద పెద్ద సౌగంధికము అనగా చంగల్వపువ్వులతో కట్టినమాల పెట్టుకుంటుంది. అమ్మవారి జుట్టును, కొప్పులో ఈ పువ్వుల అమరికను ధ్యానములో చూడాలి. ధ్యానములో కొప్పువంక చూస్తే సువాసనలు తగులుతాయి. ఉత్తరక్షణములో అజ్ఞానము పోతుంది. జుట్టు పేరు పెట్టి ఏ స్త్రీకి స్తోత్రము ఉండదు. ఎంతో పెద్ద కబరీబంధముకల అమ్మవారిని భ్రమరకుంతలాంబ, నీలకుంతలాంబ, పుష్పకుంతలాంబ, సుగంధకుంతలాంబ అని కేశములను బట్టి అనేక పేర్లతో పిలుస్తారు. శంకరాచార్యులవారు ‘అమ్మా ! నీ జుట్టు చూడగానే అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయని, నల్లకలువల తండములా ఉన్నదని, ఒత్తుగా నొక్కులు నొక్కులుగాఉండి, ఎక్కడా చిక్కులు లేకుండా, పట్టుకుంటే చాలా కోమలముగా, మెత్తగా పట్టులా జుట్టు నల్లగా ఉంటుంది ఎప్పుడూ తెల్లబడదు అన్నారు. తెల్లగా ఉంటే కాలమునకు లొంగినట్టు. ‘నిత్యయవ్వన’ - ఆవిడ కాలమునకు లొంగదు. దేవేంద్రుని కల్పవృక్షములకు పూసిన సువాసన భరితమైన పువ్వులను దేవతాస్త్రీలు ధరించాలి అనుకుంటారు. ఆ పువ్వులు అమ్మవారు మమ్ములను కొప్పులో పెట్టుకోవాలని చూస్తాయి.
అమ్మవారి ముంగురులు ముఖము మీద పడి గాలికి కదులుతూ ఉంటాయి. నల్ల తుమ్మెదలను యుద్ధానికి పిలుస్తున్నట్టు ఉంటాయి. దుర్వాసోమహర్షి ఆర్యాద్విశతిలో ‘నల్లతుమ్మెదల కదలికలను గెలిచిన కదలికలు కలిగిన అలకలున్నఅమ్మ’ అన్నారు. బ్రహ్మాండములన్నీ ఆవిడ కబరీబంధములో మునుగుతున్నాయని అన్నారు.🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏
J N RAO 🙏🙏🙏