*శ్రీదేవీభాగవతము - 51*

P Madhav Kumar

 


*చతుర్థ స్కంధము - 11*

                     

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 51*


*దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా!*

*సర్వజ్ణా సాంద్రకరుణా సమానాధికవర్జితా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*అరిషడ్వర్గాలకు అతీతులు లేరు* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*"రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం"*

*రాక్షసుల పశ్చాత్తాపం* చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం* 🌈


బృహస్పతి పాట్లు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వారిముందు ప్రత్యక్షమయ్యాడు. 


*దైత్యులారా!* ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇలా ఇంతతేలికగా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని. శుక్రుణ్ని. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు. వీడినీ వీడిమాటలను నమ్మకండి. దొంగవేషం వేసి అచ్చు నా రూపంతో వచ్చాడు. రండి. వీడిని వదిలేసి ఇలా వచ్చెయ్యండి - అన్నాడు.


రాక్షసులకు ఉన్న మతికాస్తా పోయింది. ఇద్దరినీ మార్చి మార్చి చూశారు. ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు. కళవళపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి -


*ప్రియశిష్యులారా!* నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశ బృహస్పతియే అయ్యుంటాడు. మిమ్మల్ని వంచించి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి. అటు వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్యవిద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతావిజయం సాధించి పెడతాను.


*ప్రాప్తా విద్యా మయా శంభోర్యుష్మానధ్యాపయామి తామ్!* 

*దేవేభ్యో విజయం నూనం కరిష్యామి న సంశయః !!*


(ఈ శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. దేవేభ్య: విజయం కరోమి అన్నాడు. దేవేభ్యః | దేవతలనుంచి, విజయమ్ = విజయాన్ని, కరోమి = మీకు కలిగిస్తాను - అనేది శుక్రుడుగా రాక్షసులకు స్ఫురించాలని ఉద్దేశించిన అర్థం. దేవేభ్య: అనేది పంచమీ విభక్తి కాదు చతుర్థి బహువచనం కూడా కావచ్చు. అప్పుడు దేవతలకొరకు విజయం చేకూరుస్తాను అనే అర్థం వస్తుంది. ఇది బృహస్పతిగా దేవతలకూ తనకూ అభీష్టమైన అర్థం. తెలుగు వచనంలో వ్యస్తపదాలతో ఈ చమత్కారాన్ని స్ఫురింపజెయ్యడం కష్టం. దేవతా విజయం అని సమాసం చేసేస్తే దేవతలను జయించడం, దేవతలకు జయం కలిగించడం అనే రెండు అర్థాలూ తాత్పర్యంగా స్ఫురిస్తాయి.)


ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు. బృహస్పతినే శుక్రుడనుకున్నారు. గురువుగా అంగీకరించారు. అసలు శుక్రుణ్ణి నకిలీగా తిరస్కరించారు. ఎంతచెప్పినా వినిపించుకోలేదు. ఇతడే మా గురువు, మా హితుడు. ధర్మాత్ముడు. మాకోసం వెయ్యేళ్ళు ఘోరతపస్సు చేసిన దయాశాలి. మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురూత్తముడు. గడిచిన పదేళ్ళనుంచీ విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో. కుహనా శుక్రుడివి. మా గురుడవు కాదు. మర్యాదగా వచ్చినదారిన దయచెయ్యి. లేదంటే తగిన శాస్తి చేస్తాం అని బెదిరించారు దైత్యులంతా ముక్తకంఠంతో.


శుక్రాచార్యుడికి వొళ్ళు మండింది. శపించాడు. మూఢులారా! నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నామాట నమ్మడం లేదు. కనక ఊరూ పేరూ లేనివారై పరాభవాల అనుభవింతురుగాక! నన్ను తిరస్కరించి, అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు తెలిసివస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు అనుభవించండి - అంటూ ఆ భృగు తనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు.


బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు రాక్షసులను రాక్షసగురువే శపించాడు కనక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచి పెట్టేసి స్వీయరూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు. ఇవ్వేళ నిరాధారులు, కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రుడూ దేవతలూ ఆనందంతో గంతులువేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు.


🌈 *రాక్షసుల పశ్చాత్తాపం* 🌈


విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులుపడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకిమాత్రం శుచిగా ఉంటాడు లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే. అంతగా అవమానించాం. కనక మనమే వెళ్ళి కాళ్ళమీదపడి బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ ఆపత్సమయంలో మరోదారిలేదు - అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడుకదా అని ప్రహ్లాదుణ్ణి ముందుంచుకుని శుక్రాచార్యుణ్ణి చేరుకున్నారు. వెడుతూనే కాళ్ళ మీద పడ్డారు. లెంపలు వేసుకున్నారు.


శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా! నేను ఎంతచెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు.


హితం చెబితే చెవికెక్కిందికాదు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలం వెంటవే లభించిందికదా! అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఆ కపటగురువు దగ్గరికే వెళ్లండి. ఆ వంచకుడినే శరణువేడండి. నాకు అలాంటి మాయలూ మంత్రాలు తెలియవు. వేను అతడిలా వంచకుణ్ణి కాను, కాలేను.


శుక్రాచార్యుడు తీవ్రస్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమి పలకడానికి నోళ్ళు రావడం లేదు. ఒక ప్రక్క సిగ్గు, ఒక ప్రక్కన అవమానం, ఒక ప్రక్కన భయం. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు రెండడుగులు ముందుకు వేసి గురుడిపాదాలకు సాగిలి మ్రొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు


*భార్గవా!* భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు. కొడుకుల్లాంటివారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచి పెట్టి వీళ్ళను దిక్కులేనివాళ్ళను చెయ్యకు. నువ్వు సర్వజ్ఞుడవు. నీకు నేను చెప్పదగినవాణ్ణి కాను. మంత్రసాధనకోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు రూపంలో వచ్చి, అచ్చం నీలాగానే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచించాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీపట్ల అనుచితంగా ప్రవర్తించాం. కించపరిచాం. ఇది తెలియకచేసిన అపరాధమే తప్ప తెలిసిచేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీవంటి శాంతస్వభావులు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు?


మా మనస్సులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచించాడు బృహస్పతి. వెయ్యేళ్ళ గడువు దాటిపోవడమూ అతడు నీ రూపంలో రావడమూ కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంతతేలికగా బుట్టలో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మవద్దు. నీ తపశ్శక్తితో చూడు. మా అంతరంగాలు తెలుసుకో. నీవంటి సాధుపురుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతున్నారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపర్కంతో వేడి ఎక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు. సహజశీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వానర్థాలకూ క్రోధమే కారణమని నీవంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచి పెట్టు. దిక్కులేక కష్టాలపాలైన మమ్మల్ని చేపట్టు.


భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరంచేసి దేవతలిప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసీ నువ్వు రోషాన్ని వదిలి పెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థన మన్నించు. ఇప్పటికీ సమాధానపడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది. లేదా వజ్రాయుధానికి ఎర కావాల్సి వస్తుంది. అప్పుడింక నీకు చెప్పుకోడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు.


ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువుతో తిలకించాడు. ప్రసన్నుడయ్యాడు. ముఖంమీద చిరునవ్వులు చిందులు తొక్కాయి.


*దానవులారా!* భయపడవలసింది ఏమీ లేదు. రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలు ఉన్నాయి.


దానికేమి గానీ మీకొక సత్యం చెబుతాను. వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను.


జరగవలసిన శుభాశుభాలు ఎటుతిరిగీ జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు. అన్యథాకరించలేడు.


*శిష్యులారా!* ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు. అందుకని అన్నివిధాలా బలహీనపడ్డారు. దేవతలచేతిలో మాటిమాటికీ ఓడిపోతున్నారు. ఇప్పుడిది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలనూ సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తిమీద తన్ని పదియుగాలపాటు సకలభోగాలూ అనుభవించారు. విష్ణుమూర్తి వామనరూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అక్కడితో మీకు మంచిరోజులు అయిపోయాయి. ఆవేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలి చక్రవర్తియే ఇంద్రుడు అవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరందాకా మనం ఓపిక పట్టాలి.


*ప్రహ్లాదా!* నీ మనుమడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్యరూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిదరూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కొన్న బలిచక్రవర్తిని ఒకవాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలనూ ఏలినవాడివి సకలదైత్యులకూ అధినాయకుడివి - ఏమిటి ఈ గార్దభావతారం? సిగ్గువెయ్యడం లేదూ? అని హేళన చేశాడు.


*ఇంద్రా!* ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది, దుఃఖపడవలసింది ఏముంది? మహాతేజస్వి విష్ణుమూర్తి మత్స్యకూర్మవరాహాది రూపాలు ధరించలేదూ ? అలాగే వేనూ కాలయోగంవల్ల గాడిదరూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్యా మహాపాతకానికి లోనై కమలంలో దాక్కోలేదూ ? అలాగే ఇప్పుడు నేనూ గార్దభరూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటీ, సుఖమేమిటీ! అంతా కాలమహిమ. అది ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. దానికి తిరుగులేదు.


ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రులు తమతమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నెలవులకు వారు వెళ్ళిపోయారు.


అందుచేత ఓ రాక్షసవీరులారా ! ఈ దైవ దానవ మానవరూపజగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికన్నా అన్నివేళలా బలిష్ఠం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది.


*(అధ్యాయం - 14, శ్లోకాలు - 58)*


*జనమేజయా !* వింటున్నావుకదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. 


*శౌనకాది మహామునులారా !* వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు.


శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికన్నా బలిష్ఠమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా! ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనక దేవతలే జయిస్తారు - అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఈమాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరుక ! బలహీనులూ భయభీతులూ నిరుద్యములూ దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతణ్ణి చూసినవాడెవడు ? ఎలా ఉంటాడు ? ఎక్కడ ఉంటాడు ? ఎవరికీ తెలీదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మనవంటి వీరులకు తగనిపని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం. విజయమో వీరస్వర్గమో ! మాలో అన్నివిధాలా నువ్వు పెద్దవాడివి కనక మమ్మల్ని నడిపించు - అన్నారు.


ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖభేరీతూర్యారావాలతో యుద్ధం మొదలయ్యింది. ప్రహ్లాదుడికీ దేవేంద్రుడికీ మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగింది. నిండా నూరేళ్ళు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది.


*(రేపు....  ఇంద్రకృత దేవీ స్తుతి మరియు ప్రహ్లాదకృత దేవీస్తుతి )*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


  .

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat