*అయ్యప్ప నిష్ఠ చెడగొట్టే తీరాలా ? - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇది తప్పు అని అయ్యప్పను ఆరాధించే ఏ భక్తురాలూ అనలేదు. హిందూ స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే ఏ మహిళా సంఘమూ నోరెత్తలేదు. ఫలానా మతాచారం వల్ల తమ హక్కుకు భంగం కలిగిందా లేదా అన్నదానిని ఆ మతానికి చెందిన ఆ వర్గం వారే కదా చెప్పవలసింది ? కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్న సామెతలాగా సంప్రదాయక హిందూ మహిళలకు లేని అభ్యంతరం పనిలేని కొందరు ప్లీడరమ్మలకు ఒడుచుకొచ్చింది. వారిలో ఎంతమందికి దైవభక్తి ఉందో తెలియదు. ఆంక్ష ఎత్తేస్తే వారిలో ఎంతమంది శబరిమలకు వచ్చి శ్రీస్వామి అయ్యప్పను దర్శిస్తారో అంతకంటే తెలియదు. వీరు తీరి కూర్చుని , అర్థంలేని రాద్ధాంతం చేసి , కేసు పెట్టగానే సర్వోన్నత న్యాయస్థానమే హుటాహుటిన కదిలింది. బకాయిపడి కొండలా పేరుకున్న కేసుల విషయంలో చూపని వేగాన్ని , శ్రద్దనూ ఈ సంచలనాత్మక వ్యాజ్యంపై కనపరచింది. నిషేధం గురించి ఏమి చెబుతారని సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చేసరికి స్త్రీలు సైతం ఆలయం ప్రవేశం చేయుటలో మాకభ్యంతరం లేదని సహజంగానే కేరళ ప్రభుత్వం బదులిచ్చింది. సున్నితమైన ఆచార వ్యవహారంలో బాధ్యత గుర్తెరిగి ప్రభుత్వం చూపిన సంయమనాన్ని అర్థం చేసుకోకుండా *'గుళ్లోకి ఆడవాళ్ళను రానివ్వరా ?' అని అడిగితే 'రానివ్వము'* అని ఏ ప్రభుత్వం మాత్రం ఎలా చెప్పగలదు ? లైంగిక వివక్షలా బయటివారికి కనపడే కట్టుబాట్లు వేరే మతాల్లో లేవా ? ఏదేశంలోనైనా మొనాస్టరీల లోకి మహిళలను రానిస్తారా ? క్రైస్తవ సన్యాసినులుండే నన్నరీలలోకి మగవారిని అనుమతిస్తారా ? జెస్యూట్లు , బెనెడిక్టన్ల ఆర్డర్లలో స్త్రీలకు ప్రవేశం ఉంటుందా ? లోరెటా ఆర్డర్లోకి క్రైస్తవ పురుషులను పోనిస్తారా ? క్రైస్తవ మతంలో ఒక మహిళ పోప్ కాగలదా ? కనీసం బిషప్ అవుతుందా ? హిందువో , ముస్లిమో వారెవరో చెప్పలేని షిర్డీ సాయిబాబాగారి చావడి గదిలోకి తమను పోనివ్వకపోవటం తమ సమానత్వానికి , రాజ్యాంగ హక్కులకు విఘాతకరమని ఏ స్త్రీలైనా అనుకుంటున్నారా ?
ఎప్పుడూ ఎక్కడాలేని గొడవ శబరిమలలో ఎందుకు మొదలైంది ? ప్రతికలు , టీవీఛానెళ్ల చచ్చు చర్చలో పాల్గొనే తెలిసీ తెలియని పెద్దనోటి రాయుళ్లు ఊదరపెడుతున్నట్టు ఇదంతా నిజంగా స్త్రీల హక్కుల మీద మక్కువతోనేనా ? రాద్ధాంతం వెనుక వేరే మతలబు ఉందా ? దేవుడి పేరుచెప్పి మనుషులు చేసే పనులకు దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకునేందుకు శబరిమలలో అప్పుడుప్పుడూ *'దేవప్రశ్నం'* నిర్వహిస్తారు. జ్యోతిష సంబంధమైన లెక్కలు వేసి శకునాలను , నిమిత్తాలను గమనించి , ఇతర విధాల దేవుడి మౌనభాషను యథాశక్తిగా అర్థం చేసుకుని ఆస్థాన దైవజ్ఞులు భక్తులకు ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఉన్ని కృష్ణన్ ఫణిక్కర్ అనే దైవజ్ఞుడు ఆలయ వ్యవహారాలు నడుస్తున్న తీరుపట్ల స్వామిచాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనుక్కున్నాడు. నీళ్లు నమలకుండా మోహమాటం లేకుండా తనకు స్పురించింది నిష్కర్షగా చెప్పాడు. ఆ సందర్భంలో బయటపడ్డ అనేక విషయాల్లో నిషిద్ధ స్త్రీల ఆలయ ప్రవేశం ఒకటి. శబరిమలలో అనాచారాలు , పాపాలు పెరిగిపోయాయి. మద్యం , మాదకద్రవ్యాల వ్యాపారులు , లైంగిక విశృంఖలత్వాలు పేట్రేగుతున్నాయి. దేవస్థానం అధికారులు , వ్యాపారులు , కాంట్రాక్టర్లు , రాజకీయ నాయకులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నారు. సంప్రదాయాలు కట్టుతప్పాయి. నియమానికి విరుద్ధంగా ఒక మహిళ శ్రీ కోవిల్ లో అడుగుపెట్టింది... అంటూ దైవజ్ఞుడొకడు వరుసగా ఏకరువు పెడుతుంటే భక్తులు నివ్వెరపోయారు.
అతడు చెప్పేది నిజమనడానికి శకునాలు కూడా కనిపించాయట. ఒక మహిళ గర్భాలయంలోకి ప్రవేశించింది అని అంటూండగా దేవప్రశ్నం నడుస్తున్న హాలులోకి ఒక మహిళ అడుగుపెట్టిందట. డబ్బులకోసం పిల్లుల్లా కొట్లాడుకుంటున్నారు. అంటుండగా మూడు పిల్లులు అక్కడికి వచ్చి కనబడ సాగాయట. దాంతో దేవుడికే ఆగ్రహం వస్తే దేవస్థానం ఏమవుతుంది ? ఇక తమ గతి ఏమిటి అన్న భయం భక్తజనానికి పట్టుకుంది. *దేవప్రశ్నం విశేషాలు బయటికి వచ్చాక దైవాగ్రహానికి ఎక్కడ గురి అవుతామోనన్న హడలుతో జమా అనే కన్నడ నటి తాను 33 ఏళ్ల కింద 27 సంవత్సరాల వయసులో శబరిమల గర్భగుడిలో ప్రవేశించి స్వామిని తాకినట్లు ఒప్పుకుంటూ దేవస్థానానికి లేఖ రాసింది. చేసింది తప్పని లెంపలేసుకుందే తప్ప మూలవిరాట్టును తాకడం తన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని ఆమెకూడా అనలేదు. ఆలయ నిబంధనను హైకోర్టు తీర్పును ఉల్లంఘించి ఆలయంలో ప్రవేశించిన నేరానికి న్యాయంగా అయితే ఆమెను ప్రాసిక్యూట్ చేయాలి. శిక్షించాలి. తప్పు ఒప్పుకున్నది లెమ్మని దయతలిస్తే అటువంటి అపరాధం మున్ముందు ఇంకెవరూ చేయకుండా గట్టి కట్టుదిట్టాలు చేసి ఊరుకోవాలి. అదీ , కాకుండా తప్పుచేసిన మనిషిని నారీహక్కుల ప్రతినిధిగా మతఛాందస్తపు బాధితురాలిగా చూపించి నాలుక భుజాన వేసుకుని లొల్లిచేయటం మన కుహనా లౌకిక మేధావులకే చెల్లింది.* ఎప్పుడో 33 ఏళ్ల కింద జరిగి సందర్భవశాత్తూ ఇప్పుడు బయటపడ్డ ఆచారం భంగం ఉదంతానికి మితిమించిన ప్రాముఖ్యత ఇవ్వటం దండుగ.
దానికంటే తీవ్రమైన విషయాలెన్నో దేవప్రశ్నంలో ప్రస్తావనకు వచ్చాయి. లైంగిక భ్రష్టత్వాల గురించి అందులో చెప్పినట్లే ఆలయప్రధాన "తంత్రి'' గారి వికృతలీలలు రచ్చకెక్కాయి. ఇలాంటి భ్రష్టుల పెత్తనాలు , బాధ్యతాయుత స్థానాలలోని వారి అవినీతి , అక్రమాలు , కంట్రాక్టర్లతో లాలూచీలు , దేవుడికే ఆగ్రహం తెప్పించాయని తెలిశాక అందరూ దృష్టి కేంద్రీకరించవలసింది - అలాంటి నీచ నికృష్ట భ్రష్టాచారాల మీద ! వాటి సంగతి వదిలేసి 33 ఏళ్ల కిందటి ఘటనకు తగని ప్రాధాన్యమిచ్చి ఆలయ వ్యవహారాల ప్రక్షాళన తక్షణావసరాన్ని కాస్తా మహిళా హక్కుల రాద్ధాంతంగా మార్చి తిమ్మిని బమ్మిని చేయడం ఏ స్వార్థశక్తుల కొమ్ము కాసేందుకు ? ఇంకో సంగతి *'దేవప్రశ్నంలో దేవుడు కోరినట్టుగా వెల్లడైన ముఖ్య విషయమేమిటంటే భక్తులిచ్చే కానుకల దుర్వినియోగాలను ఆపాలని ! వసతులు లేక అవస్థ పడుతున్న యాత్రికుల అగచాట్లను పట్టించుకోవలసిందని ! వారికోసం ఆలయ నిధులతో నిత్యాన్న దానానికి ఏర్పాటుచేయాలని ? ఆ పని కనుక చేస్తే శబరిమల లోనూ , ఎరుమేలి , కరిమల , అన్ని మార్గాల వెంబడి ఉన్న చాలా హోటళ్లకు వ్యాపారం దెబ్బతింటుంది. ఆ హోటళ్లు నడిపే వారిలో ముస్లిములు చాలామంది ఉన్నారు.*
అలాగే అయ్యప్పకు సేవకుడైన వావర్ మసీదును శబరిమల దేవస్థానం స్వాధీనపరచుకుని అక్కడ సాగుతున్న అక్రమాలను అరికట్టాలని 'దేవప్రశ్నం' లో చెప్పింది. అది అమలుచేస్తే ఆ మసీదు పెత్తనం వల్ల అనుచిత లబ్ది పొందుతున్న మోతుబరులకు నష్టం వస్తుంది. తమ ఇష్టారాజ్యానికి ఇబ్బంది లేకుండా చూడటానికే స్వార్థశక్తులు ఏకమై సమస్యను పక్కదారి పట్టించి మతాచారానికి , మహిళా హక్కులకు నడుమ సంఘర్షణగా పనిగట్టుకుని చిత్రిస్తున్నారా ? దుష్టశక్తులు దుర్బుద్ధితో పన్నిన ఉచ్చులో హక్కుల వాచాలురు తమకు తెలియకుండా తలదూర్చారా ? హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తాయనుకునే సంస్థలు ముసలితనం వచ్చి , చేవచచ్చి , చచ్చుపడ్డా... కులమతాలకు అతీతంగా కఠినదీక్షతో అయ్యప్పను సేవించే కోట్లాది భక్తుల సెంటిమెంట్లకు కోర్టులు , ప్రభుత్వాలు కనీసపాటి విలువ ఇవ్వవద్దా ? దిక్కులేని హిందువులంటే అంత చులకనా ? *(ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*