*అయ్యప్ప నిష్ఠ చెడగొట్టే తీరాలా ? - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మసీదులలో ప్రార్థనలకు మగవారితో సమానంగా మహిళలను అనుమతించరు. ఈ సంగతి దేశంలోని ఏ హేతువాదికైనా చెప్పండి. 'ఔనా!' అని అదిరిపడడు. మహిళలు రాజ్యాలు ఏలుతూ రాకెట్లు తొలుతున్న ఈ 21 వ శతాబ్దంలో కూడా మహిళల పట్ల ఇంత దారుణమైన దుర్విచక్షణా ! అని మామూలు బాణిలో బోలెడు షాకైపోడు. రాజ్యంగం ప్రసాదించిన సమానత్వానికి సమాన హక్కులకు మత స్వేచ్ఛకు కొంపలంటుకున్నాయని గుండెలు బాదుకుంటూ ఏ రోడ్డు ముందూ యాగీ చేయడు ?
పైగా - ఆ సంగతి చెప్పిన మిమ్మల్నే వింతజంతువును చూసినట్లు ఎగాదిగా చూస్తాడు. *"ఔను. అయితే ఏమిటట ? అది ఎప్పటినుంచో వస్తున్న వారి మతాచారం. మసీదుకు వెళ్లగోరే స్త్రీలకు విడిగా వేరే ఏర్పాటు ఉంటుంది. మనదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా... ఆఖరికి స్వేచ్చ , సమానత్వం ఎక్కువై బాధపడుతున్న అమెరికాలో కూడా మసీదుల్లో మగవారి సరసన ప్రార్థనలు చేసుకోవడానికి మహిళలను అనుమతించరు. ఆడ , మగ భుజాలు రాసుకుంటూ మోకరిల్లితే ప్రార్థనాస్థలంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుందని ఆ కట్టడిచేసి ఉండొచ్చు. అయినా ముస్లిం మహిళలకు లేని అభ్యంతరం నీకెందుకు ?'* అంటూ క్లాస్ తీసుకుంటాడు. *“శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించడం లేదు "* అని అదే హేతువాదికి చెప్పండి. *'ఇది చాలా దుర్మార్గం'* అంటాడు. ఈ లైంగిక వివక్ష స్త్రీజాతికి అవమానం , రాజ్యాంగానికి అపచారం అని ఎగిరెగిరి పడతాడు. ఎప్పట్నుంచో వస్తున్న ఆచారం అయినాసరే ఈ భ్రష్టాచారాన్ని ఇంకేమాత్రమూ కొనసాగనివ్వడానికి వీల్లేదంటూ మీడియా నిండా రాద్ధాంతం చేస్తాడు. ఈ దుష్టాచారాన్ని తక్షణం ఆపించి , మహిళా సమానత్వానికి, మహిళల ప్రాథమిక హక్కులకు అర్జెంటుగా నాయ్యం చేయాల్చిదంటూ కోర్టుకెక్కి పిల్లు (ప్రజాహిత వ్యాజ్యం) మీద పిల్లు వేస్తాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని ఏ హిందూ దేవాలయంలోనైనా ఆడా , మగా కలిసే గుడికి వెడతారు. కలిసే పూజలు చేస్తారు. మిగతా సంగతులు ఎలా ఉన్నా ఆలయాల విషయంలో హిందూమతం మహిళలను పెద్దచూపే తప్ప చిన్న చూపు చూడదు. గర్భగుడి మూలవిరాట్టులో మగాయన పక్కనే ఆతని ఆడామె ఉంటుంది. అమ్మవారి గుళ్ళలోనే కాక మగదేవుడి గుడిలోకీ మగవారితో సమానంగా మహిళలకూ ప్రవేశం ఉంటుంది.
ఒకే ఒక్క గుడిలో తప్ప. అదియే కేరళలోని అయ్యప్ప స్వామివారి దేవాలయం. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలోకి ఆడవారిని రానివ్వకుండా యుండునది స్త్రీలంటే ద్వేషంతో కాదు. అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి. దేవుడికే కాదు.... అక్కడికి వెళ్ళే భక్తులందరికీ బ్రహ్మచర్యం తప్పనిసరి. 41 రోజులు అయ్యప్పదీక్షకు మాల వేసుకున్న తరువాత కుబేరుడైనా , చక్రవర్తి అయినా కటిక నేలమీద ఆడవాసన తగలకుండా ఒంటరిగా పడుకోవలసిందే. కఠిన బ్రహ్మచర్య దీక్షకు ముక్తాయింపుగా వేలు లక్షల భక్తులు కిక్కిరిసి దర్శనం చేసుకునే ఇరుకైన దివ్య సన్నిధిలోకి వయస్సులోని స్త్రీలను అనుమతిస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. అవాంఛనీయ ధోరణులు ప్రకోపించవచ్చు. మామూలు మనుషులకు దేవుడి నుంచి ధ్యాస మళ్ళి భక్తిపోయి రక్తి కలిగి మగరాయుళ్లకు గుబులు పుట్టవచ్చు. అది ఆయా మహిళల క్షేమానికి మంచిదికాదు. పైగా పరువంలోని స్త్రీలను చూడనని వ్రతం పట్టిన స్వామి గర్భగుడిలో అనాదిగా వస్తున్న కట్టుబాటును అతిక్రమిస్తే స్వామికి ఆగ్రహం వస్తుంది. క్షేత్రం పవిత్రత చెడుతుంది స్థల మహాత్యం సన్నగిల్లుతుంది. దివ్యశక్తిని కోల్పోయాక ఆ క్షేత్రానికి వెళ్లి ప్రయోజనం ఉండదు. నాస్తికుల , హేతువాదుల సరదా , షికారుకు మాత్రమే అది పనికి వస్తుంది. భక్తిగల పురుషులూ స్త్రీలు ఇక అక్కడకు పొమ్మన్నాపోరు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే శబరిమల దేవస్థానం దైవసన్నిధిలో మహిళల ప్రవేశాన్ని ఆది నుండియే నిషేధించింది. ఈ నిషేధం కూడా బహిష్టు ప్రాయమైన పది నుండి యాభైయ్యేళ్ల లోపు స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. పదిలోపు యాబైపైన వయస్సు గల స్త్రీలను రానివ్వడానికి అభ్యంతరం లేదు. కనుక అయ్యప్పస్వామిని పక్కా. స్త్రీద్వేషి అనడానికి వీల్లేదు. ఈ ఆంక్ష కూడా ఆ ఒక్కగుడిలోనే , దేశమంతటా ఊరూరా ఉన్న ఏ అయ్యప్ప గుడిలోకైనా 10-50 వయోవర్గీయులతో సహా అన్నివయసుల మహిళలు నిక్షేపంలా వెళ్ళవచ్చు. ఎక్కడా లేని ఆంక్ష ఆ ఒక్కచోటే పెట్టారంటే అది ఎందుకు పట్టారో ? మనం తప్పక తెలుసుకోవాలి. తరతరాలుగా వస్తున్న కట్టడిని ఉల్లంఘిస్తే దేవుడికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో ఏ అనర్థం వాటిల్లు తుందోనని బాధ్యతగలవారు ఆలోచించడం తప్పా ? దేశమంతటా లక్షోపలక్షల దేవాలయాల్లో అన్నిటా స్త్రీ పురుషులకు సమాన ప్రవేశం ఉన్నాసరే .... ఒక్కచోట వేరే కట్టుబాటు ఉన్నది కనుక మహిళా హక్కులు మంటగలిశాయంటూ గగ్గోలు పెట్టాలా ? ఆ ఒక్కచోటా కట్టుబాటును చెడగొట్టే తీరాలని పనిగట్టుకుని చట్టుబండలు చేస్తే తప్ప హేతువాదుల హక్కులమ్మల కళ్లు చల్లబడవా ?
అసలు దేవుడన్నదే ఒకభావన... ఒక నమ్మకం. దైవ సంబంధమైన ప్రతిదీ విశ్వాసానికి సంబంధించిన విషయం. శాస్త్రీయత , అశాస్త్రీయతల చర్చకు , హక్కుల పేచీలకు సమానత్వపు కబుర్ల రొడ్డ కొట్టుడుకు దైవసన్నిధి వేదిక కాదు , సందర్భమూ కాదు. దేవాలయ వ్యవహారాల్లో ఆచారానికి మాత్రమే ప్రాధాన్యం గలదన్న మాటను ప్రతివారు గుర్తించియుంచుకోవాలి. ఏది ఆచారం ? ఏది నియమం ? అన్నది సంబంధిత దేవస్థాన విశ్వాసాలకు , ప్రకటిత విధానాలకు నప్పినా , నప్పక పోయినా అందరికీ అదే శిరోధార్యం. అదిగో - ఆ ఉద్దేశంతోటే కేరళ హైకోర్టు శబరిమల క్షేత్రంలో 10-50 - ఆ మధ్య మయసుగల స్త్రీల ప్రవేశాన్ని నిషేధించడం సబబేనని 15 ఏళ్ల కిందట తేల్చి చెప్పింది. శబరిమల క్షేత్రంలో యాత్రికుల సౌకర్యాల ఏర్పాట్లను సమన్వయం చేయవచ్చుకానీ గర్భాలయంలో అడుగుపెట్టరాదని కె.బి. వత్సలకుమారి అనేయుక్తవయస్సు జిల్లా కలెక్టర్ను గతంలో న్యాయస్థానం ఆదేశించింది. కేరళలో కమ్యూనిస్టు , కాంగ్రెస్ అన్నతేడా లేకుండా ఏ పార్టీ రాజ్యమేలినా అనున్యూతపు సంప్రదాయాన్ని ఆ విజ్ఞతతోటే రాష్ట్రప్రభుత్వం మన్నిస్తూ వచ్చింది. మతాచారాల్లో , మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదన్న వివేకంతోటే ఇప్పుడున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఆలయ సంప్రదాయం విషయాన్ని దేవస్థానం బోర్డు నిర్ణయానికి వదిలేసింది. 10-50 వయస్సు స్త్రీల ప్రవేశంపై శతాబ్దాలుగా అనుసరిస్తున్న నిషేధం స్పష్టీకరించింది. ఇందులో ఆక్షేపించవలసింది కొనసాగుతుందని ఏమీలేదు.
*మిగతా భాగం రేపు చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*