*శ్రీదేవీభాగవతము - 52*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 12*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 52*


*సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా!*

*సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*"రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం"*

*రాక్షసుల పశ్చాత్తాపం*  చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*ఇంద్రకృత దేవీ స్తుతి మరియు ప్రహ్లాదకృత దేవీస్తుతి*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *ఇంద్రకృత దేవీస్తుతి* 🙏


దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేట్టు ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహామేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి.


*జయ దేవి మహామాయే శూలధారిణి చాంబికే!*

*శంఖచక్రగదాపద్మ ఖడ్గ హస్తే౬భయప్రదే!!*

 

*శూల - శంఖ - చక్ర - గదా - పద్మ - ఖడ్గాలను ధరించిన ఓ మహామాయా !* 

*ఓ జగదంబికా! ఓ అభయప్రదా ! నీకు జయము జయము.* 

*ఓ భువనేశ్వరీ ! దశతత్వాత్మికా ! మహాబిందు స్వరూపిణీ !* 

*మహాకుండలినీరూపా ! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణాగ్నిహోత్రవిద్యా !* 

*దీపశిఖాత్మికా ! పంచకోశాంతర్నివాసినీ !* 

*బ్రహ్మస్వరూపిణీ ! ఆనందకళికా ! సర్వోపనిషత్సమర్చితా !* 

*ఓ జగన్మాతా ! నమోనమః, నమోనమః.*


*నమస్తే భువనేశాని శక్తి దర్శనవాయికే!* 

*దశతత్త్వాత్మికే మాతర్మహాబిందుస్వరూపిణి!!* 


*మహాకుండలినీరూపే సచ్చిదానందరూపిణి!* 

*ప్రాణాగ్నిహోత్రవిద్యే తే నమో దీపశిఖాత్మికే!!* 

*పంచకోశాంతరగతే పుచ్ఛ బ్రహ్మస్వరూపిణి!*

*ఆనందకలికే మాతః సర్వోపనిషదర్చితే!!*  


*అమ్మా !* ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం. రక్షించు. జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు.మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించేవారికి నిరంతరమూ సుఖాలే. ధ్యానించనివారికి నిరంతరమూ దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధవిముక్తులై సంసారసాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావవేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణకోసమే నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికెలో తొలగించగల ప్రతాపం నీది.


కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టినీ నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్యచరితం తెలుసన్నవాడెవడూ లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులూ మహామునీశ్వరులకు కూడా నీ యథార్థతత్వం తెలియదు. నిగమాగమాలకే అందదు అంటే ఇక నాబోటి మందబుద్ధులమాట చెప్పాలా ?


*ధన్యాస ఏవ తవ భక్తిపరా మహాంతః* 

*సంసార దుఃఖరహితా సుఖసింధుమగ్నాః!* 


*యే భక్తిభావరహితా న కదాపిదు:ఖాం* 

*బోధిం జనిక్షయ తరంగ ముమే తరంతి!!*


*అమ్మా! ఉమాదేవీ !* నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకుని సుఖసముద్రాలలో ఓలలాడుతున్నారు. నీపట్ల భక్తి భావం లేనివారు జననమరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికీ ఈదలేకపోతున్నారు. జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు. ఉపహారాలు సమర్పించి ఉంటారు.


*యే వీజ్యమానాః సితచామరైశ్చ* 

*క్రీడంతి ధన్యాః శిబికాధిరూఢాః!*

*తై: పూజితా త్వం కిల పూర్వదేహే నానోపహారైరితి చింతయామి!!*


సామంతరాజులు సమర్పించిన విలాసినీ బృందాలతో సేవలు అందుకుంటూ అంబారీ ఏనుగులపై పురవీథులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపినవారై ఉంటారు.


*యే పూజ్యమానా వరవారణస్థా* *విలాసినీబృంద విలాసయుక్తాః!!* *సామంతకైశ్చోపనతైర్వజంతి మన్యే హితైస్వం కిల పూజితాసి !!*


ఇలా దేవేంద్రుడు భక్తిప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షమయ్యింది. నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు ధరించింది. కళ్ళలో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు రాజిల్లుతున్నాయి.


*ఏవం స్తుతా మఘవతా దేవీ విశ్వేశ్వరీ తదా!* 

*ప్రాదుర్బభూవ తరసా సింహారూఢా చతుర్భుజా!!* 

*శంఖచక్రగదాపద్మాన్ బిభ్రతీ చారులోచనా!*

*రక్తాంబరధరా దేవీ దివ్యమాల్యవిభూషిణీ!!* 


*భోదేవాః !* భయపడకండి. ఇదిగో ఇప్పుడే నాకు ఆనందం కలిగిస్తున్నాను - అంటూ ఆ విశ్వసుందరి దైత్యులవైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు చండముండవినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటభులను మట్టు పెట్టింది. ఇప్పుడు మనగతీ అంతే అనుకున్నారు.


🙏 *ప్రహ్లాదకృత దేవీస్తుతి* 🙏


ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం ? ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది కాబట్టి జగదీశ్వరిని స్తుతించి ప్రసన్నురాలిని చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళానికి పోవడం క్షేమదాయకం - అన్నాడు నముచి. అందరికీ ఈ ఉపాయం నచ్చింది. విష్ణుభక్తుడూ పరమార్ధవేత్త అయిన ప్రహ్లాదుడు అందరిపక్షానా ఆదిశక్తిని స్తుతించాడు.


*మాలాసర్పవదాభాతి యస్యాం పర్వం చరాచరమ్!*

*పర్వాధిష్ఠాన రూపాయై తస్యై స్త్రీమూర్తయే నమః!!* 


*జగద్ధాత్రీ !* ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలాసర్పంలాగా (మిథ్య) భాసిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు. హ్రీం బీజాక్షరరూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావరజంగమాత్మకమైన ఈ విశ్వం నీ వల్లనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్తమాత్రులు. నువ్వు నిర్మించి నియమించినవారు. 


*ఓ మహామాయా!* అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలనీ దైత్యులనీ నీవారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి ! మంచివాళ్ళయినా చెడ్డవాళ్ళయినా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతలపట్ల, మాపట్లా నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటివారైనా నీ బిడ్డలు నీ బిడ్డలే. నవ్వు విశ్వజవనివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి.


*యాదృశాపాదృశా మాతస్సుతాస్తే దావవాః కిల!*

*యతస్త్వం విశ్వజవనీ పురాణేషు ప్రకీర్తితా!!* 


పోనీ, దేవతలు సర్వాత్మనా మంచివారా అంటే అదీకాదు. వారి స్వార్థం వారికి ఉంది. మా స్వార్థం మాకూ ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొకరకం మోహమే అవుతుంది. ధన దారాది లౌకికభోగాలలో మేమెంతగా సంసక్తులమై లంపటులమై రేయింబవళ్ళు క్రీడిస్తుంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తూంటారు. ఇంక తేడా ఏమిటి ? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు ? అదీకాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం. కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వారు జన్మించారు. మరి వారిపట్ల నీకు ప్రేమ, మాపట్ల ఈ కోపం - ఇది నీకు జననీ ! ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరినీ సమానంగా చూడవలసిన కన్నతల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా ?


నీ సృష్టి త్రిగుణాత్మకంకదా ! గుణాలలో ఉన్న భేదం గుణులలోనూ ఉంటుందికదా ! ఇంతకుమించి సురాసురులకు భేదం ఏముంది ?


కామక్రోధాదులు దేహధారులందరికీ సమానం. కుతూహలంకొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటూంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. లేకపోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి ?


*అమ్మా !* ధర్మాధర్మాలు నాకూ తెలుసు. ఇంద్రుడు ఎటువంటివాడో బాగా ఎరుగుదును. భోగభాగ్యాలకోసమేకదా మా తగువులన్నీ. 


*జగదీశ్వరీ !* ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైకశక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవడూ ఏమీ చెయ్యలేడు. అలనాడు క్షీరసముద్రమథన సమయంలో అమృతాన్నీ మణిరత్నాలనూ పంచి పెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావబీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు. లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని కామధేనువునూ ఉచ్చైఃశ్రవాన్ని తనవారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మం ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. 


కన్న తల్లివి నువ్వే కాదంటే నేనింక ఎవరితో చెప్పుకోను ? ఎవరిముందు నాగోడు వెళ్ళబోసుకోను ? అమ్మా ! అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉంది అంటావా ? ఏది ధర్మం ? ఏది కార్యం ? ఎవడు సజ్జనుడు ? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలూ నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా ?


తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు. వేదవిదులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకర్మకమనీ అకర్మకమనీ పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి ? ఏకకర్మకమైన ఏకకర్మలో భేదభావం పొసగదుగదా ! వేదాలలో ఏకవాక్యత లేదు. వేదవిదులలో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాలలో లేదు, శాస్త్రవేత్తలలోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనపడుతోంది. నాబోటివాడికి నిస్పృహ కాక మరింకేమి మిగులుతుంది ?


పోనీ వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి తెలిసీ చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మాధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలిని పూర్ణగర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇంక నామనుమడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంతా అంతా కాదు. సత్యవ్రతపరాయణుడై వందల యజ్ఞాలు చేశాడు.  దానగుణానికి పెట్టింది పేరు. శాంతస్వభావుడు. సర్వజ్ఞుడు. సర్వపూజితుడు. మహాశూరుడు. అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామనరూపంలో వచ్చి వంచించాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అథఃపాతాళానికి తొక్కివేశాడు.


ఇన్ని అకృత్యాలూ అధర్మాలూ అన్యాయాలూ చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు. వందిమాగధులై కీర్తిస్తున్నారు. 


*అమ్మా !* జగన్మాతవు కనక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణు అంటున్నాం. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం.


*ఏవం జ్ఞాత్వా జగవ్మాతః యథేచ్ఛపి తథా కురు!*  

*శరణా దానవాస్సర్వే జహి వా రక్ష వా పునః!!*


ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశ్వరి అర్థంచేసుకుంది. కరుణామయి కనక ప్రసన్నురాలయ్యింది. 


*ప్రహ్లాదా !* మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపొండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి. నిర్భయంగా జీవించండి. మంచిరోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్యభావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తి నివ్వవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచి పెట్టి రసాతలానికి  వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి.


దానవులు జగన్మాతకు శిరసువంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. ఆది పరాశక్తి అంతర్ధానం చెందింది. దేవతలు తమలోకానికి వెళ్ళిపోయారు. అప్పటినుంచీ దేవదానవులు శత్రుత్వం విడిచి పెట్టి ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. 


ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి. ఉత్తమగతులు లభిస్తాయి.


*(అధ్యాయం - 15, శ్లోకాలు -72)*


*శౌనకాది మహామునులారా !* ఇప్పుడు మన జనమేజయుడికి మరొక కుతూహలం కలిగింది. 


భృగు మహర్షి శాపంవల్ల విష్ణుమూర్తి ఏయే అవతారాలు ధరించాడు, ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలి అనిపించింది. సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు. 


మా గురువుగారు కథక చక్రవర్తి కదా! శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలేగానీ ఎంత అందంగానైనా చెబుతారాయె. ఎంత సేపయినా చెబుతారాయె. ప్రారంభించారు.


*జనమేజయా !* శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో, ఏ ఘనకార్యం సాధించాడో సంక్షేపంగా చెబుతాను. శ్రద్ధగా విను. 


ఈ అవతారగాథలు పాపవినాశకాలు. సర్వశుభావహాలు.


*చాక్షుష మన్వంతరం* లో ధర్ముడిగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు, వారి వృత్తాంతం ఇంతకుముందే చెప్పానుగదా !


రెండవదైన *వైవస్వతమన్వంతరం* లో అత్రిపుత్రుడై దత్తాత్రేయుడిగా అవతరించాడు. పతివ్రతామతల్లి అనసూయాదేవి అత్రిమహర్షికి ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులూ పుత్రులు అయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడై ప్రభవించాడు.


నాల్గవ మన్వంతరంలో శ్రీహరి నరసింహరూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుడిని సంహరించాడు. 


మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దేవకార్యసిద్ధికోసమే. 


ఉత్తమోత్తమమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామనరూపంలో అవతరించి, చిరువంచనతో రాజ్యం అపహరించి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. 


పందొమ్మిదవ త్రేతాయుగంలో జమదగ్నిసుతుడై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమినీ స్వాధీనపరచుకొని కశ్యపుడికి సమర్పించాడు. 


ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై రాముడిగా అవతరించాడు.


ఇరవైయెనిమిదవ ద్వాపరయుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. 


ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు.


ఈ అఖిలజగత్తూ ప్రకృతికి వశంకదా ! ప్రకృతి కోరినట్టల్లా జగత్తు పరిణతి చెందుతూంటుంది. పురుష ప్రీతికోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తునూ నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జేయుడు. నిరాలంబుడు. నిరాకారుడు. నిస్పృహుడు. పరాత్పరుడు. సర్వాది. సర్వగుడు. అవ్యయుడు. పరముడు. ఉపాధి సమాశ్రయణంతో (శరీర ధారణతో) మూడు మూర్తులుగా (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) ప్రకాశిస్తున్నాడు. ఆ పరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో మూడు రూపాలుగా భాసిస్తోంది. జగత్తును సృష్టిస్తోంది. పాలిస్తోంది. కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఆ త్రిమూర్తులూ ఈ త్రిమూర్తులతో కలిసి ఈ మూడు పనులను నిర్వహిస్తున్నారు.


*జనమేజయా !* ఇది మూలతత్త్వం. ఇది విధితంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖదు:ఖాలను అనుభవిస్తున్నారు.


*(అధ్యాయం - 16, శ్లోకాలు - 27)*


*(రేపు....  నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం )*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలనుఅనుగ్రహిస్తున్న ది. 

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat