*చతుర్థ స్కంధము - 13*
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 53*
*సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ!*
*మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*ఇంద్రకృత దేవీ స్తుతి మరియు ప్రహ్లాదకృత దేవీస్తుతి* చదువుకున్నాము.
*అమ్మ దయతో......* ఈ రోజు
*నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం* చదువుకుందాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *నరనారాయణులు అప్పరసలను అనుగ్రహించడం* 🌈
*వ్యాసమహర్షీ !* బదరికాశ్రమంలో నరనారాయణులకు రంభాద్యప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాం. ఆ అప్సరసలు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితలై అతడిని వరించారుగదా ! వివాహమాడి తమతో క్రీడించమనీ, అతడు సృష్టించిన ఊర్వశినీ పదిహేను వేలమంది దివ్యకాంతలనూ ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమనీ, అభ్యర్థించారుకదా ! దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు - ఆ కథాశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి ఆ తరువాయి కథ వినిపించు - అని జనమేజయుడు గుర్తుచేసి అడిగాడు. వ్యాసమహర్షి అందుకున్నాడు.
వారిని శపిద్దామనుకున్న నారాయణుడిని నరుడు వారించాడు. కోపం చల్లార్చాడు. శాంతచిత్తుడై ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా బదులు పలికాడు.
*సుందరాంగులారా !* మేమిద్దరమూ తపస్సులు చేసుకొంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాం. అందుచేత మీ కోరికను మన్నించలేను. నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపొండి. ధర్మం తెలిసినవారెవరూ ఇతరులకు వ్రతభంగం కలిగించరు. నియమాలను గౌరవిస్తారు.
అదీకాక - శృంగారం రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయిభావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అందుచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను.
కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే, స్థాయిభావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులూ కావ్యశాస్త్రవేత్తలు చెప్పినమాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా అకృత్రిమంగా (సహజంగా) ప్రీతిపాత్రుణ్ణి అయ్యానూ అంటే నిజంగా నేనెంతటి అదృష్టవంతుణ్ణి ! నా రూపమూ నా జన్మా ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరుకూడా అర్థంచేసుకోండి. నా వ్రతనియమాలను గౌరవించండి. కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తను అవుతాను.
*విశాలనయనలారా !* ఇరవైయెనిమిదవ ద్వాపరంలో నేను దేవకార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరేవేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రు అవుదురుగాని. అందాకా మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి.
ఇలా చెప్పి నారాయణుడు వారినందరినీ సమాధానపరిచాడు. వారింక కాదనలేక తమ మన్మథజ్వర తీవ్రతను ఉపశమింపజేసుకుని ఇంద్రలోకానికి తరలి వెళ్ళారు. జరిగినదంతా పూసగుచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశారు. అతడూ నారాయణుడి మనో ధైర్యాన్నీ తపశ్శక్తినీ మెచ్చుకున్నాడు. తనకు బహూకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ సౌందర్యం అనుకున్నాడు. అతడు సృష్టించి పంపిన పదిహేనువేలమంది వరాంగనలూ ఇలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణులపట్ల ప్రసన్నుడయ్యాడు.
*జనమేజయా !* అటు పైని నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడివల్లనే కాదు ఎవరివల్లా ఏ విఘ్నమూ ఏర్పడలేదు. నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకున్నారు. అనంతరకాలంలో ఈ ఇద్దరే అలనాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జునులై అవతరించారు. భూభారాన్ని తొలగించారు.
*మహానుభావా ! వ్యాసమహర్షీ !* నువ్వు కృష్ణుడివి (నల్లనివాడు). నారాయణుడూ కృష్ణుడై అవతరించాడు. ఆ అవతార కథను పరిపూర్ణంగా నీ ముఖతః తెలుసుకోవాలని ఉంది. ఇందులో నాకు చాలా సందేహాలున్నాయి.
ఆదిశేషుడూ ఆదినారాయణుడూ బలరామకృష్ణులై జన్మించారుకదా ! మరి వీరి తల్లిదండ్రులు దేవకీవసుదేవులు అన్ని కడగండ్లు అనుభవించారు ఎందుకని ? కాళ్ళకూ చేతులకూ ఇనుప సంకెళ్ళతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాలపాటు బందీలై దుఃఖసముద్రానికి అవతలి ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది ? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడమేమిటి ? కంసుణ్ణి ఎలా సంహరించాడు ? ద్వారకా వృత్తాంతం ఏమిటి ? తరతరాలుగా తాతతండ్రులకు నివాసమై సంపత్సమృద్ధమైన సొంత నగరాన్ని విడిచి పెట్టి శ్రీకృష్ణుడు మరోచోటికి పారిపోవడమేమిటి ? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడమేమిటి ? కృష్ణార్జునులు మహావీరులనెందరినో సంహరించి భూభారం తొలగించారుకదా ! శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జునడు ఏమీ చెయ్యలేకపోయాడు ఎందుకని ? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం కావచ్చునా? వచ్చింది. ఎందుకు వచ్చిందిమరి ? అదిసరే ఇంతటి వాసుదేవుడూ పుత్రశోకం చవిచూశాడు. కడపటికి ఆపమృత్యువు కబళించింది.
ఏమిటి ఈ అన్యాయం ? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా ? దు:ఖాలేనా ?
ద్రౌపది ? అయోనిజకదా ! యజ్ఞవేదిక నుంచి పుట్టింది కదా ! మహాసాధ్వికదా ! లక్ష్మీదేవి అంశకదా ! ఆవిడ ఎన్ని కష్టాలు పడింది ! నిండు కొలువులో అవమానాలు. దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాగడాలు, వలువలు వలవడాలు. అడవిలో జయద్రథుడి దౌర్జన్యం. కొలువులో కీచకుడి దుర్మార్గం. చివరికి అశ్వత్థామ దురాగతంతో - తీరని పుత్రశోకం. అలాగే దేవకీదేవి ఆరుగురు పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండీ సమర్థుడయ్యుండీ శ్రీకృష్ణుడు ఏమి చేసినట్టు ? ఈ పతివ్రతలకు ఇన్ని కష్టాలు రావడమేమిటి ? సరే - ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తనను తానైనా కాపాడుకోలేడా ? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమిటి ? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకను నిర్మించుకోవడం - ఇవన్నీ వింతలే. అన్నీ సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడివి. అంచేత నిన్నే అడుగుతున్నాను. సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు.
అన్నింటికన్నా మించి అతిరహస్యమైన సందేహం మరొకటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచి పెట్టడం లేదు. అలాగని సమాధానమూ దొరకడం లేదు. నీ చెవిని వేసేస్తాను. వీలువెంబడి జవాబు చెబుదువుగాని. అదే - ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందా ? ఒక కులాంగనకు అయిదుగురు భర్తలా ? జుగుప్సితంగా లేదూ ? పశుధర్మం కాదూ ? సదాచారం ఒప్పుతుందా ?
ఇంకొక సంగతి - భీష్ముడు దేవాంశసంభూతుడుగదా ! వంశరక్షణ మిషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా ? గోళకులను (రండా పుత్రులు) పాలకులుగా నిలబెడతాడా ? ఇంతకన్నా ధర్మహాని ఉందా ? వంశం అంతరించిపోవడం నయంకాదూ ! ఎలాగోలాగా పుత్రుణ్ణి పుట్టించుకోవాలి, వంశం నిలబెట్టుకోవాలి అంటూ మహర్షులు చేసిన ధర్మనిర్ణయాన్నీ ధర్మ ప్రచారాన్నీ నేను అసహ్యించుకొంటున్నాను.
*(అధ్యాయం - 17, శ్లోకాలు - 55)*
(జనమేజయుడు అడిగిన పై సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి వ్యాసమహర్షి ఉపక్రమించారు.)
*(రేపు.... భూదేవి మొర )*
🙏 *అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.* 🙏
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏