*చతుర్థ స్కంధము - 16*
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 56*
*మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా!*
*మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా!!*
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*శ్రీహరి పరాధీనత*
*దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......* ఈ రోజు
*వ్యాసకృత యోగమాయా ప్రశంస* చదువుకుందాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *వ్యాసకృత యోగమాయా ప్రశంస* 🙏
*జనమేజయా!* యోగమాయ చెప్పినట్టు ప్రభాసకురుక్షేత్రంలో ధరాభారావతరణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను ఆలకించు.
యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించడం కేవలం ఈ పనికోసమే. భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యం. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరులమాట చెప్పాలా! గర్భవాసదుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలావినోదం.
రామావతారంలో అంతకుమించిన మోహపాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దు:ఖాలు చవిచూపించింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్తసంగులై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యంకాదు. ఆ విశ్వేశ్వరీదేవిని ఉపాసించి ఆ భక్తిలో లేశలేశాంశలేశ లేశలవాంశకాన్ని పొందగలిగితే చాలు జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా? *భువనేశీ!* అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలూ స్వాధీనపరుస్తుంది. *మాం పాహి* అనికూడా అంటే ఇంక ఆ భక్తుడికి ఇవ్వ గలిగింది లేకపోవడంతో జగన్మాత ఋణపడిపోతుంది.
*జనమేజయా!* *విద్య - అవిద్య* అని ఆ మహాశక్తికి రెండురూపాలు. విద్యతో ముక్తుడవుతాడు. అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులూ ఆమెకు వశవర్తులు. అవతారాల పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి.
ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొక్కప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తుంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తుంటాడు. ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తుంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడిమీద పడుకుని యోగనిద్రపోతూ ఉంటాడు. ఏమైనా - ఇంతటి శ్రీమహావిష్ణువూ ఏనాడూ స్వతంత్రుడు కాడు.
బ్రహ్మరుద్రేంద్రవరుణ కుబేర యమాగ్ని రవీందు ప్రభృతి దేవతలూ దేవనాయకులూ ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనకసనందనాది మునీశ్వరులూ వసిష్ఠాది మహర్షులూ అందరూ జగదంబకు వశంవదులే. ఆటబొమ్మలే. ముకుతాడువేస్తే పశువులు ఎలా చెప్పినమాట వింటాయో అలాగే దేవతలంతా కాలపాశనియంత్రితులై జగన్మాతకు వశవర్తులై ఉంటారు.
హర్షమూ, శోకమూ, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలూ అవస్థలూ సకలప్రాణికోటికీ (దేహధారులందరికీ) సమానం. దేవతలను అమరులు (మరణంలేనివారు) - నిర్జరులు (ముసలితనం లేనివారు) - అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాటవరసకే తప్ప, పరమార్ధతః ఇది సత్యం కాదు. ఉత్పత్తి స్థితి వినాశాలూ దేవతలందరికీ ఉన్నాయి. ఇది సత్యం. మరింక అమరులు ఏమిటి, నిర్జరులేమిటి? పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అటు పైని గిడుతున్నారు. వీరిని దేవ - దేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసంకాదు. *(దీవ్యంతి క్రీడంతి సుఖేషు ఇతి దేవాః - సుఖాలలో తేలియాడేవారు)* దు:ఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు మరి? క్షణంలో ఉత్పత్తినాశాలు కనిపిస్తున్నాయి కదా! ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మశకాదుల్లాగా అంతరిస్తున్నారు. అంచేత వీరిని అమరులు (అమరా:) అనడానికి వీలులేదు. “మరా:” అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులనుబట్టి దేవతలనీ మానవులనీ భేదాలు ఏర్పడుతున్నాయి. దేవతలలోకూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ రుద్ర విష్ణువులు. ఇదే క్రమంలో నశిస్తున్నారు. ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు.
*దేహధారికి నాశం తప్పదు. మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం. అనివార్యం.*
మోహజాలంలో చిక్కుకున్నవాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంత కాలమూ మోహం నశించదు. సృష్టిసమయంలో అందరూ ఆవిర్భవిస్తారు. కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశానికి దేన్ని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది. మరొక కారణం ఉండదు. జన్మమృత్యుజరావ్యాధి దు:ఖాలూ సుఖాలూ అన్నీ విధినిర్ణయం ప్రకారమే జరుగుతాయి.
అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్షదైవాలు సూర్యచంద్రులు. వారికీ శత్రుపీడలు ఉన్నాయి. దు:ఖాలు ఉన్నాయి. సూర్యుడి కొడుకు మందుడు (శనీశ్వరుడు). చంద్రుడు కళంకి, క్షయరోగ పీడితుడు (పదిహేను రోజులు క్షీణదశ), చూశావా జనమేజయా! ఎంతటివారికైనా విధిసూత్రం అనుల్లంఘ్యం.
వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్దులు గరపిన చతుర్ముఖుడు సొంతకూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెందాడు. శివుడంతటివాడు భార్యావియోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంతగా దుఃఖించాడో. అందరకీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు.