*జగన్మోహినీ కేశవస్వామి ర్యాలీ , తూ.గో. జిల్లా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
శ్రీ శబరిమల యాత్రలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు మణికంఠునికి జన్మనిచ్చిన శ్రీ జగన్మోహినీ (విష్ణు మాయా విలాసం) అవతారమూర్తిని తప్పక దర్శించుకోవాలని మీకెవరికైనా తెలుసా ? తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం , రావులపాలెం తాలూకా ర్యాలీ గ్రామంలో గౌతమి మరియు వశిష్ఠ పవిత్ర ఉభయ గోదావరి నదీపాయల మధ్య వెలసియున్న శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి పవిత్ర పాద సన్నిధిని స్వామి దీక్షలో ఉన్న ప్రతి అయ్యప్ప భక్తుడు దర్శించుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి తెలుసుకుందాం. క్షీరసాగర మధన సమయంలో లభించిన అమృతాన్ని దేవతల , రాక్షసుల కోరిక మేరకు పంచదలచిన శ్రీ మహావిష్ణువు తన విష్ణుమాయా విలాసంతో జగన్మోహినిగా అవతరించి , అమృతభాండాన్ని చేతబట్టి దేవతలను , రాక్షసులను రెండు వేర్వేరు వరుసలలో జగన్మోహినీ రూపంలో ఉన్న శ్రీహరి కూర్చొండబెట్టెను.
అమృతాన్ని పంచేటప్పుడు శ్రీ మహావిష్ణువు తన విష్ణుమాయా విలాస జగన్మోహిని దేవతలకు పురుషరూపం లోనూ (కేశవరూపం), రాక్షసులకు ముఙ్గగాలను మోహంలో ముంచే మోహినీ రూపంలోను అనగా ద్వయరూపాలు గల జగన్మోహినీ కేశవ స్వామి అమృతాన్ని పంచి అధర్మవర్తనులైన రాక్షసులకు అమృతం దక్కకుండా చేసి , దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి ఇచ్చెను. జగత్ కళ్యాణానికై మొదటిసారిగా శ్రీ మహావిష్ణువు జగన్మోహినీ అవతారాన్ని దాల్చెను. తదుపరి ఘట్టంలో అనంత జగాలను సమ్మోహంలో ముంచే జగన్మోహన సుందరకారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణుమాయా విలాసాన్ని స్వయంగా వీక్షించాలన్న శంకరుని కోరిక మేరకు మరియు శ్రీ శంకర వరబల గర్వితుడైన దుష్ట భస్మాసురుని నుండి లోకాలను రక్షించు నిమిత్తం రెండవసారి జగన్మోహినీ రూపిణిగా శ్రీ మహావిష్ణువు అవతరించెను. జగన్మోహిని ఈశ్వరుల ఏకత్వం హరిహరాత్మజుడైన మణికంఠుని జన్మకు కారణమై దుష్ట మహిషి వధ జరిగినది. క్షీరసాగరోద్భవమైన అమృతాన్ని దేవతలకు పంచిన తరువాత జగన్మోహినీ రూపంలో ఉన్న శ్రీ మహా విష్ణువు దివ్య రథాన్ని అధిరోహించి మనో వేగంతో సమానమైన వేగంతో వెళ్తుండగా సహస్రకోటి దివ్య మన్మధుల సౌందర్యాన్ని సహితం తలదన్నే శ్రీహరి ముగ్దమోహన రూపాన్ని చూసిన గరళ కంఠుడు విష్ణుమాయా ప్రభావానికి మోహితుడై జగన్మోహినిని వెంబడించగా సహస్ర కోటి సూర్యుల తేజస్సుతో సమానమైన తాపజ్వాలలతో వెంబడిస్తున్న త్రయంబక రుద్రుణి నివారింపదలచి శ్రీ మహా విష్ణువు వెనక్కి తిరిగి తన నిజరూపమైన విష్ణురూపాన్ని (కేశవ రూపం) చూపెను. ఇదంతా విష్ణుమాయా విలాసమని భావించిన పరమేశ్వరుడు సిగ్గుతో నిశ్చేష్టుడయ్యెను.
పై కథా ఘట్టంలో దివ్య రథారోహితుడై వెళుతున్న జగన్మోహిని యొక్క రథాశీల రాలి భూమిపై ఉభయగోదావరీ నదీపాయల మద్యపడెను. రథముయొక్క శీల ఈ క్షేత్రంలో రాలింది కాబట్టి ఈ క్షేత్రానికి ర్యాలి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలోని అవతారమూర్తి శ్రీ జగన్మోహినీ కేశవస్వామి సాలగ్రామశిలతో ఏకశిలగా 5 అడుగుల ఎత్తుగల స్వయంభూ మూర్తిగా వెలసి భక్త కోటికి తన కరుణామృతాన్ని పంచి ఇస్తున్నారు. సుమారు 1,000 సం॥ లకు పూర్వం చోళరాజులు ద్రావిడ బ్రాహ్మణులతో కలసి భూగర్భంలో లభించిన ఈ స్వయంభు దివ్య మూర్తికి ఆలయం నిర్మించినట్లు చరిత్ర కథనం. జగన్మోహినీ కేశవస్వామి ఆలయానికి అభిముఖంగా శ్రీ ఉమాఖమండలేశ్వర స్వామి ఆలయం ఉన్నది. యావద్భారతదేశంలో జగన్మోహినీ అవతార రూపిణిగా వెలసిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ర్యాలీ క్షేత్రంలో మాత్రమే ప్రావుద్భవించింది. విష్ణుపాదోద్భవి అయిన గంగ జగన్మోహినీ స్వామి కుడి తొడ మీద తెల్లని పుట్టు మచ్చ కనిపించడం వల్ల పద్మినీ జాతి స్త్రీగా భక్తులు కొనియాడుతారు.
*ప్ర॥ పైన చెప్పి న దివ్యక్షేత్రాన్ని అయ్యప్పస్వామి భక్తులు ఎందువలన దర్శించుకోవాలి ?*
జ॥ లోక కంఠకురాలైన మహిషి వధ జరిగిన తరువాత తన అవతార ప్రయోజనం నెరవేరిందని భావించిన హరి హరసుతుడు అయ్యప్ప స్వామి తన తండ్రిగారైన పందళరాజుని ఒప్పించి , తల్లిదండ్రుల అనుమతితో కలియుగంలోని భక్తులను తరింపజేయుటకుగాను శబరిమల క్షేత్రాన్ని తన నివాసంగా చేసుకొని తపస్సమాధిలో , యోగ పట్టాసనాధీశుడై , చిన్ముద్ర దారియై వెలసెను. మణికంఠుని అభీష్టం మేరకు పందళరాజు నిర్మించిన దేవాలయానికి అగస్త్య మహాముని ఆధ్వర్యంలో పరశురాముడు తాంత్రిక పూజాదులతో కూడిన మంత్రములతో అయ్యప్ప స్వామికి విగ్రహ ప్రతిష్ట గావించెను. అయ్యప్ప స్వామివారి కోరిక మేరకు అప్పటి ర్యాలీ క్షేత్రంలో కొలువున్న జగన్మోహినీ కేశవ స్వామి ఆలయం యొక్క ప్రధాన అర్చకుడినే అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధాన తంత్రిగా పాండ్యదేశపు రాజు నియమించెను. ఇప్పటికీ ఆ వంశంవారే కేరళవారి సంస్కృతి సంప్రదాయాలతో కలిసిపోయి ప్రధాన తంత్రాలుగా తరతరాలనుండి కొనసాగుతున్నారు. మరి ర్యాలీ క్షేత్రంలో వెలసిన జగన్మోహినీ కేశవస్వామి వారి యొక్క అర్చకుడినే శబరిమల క్షేత్రానికి కూడా అర్చకత్వం చెయ్యాలన్న మణికంఠుని అభీష్టం ర్యాలీ క్షేత్ర ప్రత్యేకతను తెలియజేస్తుంది. అందువలన ఇరుముడి శిరస్సున ధరించి , శబరి యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప భక్తులు మణికంఠుని మాతృమూర్తి అయిన జగన్మోహిని స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో ఎవరికి వారు వేసుకోదగ్గ ప్రశ్న.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*