అయ్యప్ప సర్వస్వం - 58 *ర్యాలీ క్షేత్రానికి రూటు*

P Madhav Kumar


*ర్యాలీ క్షేత్రానికి రూటు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


తూ.గో. జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ నుండి రావులపాలెం వెళ్ళడానికి ప్రతి 10 ని.లకొకసారి ఆర్.టి.సి. బస్సులు మరియు టాక్సీలు ఉంటాయి. రావులపాలెం జంక్షన్ నుండి సుమారు 6కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడికి చేరుకోడానికి రావులపాలెం నుండి ప్రతి 2 ని.లకొకసారి ఆటోలు దొరుకుతాయి.


*పరిశీలించదగిన విషయం:*


హరిహరసుతుడైన శ్రీ మణికంఠుని జన్మవృత్తాంతము గూర్చి వేద వ్యాస మహర్షి విరచితమైన సంస్కృత మహా భాగవత కథా ఘట్టాలలోగాని మరియు పరమ భాగవతోత్తముడైన పోతనామాత్యుని యొక్క ఆంధ్ర మహా భాగవతంలో గాని మరియు అష్టాదశ పురాణాల గురించి సంపూర్ణ మీమాంసకు చర్చా వేదికయిన నైమిశారణ్యం యందు గల సూత , శౌనకాది మహా మునుల సంభాషణల మద్యగాని కనపడదు. కానీ 5సం||ల బాల్యదశలోనే సమస్త వేదార్థాలకు భాష్యం చెప్పగలిగేటువంటి అపార పాండిత్యంను తన స్వంతం చేసుకున్న పాత్రులై ఆ సేతు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జగన్మాత కృపకు హిమాచల పర్యంతం భారతదేశం అంతటా పాదయాత్రలు చేస్తూ , అష్టాదశ శక్తి పీఠాలను స్థాపిస్తున్న కాలంలో అయ్యప్ప స్వామి యొక్క జన్మ వృత్తాంతం ఆది శంకరాచార్యుల వారి ద్వారా క్రీ.శ. 8వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చినది. అంత వరకూ అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం గురించి ఎవ్వరికీ తెలియదు.


ఆదిశంకరాచార్య విరచిత శాస్తాస్తుతిలో కూడా "అయ్యప్ప అను మాటను ఆది శంకరాచార్యులు ఎక్కడా ఉచ్చరించకపోవడం గమనించదగ్గ విషయం. భూతనాథుడు , సదానందుడు , మహాబాహుడు , శ్రీధర్మశాస్త , మణికంఠుడు అను నామములు మాత్రమే శాస్తాస్తుతిలో ఉచ్చరించబడినవి. కానీ *గుహ్యాతి గుహ్య గోప్రేనమః* అను దానికి రహస్యములలోకెల్ల రహస్యాతి రహస్యమైన భగవంతుడు అను వేరొక అర్థం కూడా కలదు. సంస్కృత నిఘంటువులో హరిహరాత్మజుడు కాలభైరవుడు అని చెప్పబడినది. ఏది ఏమైనప్పటికీ దైవ సాక్షాత్కారం పొందిన కారణజన్ములు జగద్గురు ఆదిశంకరా చార్యుని దివ్యవాక్కులు భక్తకోటికి శిరోధార్యం.


ప్రశ్న॥ దుష్ట గ్రహాలకు అయ్యప్పస్వామికి ఉన్న సంబంధం ఏమిటి ? మరియు అయ్యప్పస్వామి దీక్షకు ఎందుకింత ప్రాచుర్యం లభించింది?


జ||  అయ్యప్ప స్వామి అష్టోత్తరంలో *ఓం దుష్ట గ్రహాధిపాయనమః* అని చెప్పబడియున్నది. పూర్వ జన్మలలో జీవులు చేసుకున్న పాప పుణ్య కర్మల పర్యవసానంగా జీవుడు అనేక జన్మలను ధరించి ఆత్మతో సంబంధంలేని శరీర స్పృహతో అనేక సుఖదుఃఖాలు , లాభ నష్టాలు పొందుతూ ఉంటాడు. ఆ కారణంగా పుట్టిన ప్రతి శిశువు యొక్క జాతక చక్రంలో విధి లిఖితానుసారం నవగ్రహ స్థితిగతులు మరియు వాటి ప్రభావ ఫలితాలు ఉంటాయి. దుష్ట గ్రహ సంచారం మరియు శుభగ్రహ వీక్షణం ఇవన్నీ కేవలం జీవుని యొక్క ప్రారబ్ధ కర్మ  పర్యవసానాలు మాత్రమే. ఈ కారణాల వలనే ఒక జీవి ఆకాశహర్యాలు లాంటి భవంతులలో జీవిస్తూ , అన్ని భోగ భాగ్యాలతో తులతూగుతూ , ఆనందంగా జీవిస్తుంటే అదే సమయంలో మరొక జీవి ఒక్క పూట తిండికి కూడా గతిలేక , శరీరాన్ని కప్పుకోడానికి చింకిరి వస్త్రాలైన లభింపక , దుర్భర దారిద్ర్య స్థితిని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. ఒక జీవి తన కుమార్తెకి వివాహం జరిగిందని వేడుకలు చేసుకుంటూ ఉంటే... అదే సమయంలో మరొక జీవి తన ఒక్కగానొక్క కొడుకు మరణించాడని రోధిస్తూ ఉంటాడు.


ఒక జీవికి మంచి ఉద్యోగం లభించిందని ఉల్లాసంగా ఉంటే... అదే సమయంలో మరొక జీవి వ్యాపారంలో లక్షలు నష్టం వచ్చిందని విచారిస్తూ ఉంటాడు. ఇదంతా జీవునికి శరీరపు జ్ఞానంనకు లోబడి ఒకే కాలంలో ద్వంద్వ స్థితులను అనుభవిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రతి జీవి యొక్క మలుపుకి గెలుపుకి నవగ్రహ సంచారానికి సంబంధం ఉంది. నవగ్రహాలలో అన్ని గ్రహాల కంటే మిన్నగా అతి కౄర గ్రహాలు మరియు దుష్ట గ్రహాలు అయిన కుజగ్రహం , శని గ్రహం , రాహు గ్రహం , కేతు గ్రహం వంటివి మానవ జీవితంపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి.


1. కుజ గ్రహ దుష్ట వీక్షణం వలన వివాహాదులు జరగవు. కుటుంబ కలహాలు , అన్నదమ్ములతోను , ఆత్మీయులతోను , నిత్య ఘర్షణలు , ఆస్థి తగాదాలు , భూమి తగువులతో జీవులు ఒకరితో ఒకరు పోట్లాడుకుని మరణిస్తారు. విపరీతమైన ఋణబాధలతో ఉక్కిరిబిక్కిరాడక జీవులు పతన స్థితికి చేరుకుంటారు. వాహనాల యందు ప్రయాణిస్తున్నప్పుడు మరణం సంభవిస్తుంది. కానీ కుజుని శుభవీక్షణం వలన శీఘ్రంగా వివాహాలు జరుగుతాయి. భార్యభర్త మధ్య స్నేహితుల మధ్య , బంధువుల మధ్య సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి. భూములు , వాహనాలు , ఇండ్లు కొంటారు. ఏ రంగంలో ఉన్నా తిరుగులేని అధికారం , మాట చలాయింపు ఉంటుంది.


2. శని గ్రహ దుష్ట వీక్షణం వలన జీవునికి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేటటువంటి దుర్భర పరిస్థితులు ఎదురవుతాయి. అడుగడుగునా అపజయాలు , నిరాశ , నిస్పృహ , నిస్సత్తువ అకాల భోజనం వంటివి సంభవించును. కానీ అదే గ్రహము యొక్క శుభవీక్షణం వలన మట్టి పట్టుకుంటే బంగారమైనట్లు సర్వకాల సర్వావస్థలయందు జీవుడు ఆనందంగా ఉంటాడు.


3. రాహు గ్రహ కేతు గ్రహ దుష్ట వీక్షణం వలన ఆదాయానికి మించిన ఖర్చులు , ఎప్పటికీ తీరని ఋణ వ్యవహారాలు , నీచుల వద్ద ఊడిగం చెయ్యవలసిన దుర్భర పరిస్థితులు , సప్త వ్యసనాలు , ప్రకృతికి విరుద్ధమైన కోర్కెలు , పాషాణంలాంటి హృదయం , దేశ విద్రోహ చర్యలకు పాల్పడటం. దయ్యాలు ఆవహించుట , పీడకలలు వంటివి సంభవించును. కానీ అదే గ్రహ శుభ వీక్షణం వలన శత్రువు నుండి కూడా ఎంతో కొంత లాభాన్ని పొందగల నేర్పు ఉంటుంది. ఆధ్యాత్మిక భక్తి తత్వచింతన ఉంటుంది. మిగతా దుష్ట గ్రహాల యొక్క శుభవీక్షణం గూడ ఉంటుంది. పై నాలుగు దుష్టగ్రహాలు మరియు నవగ్రహాలు సైతం దుష్ట గ్రహాలకు అధినాయకుడైన అయ్యప్ప స్వామివారి అదుపు ఆజ్ఞలకు లోబడి ఉంటాయి. అందుకే అయ్యప్ప స్వామి దీక్షను కఠిన నిష్ట నియమాలతో పూర్తిచేసిన భక్తులపట్ల అన్ని దుష్ట గ్రహాలు శుభవీక్షణం కలిగి ఉంటాయి. తత్ కారణంగా సామాన్య స్థితిలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు దీక్ష ముగిసిన పిదప తాము కలలో కూడా ఊహించనంత అత్యున్నత స్థితికి ఎదుగుతారు.


అందువలనే ఎంతోమంది రాజకీయ నాయకులు , వ్యాపారులు , అధికారులు , పారిశ్రామికవేత్తలు , సినిమా తారలు ఈ సత్యాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించి ప్రతీ సంవత్సరం విధిగా స్వామి దీక్ష తీసుకుంటున్నారు. 1940 సం॥కి కేవలం 100లోపు మాత్రమే ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు 1970 సంవత్సరం నాటికి 2000 సంఖ్యకు పెరిగారు. 1990 సం॥నాటికి లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పెరిగారు. 2002 నాటికి 5కోట్లమారు ఆనాటి నుండి ఈనాటి వరకు అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య లక్షలలో పెరిగినప్పటికీ అంతే పరిమాణంలో భక్తుల హృదయాలలో నిజమైన భక్తి పెరగడం లేదన్నది కాదనలేని సత్యం. దానికి కారణం కొంత మంది భక్తులు స్వామి దర్శనం చేసుకొని శబరిమల కొండను దిగిన వెంటనే 41 రోజుల దీక్షలో ఉన్న స్వరూపం నుండి తమ నిజ స్వరూపానికి (మహిషి లక్షణాలకి) వచ్చేస్తున్నారు. ఇది మారాలి. అపుడే దీక్ష చేపట్టినందుకు ఒక అర్థం , పరమార్థం ఉంటుంది.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat