*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఈ సృష్టిలోని జీవరాశులన్నింటిలో మానవుడు అత్యున్నత శ్రేణి జీవిగా పరిగణింప బడుచున్నాడు. మానవ హృదయము పరిపక్వత నొందుకొలది , అశాశ్వితమైన ఈ శరీరముపై భ్రాంతివీడి , శాశ్వతమైన ఆత్మతత్వమును తెలిసికొన ఆరాటపడుచుండును. జీవాత్మ. పరమాత్మతో అనుసంధానము అయ్యేందుకు ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకోక తప్పదు. ఇది చాలా సాహసోపేతమయినది. అర్ధవంత మయినది. ఆత్మ దర్శనమునకు ప్రతి జీవి క్లిష్టతరమయిన నియమ నిష్టలను పాటించుట తప్పనిసరి. భగవదారాధనకు , ఆధ్యాత్మిక సాధనకు వయస్సుతో నిమిత్తం లేదు.
చిన్న వయస్సులో , యుక్త వయస్సులో ఇవన్నీ యెందుకు , పెద్దవాళ్ళమయిన తర్వాత ఆధ్యాత్మిక చింతన చేయవచ్చులెమ్మను కుంటారు. జీవితం క్షణభంగురం. ఎవరు చెప్పగలరు ? అసలు పెద్దవాడివి కాకుండానే మృత్యువు పాలవుతావేమో ! అందువలన భగవద్భక్తికి , ఆధ్యాత్మిక సాధనకు ఒక సమయము , వయస్సు ఉన్నదనుకోవడం పొరబాటు. స్వాస్థ్యమున్నపుడే సాధన , ధ్యానము , దీక్ష , భజన సాధ్యమవు తుంది. అస్వాస్థ్యము వలన కర , చరణేంద్రియములు అశక్తమైనపుడు , ముసలితనం వచ్చినపుడు , మొదటి నుంచీ అభ్యాసము లేనపుడు భగవంతుని యందు మనస్సు లగ్నం కాదు.
ఈనాడు ప్రజల పరిస్థితి రానురాను కడు శోచనీయంగా దిగజారిపోవుచున్నది. ఎచ్చట చూచిననూ తీవ్రమైన అసంతృప్తి అశాంతి విలయతాండవమొనరించుచున్నది. సామాజిక జీవితము అసంతులితము అయిపోయి , స్థిరత్వమును , శాంతిని కోల్పోయి అలమటించుచున్నారు. పరాజయము , నిరాశ , నిస్పృహ , దుఃఖము వీని కారణముగా రాను రాను జనులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు. క్రమేణా కుటుంబ జీవితము విచ్చిన్నమై పోవుచున్నది. ఈనాటి సాహిత్యంలో మానవుని సహజ వృత్తులు అత్యంత బలీయమైనవిగా అభివర్ణిత మగుచున్నవి.
తనలోని మనోవికారములను అదుపులోనుంచు కొనుటలో గాక , వానిని యధేశ్చగా తీర్చుకొనుటలోనే మానవుని శక్తి , సామర్థ్యములు వెల్లడియగునని భావించబడుచున్నది. సాక్షాత్కరింప జేసుకొని , సాధించ వలసిన ఉన్నతాదర్శము నొకదానిని అంటిపెట్టు కోవడం జరుగుటలేదు. స్వార్థము , స్వప్రయోజనము వలన చేష్టలు అపమార్గం పడుతున్నాయి. ఈనాటి మానవుని ప్రతి అడుగుకూడా ధర్మము తప్పుచున్నది. ప్రతి ఆశ దురాశగా మారుచున్నది. చూపు ప్రేమ రహితమగుచున్నది. వాక్కు సత్యదూరమగుచున్నది. నైతిక విలువలు దినదినానికి దిగజారిపోవుచున్నవి. కుల , మత ద్వేషాలు , ప్రాంతీయ దురభిమానాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇవి సమాజ పతనమునకు, విచ్చిన్నతకు దారితీయును. మానవుడు సంఘజీవి. నైతిక విలువలు కోల్పోయిన జాతికి చరిత్ర వుండదు. అనాదిగా ఘనమైన చరిత్ర కలిగియున్న భారత జాతి గౌరవం నిలబెట్టడానికి సత్ప్రవర్తనగల వారుగా మారటం దేశ సౌభాగ్యానికి సోపానము వంటిది. అనాదిగా ఆధ్యాత్మిక శక్తి సంపన్న దేశం మనది. యుగయుగముల నుండి సద్గురువులకు , సాధుపురుషులకు స్థానమై వారి బోధనలద్వారా సత్యము , శాంతి , ధర్మము , ప్రేమలు విలసిల్లి భారతజాతి నైతిక , ఆధ్యాత్మిక చింతనలతో ప్రపంచ ప్రజలను ప్రభావితం చేశాయి. ఇందుకు ఉత్తమ నైతిక శిక్షణ ఎంతో అవసరం. సమస్త ప్రాణికోటికి హితమొనర్చుటయందు బద్దకంకణులై, ఆహార సంయమనము కలిగి , దైవధ్యానపరులై , ఇంద్రియ నిగ్రహ తత్పరులై పరమార్థ విజ్ఞానమును ప్రపంచము నలుదిసలా వ్యాప్తి చేయవలసిన అవసరమున్నది.
మన అందరిదీ అత్యున్నతమైన భారతీయ ప్రాచీన వేద సంస్కృతి వేదములు అపౌరుషేయములు. ఆస్తికత్వమున కొక జయపతాక వేద ధర్మము. వేదములు సర్వలోక హితకరములు. ఇట్టి వేద ధర్మాచరణము ప్రతివారికీ ఐహికాముష్మిక ప్రదములనుట నిర్వివాదాంశము. *"ధర్మోరక్షతి రక్షితః"* - ధర్మమును మనము రక్షించిన ఆ ధర్మము సర్వదా మనలను రక్షింపగలదు. కావున ధర్మయుక్తమైన తత్కర్మాచరణము ఎల్లరకు శ్రేయస్కరము. అందున నిత్య భగవదారాధన చాలా విశిష్టమైనది. అందుకే భగవద్గీతలో.....
*తస్మాత్సర్వేషు కాలేషు మామన్మురయుద్ధచ మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్య సంపశయః*
సర్వకాలములయందు భగవన్నామస్మరణగావింపుచూ , మనో బుద్ధులను భగవదాయత్తమొనర్చు వానికి భగవంతుని సాన్నిధ్యము తప్పక లభించును. ఇట్టి స్థితికి అనన్యమైన భక్తి భావము చాలా ప్రధానమైనది. భగవంతుడు భక్త సులభుడు అనుటకు భగవద్గీతలో
*పురుషస్య పేరః పార్థ భక్త్యాలభ్య స్వనన్యయా | యస్వాంతస్తానిక భూతానియేన సర్వ విదంతతమ్ ॥*
కావున భక్తి భావము కలిగి , యెల్లవేళలయందు భగవదారాధన నామస్మరణ మొనర్చుట వలన జీవన్ముక్తులు కాగలరు. ఇందుకు శబరిమల అయ్యప్ప స్వామి మండల వ్రతదీక్ష , యాత్ర , ఒక విశిష్టతను సంతరించుకొని , నేటి ఆధునిక యుగములో మానవుడు తన్ను తాను తెలుసుకొనేందుకు చేసే ప్రయత్నంలో అత్యున్నత శ్రేణి మార్గముగా నెంచదగి యున్నది. మన పవిత్ర భారతదేశమున మహా పుణ్య ప్రదములైన అనేక పర్వతములు , పరమ పవిత్రమైన ఎన్నో నదీ నదములు , ఎన్నో పుణ్య తీర్థములు , ఎన్నో పుణ్యక్షేత్రములు గలవు.
పవిత్ర ప్రదేశముల దర్శనము వలన , ఆ క్షేత్రమున నడయాడుట వలన , ఆ నిర్మల ప్రశాంత వాతావరణములో ఆచరించు స్నాన , దాన , వ్రత, తపో , యోగాదుల వలన సర్వపాపములు నశించును. పుణ్యము లభించును. ఈ యాత్రల వలన శరీరమునకు , ఇంద్రియములకు , మానసమునకు శుద్ధి లభించును. సంసారమున కృంగి పరితపించు చుండు గృహస్తులును తమ జీవిత కాలమున నొకసారియైనను శబరిమల పుణ్యక్షేత్ర యాత్ర , అయ్యప్ప స్వామి దీక్ష , నిర్వహించి ధన్యులగుటకు ప్రయత్నించవలయును. ఈ యాత్ర వలన ప్రకృతి సౌందర్య శోభిత పుణ్యభూములు , ఋష్యాశ్రమములు , క్షేత్రములు , వివిధ ప్రాంతములలోని ప్రజల ఆచార , వ్యవహారములు , సంస్కృతి , మరియు వివిధ దేవాలయ శిల్ప నిర్మాణ రీతులు పరిశీలించగలిగే మనోజ్ఞ విజ్ఞానయాత్రగా భావించవచ్చును.
*మరికొంత భాగం రేపు చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*