_*అయ్యప్ప సర్వస్వం - 60*_ *శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 2*

P Madhav Kumar


*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 2*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష , శబరిమల యాత్రలో ఒకరికొకరు అందించు సహకారము వలన సహనము పెంపొంది దీనులయందు కనికరము. పరుల కష్టములు తనవిగా భావించు సామ్యమేర్పడును. ధర్మచింతన కల్గును. నిత్యకృత్యములలో , సాధనయందు ఏకాగ్రత హెచ్చి , బుద్ధివిశాలత పెరిగి , హృదయమునకు శాంతి లభించును. అందుకే..


*క్రియా క్రమేణమహతా తపసానియమేన చ దానేన తీర్థయాత్రాభి శ్చిరకాలం వివేకతః । దుష్కృతే క్షయమాపన్నే పరమార్థ విచారణే కాకతాళీయ యోగేన బుద్ధిర్జన్తోః ప్రవర్తతే ॥*


అని యోగవాశిష్టములో , చిరకాల నియమ నిష్టలతో తానొనర్చిన గొప్ప పుణ్యకర్మలచేతను , తపస్సు చేతను , దానధర్మములు చేతను , తీర్థ యాత్రలచేతను , సకల పాపక్షయముకాగా పిదప  మనుష్యునకు హృదయము నిర్మలమై కాకతాళీయన్యాయమున పరమార్థ విచారణయందు బుద్ధి ప్రవర్తించును. మానవుడు తాను , పరమాత్మ. ఈ సృష్టి వేరువేరుగా భావించుకొనును. జ్ఞానికి ఈ మూడును ఒక్కటిగానే తోచును. మాయకు లోనై , విద్య , అవిద్యలకు , కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యములను అరిషడ్వర్గములకు బానిసయైన మానవునకు భగవంతుని తెలిసికొనుట అసాధ్యము.


అందువలన రాగద్వేషముల నుండి మనస్సు మరల్చి , అహంకారము లను పారద్రోలి , సంపూర్ణ శరణాగత భావమును అలవరచు కొనుటద్వారా భగవంతుని సాన్నిధ్యమునకు చేరువగుటకు మార్గము సుగమము కాగలందులకు అయ్యప్ప దీక్ష , శబరిమల యాత్ర ఎంతో ఉపకరించును. నేటి ఆధునిక యంత్రయుగములో శబరిమల అయ్యప్ప స్వామివారి సందర్శనకు నిర్దేశించిన మండలకాల దీక్ష , నియమములు ఇందుకు ఎంతైనా ఉపకరించుననుటలో సందేహము లేదు. కుల , మత , వర్గ , వర్ణ విచక్షణ లేకుండా అందరికి బ్రహ్మత్వాన్ని , బ్రాహ్మణత్వాన్నీ ఆపాదించే ఉత్తమ మానవతా తత్వము ఈ స్వామిదీక్షలో యున్నది. హిందువులు , మహమ్మదీయులు , క్రైస్తవులు , హిందూజాతిలోని బ్రాహ్మణేతరులు , సభ్య సమాజముచే వెలివేయబడిన అస్పృశ్యులు , నిమ్నజాతులు , దళితులు అందరికీ ఈ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనమునకు అవకాశము కలదు. ప్రతి అయ్యప్ప భక్తుడూ మామూలు జీవితములో తనకుగల ఆభిజాత్యము , సాంఘిక స్థితిగతులు విస్మరించి , తాను అయ్యప్పగా , సాటి మనిషిని అయ్యప్పగా భావించి , వినయవిధేయతలతో *"స్వామిశరణం"* చెప్పుకుంటూ తరతమ భేదములను విస్మరించి , పవిత్ర భావముతో అందరితో సహజీవనము కొనసాగిస్తూ , సోదరభావంతో , సమతా , మమతా , మానవతా వెల్లివిరిసే సమసమాజ స్థితి మనకు ఈ యాత్రలో గోచరిస్తుంది. సర్వులకు శబరిమల దేవాలయము ఆత్మ దర్శనమునకు సోపానముల నేర్పరచుకొనుటకు స్వాగతం పలుకుతుంది.


మానవ సేవయే మాధవ సేవ. జీవుడే దైవము. సకల జీవరాసులతో నుండే పరమాత్మ (ఆత్మ) ఒక్కటేయను దివ్యభావమును గ్రహించి , ప్రేమతోనూ , సహకార భావముతోనూ జీవిస్తూ , హెచ్చు తగ్గులు , తారతమ్యములు , పేద ధనిక భావములు లేక అంతా ఒక్కటే , అంతా దైవ ప్రతిరూపులే అని తెలిసికొనుటయే శ్రీ స్వామి అయ్యప్ప దీక్షలోని ప్రధానోద్దేశము. మండలదీక్షా సమయములో అయ్యప్ప భక్తులు ఆచరించే నియమములు సర్వులకూ శారీరక , మానసిక ఆరోగ్యమును కలిగించుననుటలో సందేహములేదు. భగవంతునిపై విశ్వాసమున్నా , లేకపోయినా తమకున్న దురలవాట్లు మాను కొనుటకు నేడు చాలామంది దీక్ష తీసుకొని యాత్ర చేస్తున్నారు. మండలకాల నియమ నిష్టలను పాటించి , యాత్ర పూర్తయిన వెంటనే మరలా తమ విశ్వరూపమును గతంలోకంటే మిన్నగా ప్రదర్శించువారు ఎందరోగలరు. ఇది గర్వించదగ్గ విషయం.


మండల దీక్షాకాలములో అయ్యప్ప భక్తులు ఆచరించే నియమ నిష్టలు తమ శారీరక , మానసిక ఆరోగ్యమునకు ఎంతో ఉపకరించుననియూ , నైతికముగా ఎంతో ఔన్నత్యమును సాధించు కొనుటకు మిగుల ఉపకరించుననియూ తెలిసికొనిన పరిస్థితిలో ఇందులోని శాస్త్రీయ నిబద్దతను కూడా అవగాహన చేసికొన్నచో మరలా తిరిగివారు తమ పాత జీవితము పట్ల మోజుపడరు. ఈనాడు నైతికముగా పతనమవుతున్న సమాజము ఔన్నత్యము పెంపొందించుకొని , సమతా మమతలు వెల్లివిరిసే సమసమాజ స్థాపనకు ఎంతో దోహదమొనరించునని విశ్వసిస్తూ మండల కాలము , అయ్యప్ప భక్తులు ఆచరించే నియమములలోని శాస్త్రీయ అవగాహనను పరిశీలించుదాము. శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష తీసికొని , మండలకాలము 41 రోజులు) వ్రతమాచరించి , శబరిమల యాత్ర చేయ సంకల్పించుకొని , ఓ సుముహూర్తమున మాలధారణ చేయించుకొనవలయును.


ఇందుకు ప్రతి వ్యక్తి ఒక సద్గురువును ఆశ్రయించాలి. *ఎంత తెలివియున్నా , ఎంత చదివినా , ఎన్ని శాస్త్రములు వల్లెవేసినా గురువు లేనిదే సిద్ధింపనేరదు. "మాతృ దేవోభవ", "పితృ దేవో భవ", ఆచార్య " దేవో భవ" అని తల్లిదండ్రుల తర్వాత పూజనీయమైన స్థానమును గురువుకే ఇవ్వటం జరిగింది. అజ్ఞానాంధకారమును తొలగించి , జ్ఞానదీపికలను వెలిగించి సాధకునిలో సుజ్ఞాన చంద్రికలను ప్రసరింపజేసి , నిర్వికల్ప బ్రహ్మ సమాధిని కల్పింపగల శక్తి గురువుకే కలదు. అందువలన శిష్యులకు గురువే పరమ దైవము , తీర్ధము , ప్రత్యక్ష దైవ స్వరూపము. ఆధ్యాత్మిక మార్గంలో జీవిత గమ్యం చేరాలనే తహతహగల వారికి ఒక గురువు ఎంతో అవసరం. శిష్యుని బాధ్యత నంతా తన భుజస్కంధాలపై వేసికొని , విశ్వాస పాత్రంగా సలహాలు నీయగల యదార్థ గురువు సర్వార్పణకు అర్హుడు , పూజనీయుడు , అనుసరణీయుడు.*


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat