_*అయ్యప్ప సర్వస్వం - 61*_*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 3*

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 3*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*'గు' కారస్తు శివః ప్రోక్తః - 'ఉ' కారో బ్రహ్మచోచ్యతే*


*'ర' కారు రవి ప్రోక్తః - "గురుః" సర్వార్థ కోవిదః*


*"గ" కారము శివుడు. "ఉ" కారము బ్రహ్మ. "రు" కారము రవి "గ" కార: "ఉ" కారములు కలిసి సంపూర్ణ ప్రజ్ఞాపాటవములకు , పరమార్థ విద్యకు ప్రాతినిద్యము వహించునని తెలియును.*


అపరిపూర్ణుడైన గురువుకు నీ ఆత్మాభివృద్ధిని గూర్చి అప్పగించి నట్లయితే పరిమిత దృష్టితో వానిని వ్యర్థపుచ్చుతాడు. ఇది ఒక పిచ్చివాని చేతికి కత్తి ఇవ్వటంలాంటిది. అదే విధంగా శిష్యుడు కూడా భక్తి , విశ్వాసములు ఉప్పొంగగా శమదమాది గుణములు కలసి యుండి , పరిశుద్ధమైన భావములు విలసిల్ల , భ్రాంతి , మోహములను పారద్రోలి , విషయాభిలాషలు విరచి వేసి , మమతాహంకారములు మాసిపోగ , రాగ , విద్వేషాలనణచివైచి కర్మఫలాపేక్షలేక , దేహాభి మానమును వదిలిపెట్టి కామంబు ఖండించి , కష్టాలకోర్చి , అన్ని యవస్తల , అన్ని కాలముల త్రికరణ శుద్ధిగా తాను ఒక్కడుగా నిలచి , ఆత్మార్పణమొనర్చి , సర్వమును మరచి , గురువే దైవమనుచు బుద్ధితో సేవింపవలెను. అతడే ఉత్తమ శిష్యుడు. అతడే గురు కృపకు పాతృడై , పరమాత్మను గాంచును.


అందువలన సాధకులు విజ్ఞాన ధనుడైన మార్గదర్శిని , గురువును మాత్రమే ఆశ్రయించవలయును. బోధకుడు ఎంత ఉన్నతుడయితే మార్గదర్శకత్వం అంత ఉపయుక్తంగా వుంటుంది. అతడే భగవంతుని దర్శింపజేయగల నిజమైన గురువు. భగవంతునికి , గురువుకు నమస్కరించునపుడు మీ పాద పద్మములే శరణ్యం అంటూ సాష్టాంగ నమస్కారము చేయవలయును. గురువు యొక్క పాద పద్మముల యందును , భగవంతుని పాద పద్మముల యందును మనము శిరస్సు వంచి నమస్కరించునపుడు , లేదా ధ్యానించునపుడు వారి వద్దనున్న ఆత్మ శక్తి మనలో ప్రవహించును. మనము పెద్దలకు , గురువులకు , మహనీయులకు చేసిన నమస్కారములు నిజముగా వారి మూలముగా ఆ సర్వేశ్వరునికే చేరును. ఆధ్యాత్మిక సంబంధమైన గురువులు అష్టవిధములు. కేవలం శాస్త్రాన్ని బోధించి , నిబంధనలను తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహాన్ని అందించేవాడు *"బోధ గురువు"* తత్వార్థాన్ని బోధించి తత్వవేత్తలను గావించి , మనస్సును దైవము వైపు మరల్చేవాడు *"వేద గురువు"* , కామ్య , కర్మలను బోధించి , ఇహ పరములందు మోదమును అందించువాడు *"నిషిద్ధ గురువు"*. పాప పుణ్య ఫలితములను గూర్చి బోధించి , పుణ్యకార్యములను ఆచరింపజేసి. తద్వారా ఇహపరములందు సుఖమును అందించు వాడు *"కామ్య గురువు".* యోగతత్వమును బోధించి , దివ్యత్వమైన ఆత్మ తత్వాన్ని అనుభవింపజేసేవాడు *"సూచక గురువు".* అనేక విధములయిన సందేహములను రూపుమాపి , మనస్సును పరిశుద్ధముగావించి , చిత్తశుద్ధిచే ఆత్మతత్వాన్ని గుర్తింపజేసెడివాడు *"విహిత గురువు".*


జీవ బ్రహ్మ ఐక్యానుసంధానము కలిగింపజేసెడివాడు *"కారణ గురువు"* , అర్ధమాశింపక ఆధ్యాత్మిక బోధచేసి , విశ్వరూపుని దర్శింప జేయువాడు *"ప్రసిద్ధ దేశికుండు” , “విహితోపదేష్ట".* ఈ లక్షణము లన్నియునున్నవాడే ఏకైక గురువు. అతడే సద్గురుమూర్తి. నడవడిక ధర్మబద్ధము , దూషణ , భూషణ , తిరస్కారములకు అతను పొంగిపోడు. మట్టిని బంగారమును సమముగా జూచును. ప్రాణులపై దయ , పరహిత బుద్ధి , నిర్ద్వంద్వ భావము , నిత్య సంతృప్తి , ఆ జన్మగుణములై అతనికి అలంకారము జేకూర్చును. శబరిమల అయ్యప్ప దీక్ష నిర్వహించుటకు ఒక సద్గురువు ద్వారా మాల

ధరించవలయును. మాల ధరించుటకు సామాన్యముగా *"తులసి మాల గానీ , లేక "రుద్రాక్ష మాల"గాని* వినియోగించెదరు. అయితే కొందరు వివిధ రకముల మాలలు వినియోగించుట కలదు. వేర్వేరు  మాలల గుణ పరిశీలన చేయుదము.


1. తులసిమాల ధరిస్తే అక్షయ ఫలము , 

2. శంఖమణిమాల ధరిస్తే లక్ష్మీప్రదం , 

3. స్పటికమాల ధరిస్తే మోక్షప్రదం , 

4. పగడాల మాల ధరిస్తే ధనప్రదము , 

5. ముత్యముల మాల ధరిస్తే సౌమంగల్య ప్రదము , 

6. కుశమాల ధరిస్తే పాపక్షయకరము , 

7. బంగారు లేక వెండి మాల ధరిస్తే ఇష్టార్థప్రదము , తులసిమాల అనంతకోటి ఫలము ఇచ్చినచో , రుద్రాక్ష మాల ఇంతింతయని నిర్వచించలేని అనంత ఫలముల నిచ్చును. తులసి వృక్షము చాలా శుభప్రదమైనది. రోగ క్రిములను సంహరించు ఓషదీ శక్తి గలది. విద్యుచ్ఛక్తిని మనలో నింపి , సకల రోగ శాంతికరమైన తులసిమాలను మెడలో ధరించుట ఎంతో ఉత్తమము. అందువలననే ఎక్కువ మంది సులభముగా లభించు నటువంటి తులసి మాలలనే మాలధారణకు వినియోగించెదరు. విష్ణువునకు తులసి ప్రియమైనది.


శరీరమునందు పవిత్రములైన రుద్రాక్షలను ధరించుట చేత సర్వతీర్థ స్నాన ఫలమును , సర్వ వేదాధ్యయన ఫలమును , సకల రుద్ర జప ఫలమును కలిగి ఇహలోకమున కీర్తి ప్రతిష్ఠలతో వెలుగొంది దేహాంతమున శివ సాయుజ్యము పొందనగును. రుద్రాక్ష ధరించినవారిని శివ స్వరూపులుగా భావించెదరు. భూత , ప్రేత , పిశాచములు , శాకినీ , ఢాకినీ శక్తులు , మంత్ర ప్రయోగములు రుద్రాక్షధారినిగాంచి , దూరముగా పోవును. రుద్రాక్ష పంచాయతన మయినది. అనగా శివ , హరి , అంబిక , ఆదిత్య గణపతి దేవతలకు ప్రతీకగా పూజించదగినది. పంచముఖ రుద్రాక్ష , పంచముఖ రుద్రాక్షధారణ అంతటి విశిష్టమైనది. సర్వకాల సర్వావస్తలయందును రుద్రాక్షలు ధరించవలయుననే కానీ విసర్జింపరాదు. రక్తపోటు , హృదయగత వ్యాధులు , మనోవికల్పతను పోగొట్టి , ఉష్ణమును తగ్గించి రోగనిరోధక శక్తిని పెంపొందించును. ఇంతియే గాక రుద్రాక్షను గురించి చెప్పవలయునన్న పెద్ద గ్రంథమే అగును. నేడు రుద్రాక్షను వైద్య చికిత్సలలో , అనేక వ్యాధులలో అనేక రూపములుగా వినియోగించుచున్నారు. అందువలన మాలగా ధరించుటకు అన్ని రకములలో రుద్రాక్షయే ఉత్తమోత్తమమైనది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat