_*అయ్యప్ప సర్వస్వం - 62*_*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 4*

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 4*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


శివునకు ప్రతీక రుద్రాక్ష. అందువలన గళమున మాలలు ధరించువారు ఒక తులసి మాలను , మరియొక రుద్రాక్ష మాలను ధరించినచో శివ కేశవ అబేధము పాటించిన పుణ్యము కల్గును. మరియూ మన దీక్షకు మూలపురుషుడైన అయ్యప్ప హరి హరసుతుడే గదా !


మాల 108 , 54 లేక 27 అను సంఖ్యలో పూసలుండి , అవిగాక పెద్దపూస మేరువుగా నుండవలెను. ముఖము , ముఖముతో పుచ్చము , పుచ్చముతో కలియునట్లు ఒక దారముతో గ్రుచ్చవలెను. మాలలను ఇతరులకు కనబడకుండునట్లు వస్త్రములోవల దాచవలెను. మానవ శరీరములో 72000 నాడులున్నవి. వానిలో హృదయగతమైనవి 108 నాడులు. ఈ హృదయమే భగవంతునికి , ఆత్మకు స్థానమనబడుచున్నది. భగవాదాస్థానమునకు , ఆత్మ నిలయమునకు ఆధారమైన హృదయములోని నాడులు 108 ననుసరించి జపసంఖ్య మాలలోని పూసలు 108గా ఆచారము లోనికి వచ్చినది.


దీక్షా కాలమంతయు ముఖమున విభూధి , చందనము , కుంకుమ అలరారుచుండవలయును. భస్మము , విభూతి. స్నానానంతరము ధరించినచో , శరీరములోని రక్త గమనమును సాఫీగాజేసి వేడి తగ్గించి నాడీ మండలమునకందించి , సదా ఆరోగ్యవంతునిగా జేయును. జలస్నానము శరీర మైలను మాత్రమే శుభ్రపరచును. కానీ భస్మ స్నానము సర్వ తీర్థములు స్నాన ఫలితములనిచ్చి , లౌకిక పూజ్యత కల్గించి , దీర్ఘాయుష్మంతుని జేసి , సకల వ్యాధులను నశింపజేయును. శరీరములో వాత , ఏతశ్లేష్మములను త్రిధాతువులు , రక్తము వేడివలన గమన వేగమందున్నపుడుగాని , దాని వేగమును తగ్గించవలయునన్న భస్మధారణ ఆవశ్యకము. భస్మము ధరింపనిది. రుద్రాక్షలు వేసికొననిది నీటి చుకైనను త్రాగరాదు. తెలిసిగాని తెలియకగాని ధరించిన భస్మము అగ్నివలె పావనంబగును. భస్మము శివ స్వరూపము. శుభముల నొసంగును. సకల కార్యములసిద్ధింపజేయును. భూత , ప్రేత , పిశాచగణముల భారినుండి రక్షించునది. మోక్ష ప్రదాయినై యున్నది అట్టి విభూతిని తప్పక ప్రతి దినమూ ధరించవలయును.


ముఖమునకు మనము అలంకరించుకొను భస్మము , శ్రీ చూర్నము , శ్రీ గంధము , గోపీచందనము , కుంకుమ మొదలుగా గలవన్నియు ఆలొచించి చూచినచో ఇవన్నియు క్రిమిసంహారక కారకములు , రోగ శాంతికరములు , వ్యాధి నిరోధకములుగా ఖ్యాతి నొంది , శాంతి నొసంగి , ఆధ్యాత్మిక సంపత్తి సాధనమునకు ప్రాథమిక సోపానములుగా ఎన్నబడినవి. ఉదాహరణకు , మన ఇంటిలోని కూరగాయలు , పూల చెట్లకు ఏవైనా తెగులు వచ్చినచో బూడిదను దానిమీద చల్లినచో నివారణ ప్రాప్తించును. భస్మము ఆవు పేడతో తయారుచేయబడినదేగదా! కావున దానికిని రోగములను కలుగజేయు క్రిములనంటనీయక వాటి ధారణచే మానవులను రోగముల బారినుండి కాపాడబడుట జరుగుచున్నది. ఇంటిలో చీమలు పుట్టను పెట్టినచో పసుపుపొడిని చల్లి వాటిని నివారించెదరు. అట్టి పసుపుతో తయారు చేయబడిన కుంకుమ కూడ క్రిమిదోష నివారిణియే గదా ! ఇంటి గడపలకు పసుపు , కుంకుమ పూసి, అందమును , పరిసర ఆరోగ్యములను పెంపొందించుకొన్న వారమగుచున్నాము.


అలాగే గంధము , చందనము , మనోహరములుగా సువాసన కలిగి యుండి , వేడిని తగ్గించి కండ్లకు చలువచేయును. దుష్ట రక్తమును హరించును. స్త్రీల కుసుమ రోగములు , తీవ్రతాప జ్వరము దాహము , రక్త పైత్యమునణచివేయును. స్నానానంతరము శరీరమునకు లేపనము చేసినచో ఎంతో హాయినిచ్చును. దుర్గంధములను పారద్రోలి, సువాసనలు వెదజల్లి , మనోహరముగా నుంచును. అందుకే అలంకార ప్రియుడైన స్వామికి తాపహరముగా సుగంధ భరితమైన గంధాభిషేకము జరుపుచున్నారు. ఈ విధముగా మన పూర్వీకులు శాస్త్రీయ అవగాహనతోనే మానవుని ఆయురారోగ్యములను పెంపొందించుటకు ఆచారములని మన దైనందిన జీవితములో ఇట్టివి నియమించి లోక కళ్యాణమునకు కారకులైనారను విషయము మనము మరువకూడదు. ఇవన్నియు కేవలం చాందసవాదులు , సనాతన సాంప్రదాయవాదులు ఆచరించు ఆచార వ్యవహారములని కొట్టి పాడవేయక వీనిలో గల శాస్త్రీయ నిబద్దత ఆలోచించి , ఆచరించినచో మానవులు ఆరోగ్య జీవులై , సమాజాభ్యుదయమునకు దోహదకారులగుదురు.


మండల దీక్షా నియమములలో ప్రతినిత్యము ఉదయం , సాయంత్రం సంధ్య వేళల్లో చన్నీటితో శిరః స్నానమాచరించుట ఒకటి. బ్రాహ్మీముహూర్తమున అనగా సూర్యోదయానికి ముందేలేచి కాలకృత్యములు తీర్చుకొని సముద్రము , నది, సరస్సు , చెరువు , కాలువ , బావి మొదలగు వానిలో స్నానమాచరించవలయును.


ప్రవాహ వేగమున్న జలములలో వీలైనంత ఎక్కువసేపు స్నానమాచరించుట మంచిది. ఈత మంచి వ్యాయామము. ఈత వలన శరీర అవయవములన్నియు మంచి వ్యాయామమునకు లోనై , ఉచ్ఛ్వాస , నిశ్వాసలను క్రమబద్దీకరించి , ప్రాణాయామ అభ్యాసమున కుపకరించి మంచి దేహదారుఢ్యమును పెంపొందించును. వివిధ ఓషదీయుక్తమైన మూలికలు , ఖనిజలవణములు , ముఖ్యముగా అయోడిన్ వంటివాటితో మిళితమైన జలములలో స్నానము చేయుట వలన శరీరమునకు పరిశుభ్రతయు , కాంతిని కండరములకు శక్తిని ప్రసాదించి , ఆరోగ్యమును చేకూర్చును.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat