_*అయ్యప్ప సర్వస్వం - 63*_*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 5*

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 5*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ప్రశాంత ప్రకృతిలో మంచి గాలికి , సూర్యరశ్మికి శరీరము లోనగుట వలన సుందర ప్రకృతిలోని సహజ ఓషదీయుక్త ప్రభావము శరీరమునకు ప్రాప్తించును. శరీరముపై ఏ ఆచ్చాదన లేకుండా శరీర సూక్ష్మరంధ్రములు సహజ వాయువులకు , సూర్యరశ్మికి లోనగుట వలన శరీరమునకు కాంతిని , ఎముకలకు పుష్టిని , నేత్రములకు దృష్టి తక్షణత ప్రాప్తించును. ఉదయం , సాయంత్రం సంధ్యవేళల్లో ప్రశాంత ప్రకృతిలోని సూర్యరశ్మి ద్వారా "ఓజోన్" మరియు విటమిన్ "డి" ప్రాప్తించును. దీనిని *"సూర్య కిరణ స్నానము"* క్రింద లెక్కించవచ్చును. సంధ్యవేళలలో ఈ విధముగా సూర్యరశ్మికి లోనగుట వలన శరీరకాంతి , ఎముకలకు పుష్టి , కండరములకు నరములకు , నేత్రములకు మంచి ఆరోగ్యమును , జీవశక్తిని ప్రసాదించి , రోగ నిరోధక శక్తి పెంపొందించును.


పాద రక్షలు లేకుండా నేలపై నడచుట నియమములలో నొకటి. ప్రశాంత ప్రకృతిలో సముద్ర , నదీతీరములలో ఇసుకపైన పచ్చటి పొలములలో , పచ్చిక బయలుపై , మంచులో తడిసిన పచ్చటి గరికపై నడచుట వలన పాదములు భూమికి గల సహజ అయస్కాంత శక్తిని గ్రహించి , శరీరమునకు తేజస్సును , మనస్సుకు ప్రశాంతతయును ప్రసాదించబడి ఏకాగ్రత పెరుగును. పాదరక్షలు లేకుండా నడచుట వలన పాదములలో గల నాడీకేంద్రములు (ఆక్యుప్రెస్సర్ పాయింట్లు) ఉత్తేజితములై , శరీరమందలి అన్ని అవయవములకు అయస్కాంత శక్తి లభించి , ఆరోగ్యము చేకూరును. సాత్విక ఆహార సేవన చాలా ముఖ్యము. బ్రహ్మచర్యవ్రతము పాటించువారికి ఆహార సేవనలో నియమము అవసరము. అందుకే భారతీయులలో ఉపవాసమనునది ఒక సాంప్రదాయకముగా వస్తున్నది. పర్వదినములలో , దైవకార్యములలో , శ్రాద్ధ ప్రయోగాదులలో తప్పనిసరిగా ఉపవాస దీక్ష ఒక్కపూటైనా కొనసాగించెదరు. కొందరు వారములో ఒకసారి ఉపవసించి , ఆ పూట భోజనము విసర్జించి తేలికగా పళ్ళు , పాలు లేదేని ఏదైనా అల్పాహారము తీసికొనియెదరు. హిందువులలో అనేక సంధర్భాలలో ఇది కొనసాగించబడుతుంది.


అలాగే మహమ్మదీయులలో "రంజాన్" పర్వదినములలో నెలరోజులు కఠిన ఉపవాస దీక్ష నిర్వహించెదరు. ఆ పర్యదినములలో సూర్యోదయము తరువాత , సూర్యాస్తమయమునకు ముందు పచ్చి మంచినీరైనా ముట్టరు. ఆఖరికి ఉమ్మికూడ మ్రింగరు. అలాగే క్రైస్తవులు , జైనులు అనేక ఇతర మతముల వారిలో సైతము ఈ ఉపవాసదీక్ష అనునది ఏదో ఒక రూపములో ఆచరింపబడుతూనే ఉన్నది. అయితే ఈ ఉపవాసదీక్షలోని పరమార్ధము శరీరమును , మనస్సును కోరికల విషవలయంలో చిక్కకుండా నియంత్రించుటయే. ఆహారమును నియంత్రించుట వలన అన్ని అవయవములలోనూ పని తీవ్రత తగ్గుట వలన తగిన విశ్రాంతి లభించి , మరలా అవి అన్నియు ద్విగుణీకృత ఉత్సాహముతో పనిచేసి , సాధకునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో సహకరిస్తుంది. ఇందుకు ప్రతి జీవియొక్క శారీరక , మానసిక శక్తులు పెంపొందించుటకు సాత్విక ఆహార సేవన అవసరము. ఆహారమే అన్ని శక్తులకు మూలము కనుక పరిమిత , నియమిత , సాత్వికాహార సేవన వలన మానవులు ఉన్నతంగా , ఆరోగ్యంగా ఉంటే , విరుద్ధ ఆహార సేవన వలన దుష్ట పరిణామములకు దారితీసి , అనారోగ్యమునకు కారణమగుచున్నది. శరీరతత్వములకు వలెనే ఆహారము కూడా సాత్విక , రాజసిక , తామసికమని మూడు విధములు. శరీరమునకు తేజస్సును , ధారుఢ్యమును , రోగ నిరోధక శక్తిని కల్గించి , మనస్సును నిర్మలముగా నుంచి , పవిత్రమైన , పూజనీయమైన భావనలకు మనస్సు స్పందించులాగున చేయు శక్తి సాత్విక ఆహార సేవనల వలన లభించును.


అందువలన తేలికగా జీర్ణమగు , విలాసవంతముగాని శాఖాహారము ముఖ్యముగా పాలు , పళ్ళు , ఆకుకూరలు , కాయ గూరలు , మొలకెత్తు విత్తనములు , తేనె , పళ్ళ రసము మొదలగునవి ఆ సాధకునకు శరీరశక్తిని కలిగించి , మనోనిబ్బరమును పెంపొందించి ఏకాగ్రతను చేకూర్చును. మాంసాహారము , మసాలా కలిసిన పదార్థములు , సుగంధద్రవ్యములు , ఎక్కువ ఉప్పు , కారము కలసిన పదార్ధములు , పులిసిపోయిన , నిలువయున్న , దొంగిలించ బడిన ఆహారము ఇవి అన్నియు తామసిక , రాజసిక ప్రవృత్తి కలిగించి యోగ భ్రష్టత్వమునకు దారితీయును. కావున ఇవి సర్వత్రా విసర్జనీయము. అలాగే గృహస్తాశ్రమము (భార్యా పిల్లలు) జ్ఞాన సాధనకు అడ్డంకియని తలంచవద్దు. ధర్మ , అర్థ , కామ , మోక్ష సాధనకు అర్థాంగి అవసరము. కులపతి అనుజ్ఞ లేకుండా , ఆమె సహకారము లేకుండా ఎలాంటి శుభకార్యములు , పుణ్యకార్యములు జయప్రద మొనరింపజాలము. అందువలన గృహస్తుడయి కూడా మోక్ష సాధనకు ప్రయత్నించ వచ్చును. ప్రతి మనిషి తన విద్యుక్త ధర్మమును నెరవేర్చవలయును. ఉదర పోషణార్థమై ఇతరుల మీద ఆధారపడక , తనకు వీలయిన వృత్తి , వ్యాపారముల ద్వారా న్యాయమార్గమున ధన మార్జించి, కుటుంబ పోషణను స్వయముగా చేసికొనవలయును. స్వంత లాభము కొంత మానుకొని తన ఇరుగు పొరుగువారికి అతిథి అభ్యాగతులకు దాన ధర్మములు నిర్వహించి కొంత సాయపడుట మానవ ధర్మము. అదియునుగాక , ప్రతి మనిషి నాలుగు విధములైన ఋణములతో ఈ భూమిపైన జన్మించును.


అవి ఏవన :- 

1. పితృఋణము , 

2. దేశికి  ఋణము ,

3. వేల్పుల ఋణము ,

4. మాతృ దేశ ఋణము అనునవి.  చక్కగా గృహస్తుడై , సత్సంతానంబొంది , తల్లిదండ్రుల ఋణము దీర్చనగును. గురువే దైవమనుచు , సకల శుశ్రూషల వలన గురుదేవుని సంతృప్తిబరచి ఆ గురు ఋణము దీర్చుకొనవలయును. పుణ్యకార్యములతో , దైవకార్యములతో దేవతలను మెప్పించి దైవ ఋణము తీర్చుకొనవలయును , నిస్వార్థబుద్ధితో ప్రజాసేవ మొనరించి మాతృదేశ ఋణము తీర్చుకొనవలయును.


ధర్మార్థ కామ మోక్ష సాధనకు ఆత్మతత్వమును తెలిసికొని , భగవద్దర్శనము, మోక్షపదమునాశించు ప్రతి సాధకుడు తన భౌతిక శరీరమును రక్షించుకొనుటకు అవసరమయిన నియమనిష్టలను దీక్షాదక్షతతో నిర్వహించి , ఇహపర సాధనకు కృషిచేయవలయును.


*"దేహో దేవాలయః ప్రోక్తో జీవో స్సనాతనః"* అను శ్లోకము ననుసరించి ఈ దేహమే దేవాలయము, సర్వజ్ఞానములు , సర్వ దేవతలు , సకల తీర్థములు , సప్త లోకములు , మానవ దేహమునందే యున్నవి. *"సర్వం ఖల్విదం బ్రహ్మం", "ఏకం సత్", "తత్వమసి"* అనెడి శృతి వాక్యముల సారము , సకల జీవ రాసులలోనుండే పరమాత్మ ఒక్కడే ఆకృతులే వేరుగాని , ఆత్మ పరమాత్మ ఒక్కటే గదా ! ఆయా దేవతలు , షట్చక్రముల స్థానములలో ఈ దేహమునందే వసించియున్నారు. నాల్గు దళముల ఆధార చక్రమునకు అధిపతిగా వినాయకుడు, ఆరుదళముల స్వాధిష్టాన చక్రమునకు అధిపతిగా బ్రహ్మదేవుడు , పది దళములు మణిపూరక చక్రమునకు అధిపతిగా విష్ణుమూర్తి , పండ్రెండు దళముల అనాహిత చక్రమునకు అధిపతిగా రుద్రుడు , పదునారు దళముల విశుద్ధ చక్రమునకు అధిపతిగా జీవుడు , రెండు దళములు ఆగ్నేయ చక్రమునకు అధిపతిగా పరమాత్మ. వేయి దళములతో సహస్ర చక్రమునందు శ్రీ గురుడు ముక్తికాంతతో దర్శనమిచ్చును.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat