*అయ్యప్ప సర్వస్వం - 68* *యుగాతీతుడు అయ్యప్ప - 2*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*యుగాతీతుడు అయ్యప్ప - 2*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*శ్రీ కృష్ణ జననం*


క్రీ.పూ. 27-7-3112 శుక్రవారం రాత్రి 11-40 గంటలకు రోహిణీ నక్షత్రము , కృష్ణపక్ష అష్టమి తిథినాడు ఉత్తరభారత మధురలో జన్మించెను.


*మహాభారత యుద్ధం*


క్రీ.పూ. 14-10-3067 మొదలు 1-11-3067 వరకు  18 దినములు


పగటిపూట సూర్యుడు మరుగయ్యేది క్రీ.పూ. 27-10-3067, 14వ దిన


భీష్ములవారు అంపశయ్య నుండి ముక్తిపొందినది క్రీ.పూ. 18-1-3066 ఉత్తరాయణం పుట్టిన పిమ్మట


శ్రీకృష్ణులవారు పరమపదం చెందినది క్రీ.పూ. 13-2-13031 బోయవాని అంబు కాలికి గ్రుచ్చుకొనగా తనువు వీడెను.


పై చెప్పబడిన వివరములనుండి యించుమించు (క్రీ.శ.2009 నాటికి), 5040 సంవత్స రములకు ముందుండియే శాస్తా ఆరాధన లోకములో ఉన్నట్లు తెలియుచున్నది. మహాభారత కాలఘట్టమునకు వెనుక త్రేతాయుగంలోని రామాయణ కాలమునకు వెడలి , అప్పుడు శాస్తా ఆరాధన యుండినదా ! అని తెలిసికొనుటకు పూర్వం రామాయణ కాలఘట్టమేదని తెలుసుకొందాం. 


శ్రీరామచంద్రునికి పిమ్మట ముప్పైమంది రాజులు అయోధ్యను ఏలినట్లు పురాణములు వెల్లడిచేయుచున్నవి. *"31వ తరమునకు చెందిన బృహత్పలుడను రాజు అయోధ్యనుండి రాజ్యపాలనము చేయుచుండగా మహాభారత యుద్ధము సంక్రమించెను. ఆ యుద్ధమునందు బృహత్పలుడు అర్జునుని తనయుడైన అభిమన్యునిచే హతమార్చ బడెను"* అని మహాభారతములో తెల్పబడియున్నది. ఒకతరం రాజు వంద సంవత్సరములు పాలించినాడను కొనినను 3000 సం , అని లెక్కించుకో వచ్చును. కావున మహాభారత కాలఘట్టమునకు 3000 సం. నకు ముందుగా శ్రీరామ చంద్రుడు అవతరించినాడని అనుకోవచ్చును. వాల్మీకి రామాయణలోని యుద్ధకాండము నందు లక్ష్మణుడు ఆకాశంవైపు క్షుణ్ణంగా చూడగా శతభిషా నక్షత్రమునందు సప్తఋషి మండలము యుండుట గాంచినట్లు తెల్పబడియున్నది. 1192 క్రీ.శ. యందు సప్తఋషిమండలము (యు.ఆర్.యస్. ఏ. మేజర్ - ది గ్రేట్ బార్) కన్యరాశి యందు హస్తానక్షత్రము నందు గలదు. సప్తఋషిమండల సంచారమును లెక్కించి శ్రీ రాముని అవతార కాలమును ఇలా సూచించియున్నారు.


శ్రీ రామజననం క్రీ. పూ. 7140.  చైత్రమాసం పునర్వసు నక్షత్రం శుక్లపక్ష నవమి ఉత్తరభారత అయోధ్య నందు జననం


క్రీ.పూ. 7115

శ్రీరామచంద్రుడు తన 25వ ఏట దండకారణ్యమునకు వెడలుట


క్రీ.పూ. 7101

14వ సం॥ల వనవాసము ముగిసి శ్రీరాముడు తన 39వ ఏట రావణాసురునితో చేసినది.


క్రీ.పూ. 7099

శ్రీ రామ పట్టాభిషేకము


క్రీ.పూ. 7086

శ్రీరామచంద్రుడు సరయూనదిలో దిగి తనువు వీడి

పరమపదము చెందుట


శ్రీరామ కథ పలుదేశములందును పలు వేరు కాలఘట్టమున అనేక గ్రంథకర్తలచే రచించ బడినది. తమిళభాషలో కులోత్తుంగ చోళరాజు పాలనలో యుండగా *'కంబఋషి'* రామాయణము తమిళభాషలో వ్రాసెను. వాల్మీకి రామాయణమునకు తరువాత కంబ రామాయణమే అరుదైన బొక్కిసముగా యెంచబడుతున్నది. అందున రావణుడు ప్రప్రథముగా రామచంద్రుని చూచువేళ *“ఈతడు శివుడు కాదు. బ్రహ్మయూకాదు, విష్ణువు అసలే కాదు"* అని గ్రహించి త్రిమూర్తులకన్నా అతీతుడైన ధర్మాన్ని శాసించుటకై వచ్చిన పరబ్రహ్మ స్వరూపుడే అని నిర్దేశించి చెప్పినట్లు ఒక పద్యము కూడా కలదు.


వాల్మీకి రామాయణ ప్రకారము శ్రీరామచంద్రుడు భార్గవ రాముని విల్లును విరిచి అతడికి గర్వభంగము కావించెను. పిదప పరశురాముడు వరుణ భగవానుని గూర్చి తపముండి , వరణుడు ప్రత్యక్షముకాగా , తన పరశు (నాగిలి) ఎంతదూరము పశ్చిమ , సముద్రము దాటిపోయి పడుచున్నదో అంతదూరము సముద్రము జరిగి భూమి వెలుపలికి రావలయునని వరము పొంది , ఆ ప్రదేశమును కేరళదేశమను పేరిట ఏర్పరచి , ఆ ప్రదేశమున 108 శివక్షేత్రములను , 108 భగవతి క్షేత్రములను , 108 శాస్తా క్షేత్రములను , లెక్కలేని విష్ణుక్షేత్రములను ప్రతిష్టించి , ఆ ప్రదేశమును తన బ్రహ్మ హత్యాదోషనివారణార్థం నంబూద్రి బ్రాహ్మణులకు దానముగా యొసంగి , ఆ దేవాలయాల పూజారుల కొరకు దేశమంతటయూ తిరిగి వెతికి చివర *ఆంధ్రరాష్ట్రమున తూర్పు గోదావరి తీరానగల "ర్యాలీ" అను గ్రామములో నున్న సోదరులిరువురుని కనిపెట్టి వారికి కేరళలోని ఆలయాల పూజా ఆరాధన అధికారమును అప్పగించి , దాని పరిరక్షణ కొరకై తానే తన పరివారముతో యుండి నిర్వహించినారు. పరశురాముని తల్లి రేణుకాదేవి శాస్తా భక్తురాలు. ఇలా పరశురాముల వారిచే కేరళ దేశమున శాస్తా ఆరాధన ఏర్పడినది. కావున 9095 (2009 + 7086) సంవత్సరములకు మునుపటి నుండియే కేరళ దేశము నందు శాస్తా ఆరాధన ఏర్పడినదని గ్రహించుకొనవచ్చును.


శ్రీరాముని కాలమునందే అగస్త్యుడు అను మహర్షి జీవించియుండెనని రామాయణములో చెప్పబడియున్నది. అగస్త్యమహర్షి చేర , చోళ , పాండ్య రాజులకు కులగురువై యుండేటివారు. వీరు శాస్తా ఆరాధకులు. వీరే తమిళనాడంతయు శాస్తా ఆలయములను కట్టించి , ఆస్వామి ఆరాధనలను ప్రబలము గావించి నారనుటకు పలు ఆధారములు కలవు. శాస్తావారు భూత ప్రేత పిశాచముల వంటి దుష్టగ్రహ బాధానివారణ మూర్తిగా , మునియాండి - మునీశ్వరన్ అయ్యనార్ శాత్తన్ - శంగలి కరుప్పన్ మున్నగు నామములతో గ్రామరక్షకమూర్తిగా ఊరి పొలిమేరలలో ప్రతిష్ఠింపబడి నేటికిను తమిళులచే పూజ లందుకొను చున్నారు.


ఇచ్చట ఆంధ్రలోనూ అనాదిగా మునీశ్వరుడు - మునినాథుడు - ముని చంద్రుడు- మునికృష్ణుడు - మునయ్య మున్నగు నామము లతో ప్రబలి వేపాకు మంత్రములతో ప్రజలను కాపాడేవారు ఈ శాస్తావారే అని తెలుసుకొనవలెను.


శ్రీరామచంద్రుని కాలమునందు నివసించిన వారు అత్రిమహర్షి , వారి సతీమణి అనసూయ , మహాపతివ్రత , ఈమె సీతమ్మవారికి తన ఆభరణములను తొడిగి ఆనందించినారని రామాయణములో చెప్పబడియున్నది. అత్రిమహర్షులవారి ఆశ్రమము తమిళనాడులోని నాగర్ కోవిల్ అను స్థలమునుండి కన్యాకుమారి వెడలే దారిలో సుచీంద్రం అను ఊరిలో నుండినది. అత్రిమహర్షి శాస్తావారి అంశముగా జన్మించినారని ఇచ్చట స్థల పురాణము చెప్పుచున్నది. అప్పట్లో అత్రిమహర్షిగారి సతీమణి అగు అనసూయాదేవి వద్దకు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరాదులు సన్యాసిరూపములో ప్రత్యక్షమై , నిర్వాణముగా వచ్చి తమకు భిక్ష ప్రసాదించమని ఆమెను కోరిరి. అనసూయ శాస్తావారిని ధ్యానించి అత్రిమహర్షి కాళ్ళు కడిగిన తీర్థమును త్రిమూర్తుల మీద చల్లి , వాళ్లను పసిబిడ్డలు కావించి , తాను వివస్త్రురాలై వారి కోర్కెను తీర్చిందట. ఆ మువ్వురు కలసి మూడు శిరములు గల దత్తాత్రేయులవారుగ ఆవిర్భవించిరి. వీరు జగద్గురువై ధర్మప్రచారము చేయుచుండిరి. ఇదిగాంచిన శ్రీ , విద్యా , మాయ స్వరూపిణిలగు ముగ్గురమ్మలు కలసి లీలావతిగా గాలవ మహర్షికి పుత్రికయై జన్మించి దత్తాత్రేయుని వివాహమాడిరి.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat