_*అయ్యప్ప సర్వస్వం - 67*_*యుగాతీతుడు అయ్యప్ప - 1*

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*యుగాతీతుడు అయ్యప్ప - 1*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


నేడు అయ్యప్ప ఆరాధన బాగా ప్రబలమైపోయినది. స్వామి అయ్యప్పను గూర్చి కాస్తో కూస్తో తెలియనివారు లేదనియే చెప్పవచ్చును. కార్తీకమాసము మొదలిడినచో జాతిమత భాషా బేధము లేక సర్వేసర్వత్ర స్వాములు నల్లవస్త్రములు ధరించి మాలాధారులై , నుదుట విబూది , చందన , కుంకుమ రేఖలతో కన్పించుట సర్వసాధారణమై పోయినది. *"స్వామియే శరణం అయ్యప్ప"* అని ఎలుగెత్తి ఆస్వామి నామములను ఉచ్చరిస్తూ స్వామి అయ్యప్ప పూజలని , భజనలని తనువు మరచి , భక్తి పారవశ్యంతో , కలసికట్టుగా చేసే ఈ ఆరాధన దినదిన ప్రవర్థమానమై ఎదిగి పోయినది ఈ లోకులెరింగినదే.


ఈ యాత్రలోని విశిష్టతకు కారణమేమనగా... స్వామి అయ్యప్పకు జాతి , మత బేధముగాని , కలవారు - లేనివారను తారతమ్యంగాని , గొప్పవారు - తక్కువవారు అను తేడాలు గాని లేకపోవడమే. నేడు లక్షలాది జనులు ఒక తల్లిబిడ్డలవలె మైత్రీభావనతో 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ గుంపులు గుంపులుగా గూడి అందరినీ స్వామిగానే తలుస్తూ శబరిమలై వైపు పయనమగుచున్నారు.


ఆహా ! ఏమిటి ఈ భగవంతుని లీలావినోదం ! అని ఆశ్చర్యమగు రీత్యా భక్త సందోహం పుణ్యతీర్థయాత్రలుగా శబరిమలవైపు సాగుతూనే యున్నను వారిలో ఏ కొద్దిపాటి భక్తులు మాత్రమే ఈ యాత్రలోని పరమార్థతత్వమునెరిగి యాత్రగావించు చున్నారని అన్పించుచున్నది. *మరికొందరు ఏదో గురుస్వామి గారు చెప్పగా మాలవేసుకొని శబరిమల వెళ్ళివచ్చేవారే తప్ప ఇందులోని స్థూల సూక్ష్మార్థములను అన్వేషించు వారుగా అనిపించలేదు. ఇంకొందరేమో ఇందులోని స్థూల సూక్ష్మ పరమార్థతత్వములను ఒకదాని కొకటి సరిగా అర్థంకాక , అర్థంచేసుకోవడానికి ప్రయత్నం చేయక , ఎవరికివారు తోచినట్లు ప్రశ్నలు వేస్తూ , సలహాలు ఇస్తూ , తాము దారితప్పి , చెంతచేరిన వారిని పెడదారి పట్టిస్తుంటారు. దీని మూలాన యదార్థమయిన వివరములను తెలుసుకోవాలనే వారికి కూడా అసలైన వివరములు అందక పోయే దుస్థితి ఏర్పడుతుంది. కాస్తో కూస్తో పురాణ , పాండిత్య పరిచయం కలవారు కూడా ఈస్వామి అయ్యప్ప ఏ యుగంనాటి వారో సరిగ్గా తెలియడం లేదండీ ! ఏ పురాణమునందూ వీరిని గూర్చి వివరించినట్లు కన్పడడంలేదండి అని అనేస్తుంటారు.* అట్టివారి సంశయములను ఏకాసైన తీరుద్దామనే  ఈ వ్యాసం. ఇందులోని వివరణలన్నియూ వివిధ భాషలలోని పలు మహనీయులు రచించిన పురాణములు , చరిత్ర , గేయ , గాథల నుండి సమకూర్చి అందించబడినవే.


*శ్రీ అయ్యప్ప అనుదైవము శ్రీ ధర్మశాస్తావారా? అయ్యనారా? "* లేక హరిహర పుత్రుడా ? అను ప్రశ్నకు క్రీ.శ. 10వ శతాబ్దమునందు తమిళభాషలో రచించబడిన *పింగళ నిఘంటు* అను గ్రంథమున హరిహర పుత్రన్ , అయ్యన్ , ఆర్యన్ , పూరణైకళ్వన్ , పుట్కళైమణాళన్ , అరతైక్కాప్పోన్ , శాతవాహనన్ , కోయికొడియోన్, శాత్తన్ , వెల్లైయానైవాహనన్ , కారి (అశ్వవాహనుడు) , చెండాయుధన్ (జాటిని ఆయుధముగా కలవాడు) , యోగి , కడల్ నిరవణ్ణన్ అను పలు నామములు చెప్పబడియున్నది. కావున ఈ ప్రశ్నకు 10వ శతాబ్దము నందే సమాధానము ఇయ్యబడినట్లు తెలియవస్తున్నది. (పింగళ నిఘంటు 11వ అధ్యాయము - 117, 118) అయ్యన్ అను పదముతో మర్యాదకొరకు ఆర్ అను పదము జతకలిపి అయ్యనార్ అయినట్లు చెప్పిబడియున్నది. కేరళదేశమున భగవంతుని ఆయా నామములతో బాటు అప్పన్ అనియు అయ్యన్ అనియు కలుపుకొని సంబోధించుట వారి ఆచారము. ఉదాహరణకు గురువాయరప్పన్ , వైక్కత్తప్పన్ అను నామములను చెప్పవచ్చును. అలాగే సర్వులను బ్రోచే భగవంతుని అయ్య అని కూడా సంబోధించవచ్చును. మనము కూడా శివయ్య , సాంబయ్య అని సంబోధించినట్టే అని అనుకోవాలి. అలా కొందరు అయ్యా అనియు , మరికొందరు అప్పా అనియు పిలిచే పదములు కలిసి అయ్యప్పగా అలవాటయివుంటుందని అనుకోవచ్చును. అయితే అయ్యప్పా అను దైవమునకు మణికంఠుడు , పందళరాజకుమారుడు అను నామములు ఎలా ఏర్పడియుండును. మహమ్మదీయులైన వారు స్వామితో మైత్రీభావము ఏర్పడినట్లు ఎలాచెప్పబడుచున్నది. అలా అయినచో మణికంఠుడనే రాజు సమీపకాలము నందే నివసించి వెడలినట్లుగా గోచరిస్తుంది. అటులైనచో వారిని *'శాస్తా'* అని ఎలా చెప్పగలము అను ప్రశ్నలకు ఈ వ్యాసం చివర సమాధానం లభించును.


*శ్రీ అయ్యప్ప అను ధర్మశాస్తా ఎప్పుడు అవతరించెను?* వేదములందో లేక పురాణములందో శ్రీధర్మశాస్తా వారిని గూర్చి చెప్పబడియున్నదా ? అని కాస్త పరిశీలిద్దాం. వేదములు అనాది అయినది. ఆకాశమునందు వినిపించు నాదములను మహర్షులు తమ అతీతమైన శక్తితో గ్రహించి లోకులకు ఆ వార్తలను తెలియజేయుదురు. ఇలాంటి మహర్షులు ఎన్నెన్నో మన్వంతరములందు తెలిపిన వార్తలను ఒక్కొక్క మన్వంతరము నందు ఒక వ్యాసభగవానుడు జన్మించి వాటిని సరియైన క్రమపద్ధతిలో సమకూర్చెదరు. అలాగే ఏడవ మనువైన వైవస్వత మన్వంతరమునందు , ద్వాపర యుగమునందు శ్రీ కృష్ణులవారు అవతరించుటకు కొన్ని సంవత్సరముల ముందే జన్మించిన వేదవ్యాసులవారు (వశిష్టుడు , శక్తి - పరాశరుల వంశావళి వచ్చినవారు) ఋగ్యజుస్సామ అథర్వణ వేదములను క్రమపద్దతిగా సమకూర్చి లోకులకు ప్రసాదించిరి. వేదవ్యాసులవారి జననమునకు ముందు తలవకారం , బౌడికం , సామం మొదలగు వేదములు యున్నట్లు చెప్పబడుచున్నది. పిదప కాల క్రమేణ అవి నశించి పోయినవి. అయిననూ అందులో చెప్పబడియున్నట్టి సద్విషయములను పదునెనిమిది పురాణముల ద్వారా వేదవ్యాసుల వారు లోకులకు వెల్లడి చేసిరి. అలా వారు తెలిపిన పురాణములలో బ్రహ్మాండపురాణము , స్కాందము మున్నగు కొన్ని పురాణములలో శాస్తావారిని గూర్చి చెప్పబడియున్నది. వేదవ్యాసులవారి కూర్పే వేదము యొక్క పరిణామమైనచో శాస్తా అను దైవము వేదకాలమునందును , అందులకు మునుపటి కాలము నుండియే ఆరాధింపబడిన దైవమనుట నిస్సందేహమై తీరును.


పైగా వ్యాసభగవానులచే చెప్పబడి , వినాయకునిచే రచించబడిన మహాభారతము నందు భీష్ములవారు చివరిదశలో అంపశయ్యపై పరుండగా శ్రీమహావిష్ణువు యొక్క సహస్రనామము లను అర్జునునికి ఉపదేశించినారు. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రమున - అజో దుర్మర్షణ శాస్త్ర (208వ నామము) అని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా శ్రీశాస్తా వారి నామము చెప్పబడియున్నది. శ్రీ విష్ణుసహస్రనామమునకు భాష్యము రచించిన శ్రీ ఆదిశంకరులవారు శాస్తా అను పదమునకు దారితప్పి ప్రవర్తించువారిని శాసించి , వేద ధర్మమార్గమునందు నడిపించువారు అని తాత్పర్యము చెప్పియున్నారు. శ్రీ ఆదిశంకరులవారి కన్నతల్లి ఆర్యాంబ , శాస్తా అను దైవమును ఆరాధించి యున్నా రనుటకు ఆధారములు కలవు).


పై చెప్పబడిన వివరణల నుండి మహాభారత కాలమునందు కావ్యనాయకుడై జీవించిన శ్రీకృష్ణులవారి సహోదర వర్గములో ఒకరగు *"సాత్యకి"* అనువారు శాస్తా అవతారముగా ఎంచబడ్డారని చెప్పబడియున్నది. *"బభ్రువాహనుడు"* (ముంగీసను వాహనముగా గొనినవారు) అను నామముగూడా శాస్తావారికి కలదు. ఇదే పేరుతో అర్జునునికి నాగరాకుమారియైన చిత్రాంగదకు ఒక తనయుడున్నట్లు మహాభారతములో చెప్పబడియున్నది. మహాభారతము జరిగిన కాలఘట్టము ఏదని తెలుసుకొంటే ఆకాలము నందే శాస్తా ఆరాధన కూడా యుండియున్నదని గ్రహించుకోగలం. కావున మహాభారత కాలఘట్టం , శ్రీకృష్ణులవారి అవతార కాలములను క్రింద పొందుపరచి యున్నది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat