*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ* " - 7వ భాగము.

P Madhav Kumar


అర్జునా! పరబ్రహ్మవస్తువును తెలుసుకోనుటే జ్ఞానము. దీనినే ఆత్మజ్ఞానమని అంటారు. ఈ జ్ఞానాన్ని అందించునదే ఆధ్యాత్మవిద్య. అన్ని విద్యల కంటే శ్రేష్ఠమైనది. జరామరణాది దుఃఖములనుండి విముక్తిపొందాలంటే ఆత్మజ్ఞానమును పొందితీరవలసినదే. ఇంకొక మార్గములేదు.


ఆ మార్గమేమిటంటే, ఎచ్చటనుండి వచ్చామో, అక్కడికి చేరుకోవడమే. అంటే పరమాత్మ నుండి విడిపడిన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవడమే. అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. జీవాత్మ, పరమాత్మతో విలీనం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.


జ్ఞానముతో చేయుకర్మను యజ్ఞమని అందురు. యజ్ఞము చేయువాడు, హోమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్నియు పరబ్రహ్మస్వరూపములే, యజ్ఞఫలితము కూడా బ్రహ్మార్పణమే. అటులనే శ్రాద్ధకాలమందు శ్రాద్ధము చేయువాడు, భోక్తలు, వారు భుజించు అన్నము పరబ్రహ్మస్వరూపమే. ఆ శ్రాద్ధక్రియ ఫలితమూ బ్రహ్మార్పణమే. ఇట్టి భావముతో జీవితమందలి సర్వకర్మలను యజ్ఞదృష్టితో చేయుటయే బ్రహ్మకర్మసమాధినిష్ఠ అనబడును. ఇట్టి నిష్ఠ గలవాడు పరబ్రహ్మస్థితిని పొందును. 


అర్జునా! ద్రవ్యం, ధనం వలన సాధించబడే యజ్ఞంకంటే, జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఎందుకంటే సమస్తకర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి.


కొంతమంది దానధర్మాలే యజ్ఞంగా, తపస్సే యజ్ఞంగా, యోగసాధనే యజ్ఞంగా, వేదాధ్యయనమే యజ్ఞంగా భావించి జ్ఞానయజ్ఞము చేస్తారు. కొందరు ప్రాణాయామపరులు వాయుగతులను నిరోధించి అపానంలో ప్రాణము, ప్రాణంలో అపానము హోమం చేస్తారు.


యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానమును ఉపదేశిస్తారు. వారిని వినయవిధేయతలతో నమస్కరించి, సర్వస్యశరణాగతి నొంది, వారిని సేవిస్తూ, సమయం సందర్భం చూసి ప్రశ్నించి తెలుసుకోవాలి.


అర్జునా! అటువంటి జ్ఞానమును తెలుసుకుంటే నీవు తిరిగి మొహాన్ని పొందకా, సమస్త ప్రాణులను నీలోనూ, నాలోనూ చూడగలవు. జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. 


కావునా, అర్జునా! జ్ఞానమనే కత్తితో నీలోవున్న అజ్ఞానాన్ని నరికి నిష్కామ కర్మయోగం ఆచరించు, అని మానవులందరితరుపున ప్రతినిధియైన అర్జునునికి కృష్ణపరమాత్మ ఉపదేశించాడు.

✍️శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).


తదుపరి భాగంలో కలుసుకుందాము...!!                                                    🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat