"భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ" - 9వ భాగము.

P Madhav Kumar


మనోనిగ్రహానికి, వైరాగ్యంతో కూడిన అభ్యాసముండాలి. వైరాగ్యముండి అభ్యాసము లేకపోయినా, అభ్యాసము మాత్రమేనుండి వైరాగ్యము లేకపోయినా మనస్సును స్వాధీనపరుచుకొనుట కుదరదు. 


ఒక కార్యమును సాధించుటకు నిర్విరామంగా, పట్టుదలతో చేయు ప్రయత్నమే అభ్యాసము. ఈ జన్మలో ఏర్పడిన వికారములు, గత జన్మలనుండి సంప్రాప్తించిన విషయవాసనలు జీవునిలో పూర్తిగా తొలగిపోవాలంటే నిరంతర అభ్యాసముద్వారా మనస్సుపై పట్టుసాధించాలి. ఈ అభ్యాసమంతా వైరాగ్యంతో(విషయవిరక్తితో) సాగాలి. అంటే శాశ్వతము కానీ ఇంద్రియసుఖముల వెంట నిరంతరం పరిగెత్తు మనస్సుని ధ్యానము ద్వారా శాశ్వతము, సత్యమగు పరమాత్మ వైపు మరల్చాలి.


ఈ కాలంలో అనేక ధ్యానపద్ధతులు అమల్లోవున్నాయి. ఏ పద్ధతైనా సరే, మనస్సును ఏకాగ్రపరచి దైవచింతన చేయడమే ముఖ్యము. ఆరంభదశలో మనస్సు పరిపరివిధముల పరిగెత్తినా, మెల్లగా ఆత్మయందు స్థాపితము చేయాలి.


సులభంగా చెప్పాలంటే ధ్యానమును కొత్తగా నేర్చుకొనవలసిన అవసరంలేదు. అందరూ నిత్యమూ చేస్తున్నదే. అయితే ఇన్నాళ్లు జీవుడు ధ్యానిస్తున్నది కేవలము ఈ ప్రాపంచిక విషయములు లేదా భోగవిలాసములైతే, ఇప్పుడు ఆ ధ్యానమును పరమాత్మవస్తువుపై మళ్లించడం అంతే. ప్రతిరోజు ఓ నిర్ణీత సమయమందు ధ్యానము చేస్తూ, మెల్లమెల్లగా ధ్యాననిడివి పెంచుకుంటూ పోతే మనస్సు అధీనంలోకి తప్పక వస్తుంది.


జననమరణ చట్రం నుండి బయటపడడమే అసలైన సాధన. దేనిని తెలుసుకుంటే ఈ చట్రములో తిరిగి ప్రవేసించడో, ఏది తెలుసుకుంటే ఆత్మానందమును పొందునో, ఏది తెలుసుకుంటే ఈ చరాచర జగత్తును సమదృష్టితో చూడగలడో, ఏది తెలుసుకుంటే అసలు సత్యము అవగతమగునో, దానిని ఈ ధ్యానము ద్వారా పొందవలెను.


నారాయణుని ధ్యానించి నరుని దూషిస్తే ప్రయోజనంలేదు. మాధవుని పూజించి మానవధర్మమును విస్మరిస్తే మనుగడలేదు. సత్యమును మరచి సదాశివుని స్మరిస్తే లాభములేదు. ఈ తత్వము నెఱింగి చేయు సాధనే ధ్యానము. 


ఈరోజు నవ్వుతూ చేసిన పాపమునకు, రేపు ఏడుస్తూ దుఃఖము అనుభవించవలసిందే. ఇది పరమాత్మ నిర్ణయము. కావునా జీవుడు నిష్కామకర్మాచరణతో జ్ఞానమును సాధించి ధ్యానముతో బ్రహ్మానందమును అనుభవించే మార్గమును అర్జునునికి భోదించేడు శ్రీకృష్ణుడు.


ఈ భాగముతో జగద్గురువు శ్రీకృష్ణుడు మనకు అందించిన కర్మయోగమును తెలుపు ప్రధమషట్కము సమాప్తమైనది. తదుపరి భాగము నుండి భక్తియోగమును ప్రతిపాదించు ద్వితీయషట్కము ఆరంభమగును. 


ఓమ్ తత్సత్! శ్రీకృష్ణార్పణమస్తు!!

శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🌹 

                                                   

🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat