*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*యుగాతీతుడు అయ్యప్ప - 6*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
క్రీ.శ. 1081 కి పిదప కొందరు పాండ్యరాజులు వళియూర్ నందును , తెనాకాశి యందును సామంతరాజులై పాలించుచుండిరి. వారి వంశావళికి చెందిన రాజ కుటుంబీకులు కేరళ దేశమునకు వలస వెడలి పందళ రాజ్యమును స్థాపించిరి. వారి వంశమునకు చెందిన యొక రాజే శ్రీ మణికంఠస్వామి వారి పెంపుడు తండ్రిగా కీర్తి ఘటించిన రాజశేఖర పాండ్యుడు. పూజ్ఞార్ , ఇంజిప్పార కోట , కరిమల మున్నగు స్థలములు ఈ పాండ్య దేశమునకు చెందిన ప్రదేశములగును. రాజశేఖర పాండ్యుడు సాత్వికుడు , దైవభక్తి పరాయణుడు. అతని కాలమునందే ఉదయనుడు , పుదుశ్శేరి మల్లన్ , ముండన్ మున్నగు బందిపోట్ల విజృంభణ ఎక్కువై దేశములో అరాచకము పెరిగిపోయినది. ఉదయనుడు కోటలో దూరి రాజశేఖరుని కుమార్తెను అపహరించుటకు వెళ్ళి తన రహస్య స్థావరముగా మార్చుకొన్న ఇంజిప్పార కోటలో చెరయుంచి తనను వివాహమాడమని హింసించు చుండెను. అప్పటి పందళరాజ వంశీయుల కులదైవమై ఆరాధనలు అందుకొనుచుండిన శబరిమల శాస్తావారి రక్ష పందళ దేశస్థులకు వుందని తెలుసుకొన్న ఉదయనుడు ఆ ఆలయమునకు తన పరివారముతో వెళ్ళి అచ్చటి పూజారి తలను నరికి , విగ్రహమును పగల గొట్టి , సిరిసంపదలను కొల్లగొట్టెను. ఈ దృశ్యమును కనులారా గాంచిన శబరిమల పూజారిగారి తనయుడగు జయంతుడు కాంతమలైలోని స్వర్ణ మందిరము వెడలి శ్రీ శాస్తా వారిని గూర్చి తపము చేసెను. అశరీర వాణిగా వినిపించిన శ్రీ శాస్తావారి ఆదేశాను సారం మారువేషము ధరించి , రాజశేఖర పాండ్యుని కొలువునుండి వెలివేయబడిన సిపాయి అని చెప్పుకొంటూ ఇంజిప్పార కోటలో ప్రవేశించి , ఉదయనునికి విశ్వాస పాత్రుడై కొన్నాళ్ళు కాలము గడిపెను. తగిన తరుణాన ఉదయుని మోసగించి ఇంజిప్పార కోటనుండి రాకుమారిని రక్షించి పొన్నంబల మేడుకు తరలించుకు పోయి ఆమెను వివాహమాడెను.
ఇది వరకే పొన్నంబల మేడులో నిత్యనివాసియై కోవెలగొని యున్న శ్రీ ధర్మశాస్తా వారు అశరీరవాణియై జయంతునికి చెప్పినట్లు కంఠమున మణిహారముతో వారికి పుత్రుడై ఆవిర్భవించెను. ఆ పసిబాలునికి పూజారి తనయుడగు జయంతుడు వేదవేదాంగము లను , రాకుమారియగు తల్లి యుద్ధ విద్యలను క్షుణ్ణముగా నేర్పించిరి. బాల్యములోనే అతనికి కర్తవ్య ప్రబోధ చేసి పందళ రాజ్యమునకు సాగనంపిరి. రాజశేఖరుని వద్దకు వెడలిన మణికంఠుడు ఆ పసితనములోనే మాతృ శిరోవేదన కొరకై అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చి తన సాటిలేని పరాక్రమాన్ని లోకులకు తెలియజెప్పెను. రాజశేఖర పాండ్యుడు మణికంఠుని యొక్క మహిమలను గ్రహించి అతనికి కేరళ వర్మా అను బిరుదు నొసంగి యువరాజ పట్టాభిషిక్తుని కావించెను. పందళ రాజ్యములోని రాముడు , కృష్ణుడు అనబడు వీరులు మణికంఠునికి అప్పటి కేరళలో సుప్రసిద్ధమైన క్షురికాయుధ ప్రయోగం అనబడు యుద్ధ పరిపాటిని తదితర క్షాత్ర విద్యలను నేర్పించిరి. అప్పట్లో ఈ విద్యలో నిపుణుడై పేరుగాంచి యుండిన కొచ్చుకడుత్తె అను వీరుని గెలిచిన మణికంఠుడు అతన్ని తన సైన్యాధిపతిగా అమర్చుకొనెను.
అరేబియా దేశములోని కలెపె రాజ్యం - కీర్తోట్టం మక్కంపూరు అను స్థలనివాసులగు ఇస్లాం మతస్థులైన ఆలిక్కుట్టి , ఫాతిమా దంపతులకు పుట్టిన వావర్ అనబడు మంత్ర తంత్ర శాస్త్ర ప్రవీణుడు , వ్యాపారస్థుడు అను ముసుగులో పడవ మూలముగా కేరళ దేశము వచ్చి అచ్చటి కొంతమందితో చేతులు కలిపి ప్రజలను కొల్లగొట్టి జీవించుచుండెను. దొంగే ఐనను కలవారిని మాత్రం కొల్లగొట్టి లేనివారిని ఆదరించే సహృదయం వావరులో యున్నదని తెలుసుకొన్న మణికంఠుడు ముఖా ముఖి యుద్దములో వావరును జయించి అతని మనస్సును మార్చి అతన్ని తన అంగరక్షకునిగా గావించుకొనెను. వారిరువురు కలిసి కేరళ సుప్రసిద్ధ ఆశానగు చీరప్పన్ అను వీరుని కలిసి , దేశ పరిస్థితిని , వివరించి అతన్ని మిత్రుని గావించుకొనెను. పిదప ఆ ముగ్గురు కలిసి తమిళనాడులోని మధుర రాజును కలిసి యుద్ధ ఆయుధములను , కొంతమంది వీరులను , సాయముగా పొంది , వారికి చక్కని శిక్షణ నిచ్చి , ఇంజిప్పారకేట , తలప్పారమల అనుస్థలములలో దాగియున్న దేశవిద్రోహ శక్తులగు ఉదయనుడు , మల్లన్ , ముండన్ మున్నగు భయంకర బందిపోటు దొంగలను తదేక కాలములో ముట్టడిచేసి హతమార్చెను. వందళ రాజ్యం దొంగల భయం తొలగి మునుపటి ప్రశాంత వాతావరణానికి అలవాటైన పిమ్మట కేరళ వర్మ యనబడు మణికంఠుడు , తన మిత్రులతోను , పరివారముతోను , రాజశేఖర పాండ్యుని ఆధ్వర్యమున పంబాతీరము చేరి శబరిమల దేవాలయమును పునరుద్ధరణ చేసి శ్రీ శాస్తా విగ్రహమును ప్రతిష్ఠించెను.
అందరి మన్ననలందుకొనిన మణికంఠుడు తన కర్తవ్యము ముగిసినది అంటూ , సర్వులు చూస్తుండగా జ్యోతి పుంజముగా మారి అచ్చట ప్రతిష్టించబడిన శాస్తా విగ్రహములో లయించి తన అవతారమును ముగించుకొనెను. ఆ దినం మకర సంక్రాంతి పర్వదినం , కావున అప్పటి నుండి ప్రతి మకర సంక్రాంతికి భక్తులు శబరిమల యాత్రవెళ్ళి శ్రీ శాస్తావారిని జ్యోతిగా దర్శించుకొనే పరిపాటి ఏర్పడినది. పూంజ్ఞార్ పాండ్యవంశ చరిత్ర ప్రకారం కొల్లం ఆండు 270 మొదలు 296 వరకు అనగా క్రీ.శ. 1095 మొదలు 1121 వరకు) 26 సంవత్సరములు శ్రీ మణికంఠుడు కేరళ వర్మ పేరిట నివసించి పలు అద్భుత లీలా వినోదములను సలిఎ 'యున్నాడని తెలియవస్తున్నది.
తదుపరి 1949లో గూడ దుష్టశక్తులు నిరీశ్వరవాదుల వలన ఈ దేవాలయ విగ్రహం పగులగొట్టబడి వునః ప్రతిష్ట గావించిబడినట్లుగాను , 1951లో ఈ ఆలయం అగ్ని ప్రమాదమునకు గురి అయినట్లుగాను కేరళ చరిత్ర ద్వారా తెలియవస్తున్నది.
తదుపరి శ్రీ పి.టి. రాజన్ అనబడు తమిళనాడుకు చెందిన భక్తులొకరు పంచలోహముతో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారుచేయించి దాన్ని తమిళనాడు మరియు కేరళ రాష్ట్రములో పలు ఊర్లలో త్రిప్పి పలు మహనీయులచే పూజలు చేయించి శబరిమలకు కొనితెచ్చి అప్పటి శబరిమల ప్రధాన తంత్రిగారిచే కేరళ ఆచారప్రకారము జీవోద్వాసన చేసి ప్రతిష్టించినారు. ప్రస్తుతము మనము శబరిమలలో దర్శించుకొనే పంచలోహ విగ్రహం శ్రీ పి.టి. రాజన్ గారు చేసినదే.
సాక్షాత్ హరిహర సుతుడైన మణికంఠ శాస్తావారి దివ్యచైతన్యము , సాన్నిధ్యము శబరిమలపై నేటికిని సంపూర్ణముగా యున్నది. ఆ శక్తియే లక్షలాది భక్తులను శబరిమలైకు ఆకర్షిస్తున్నది. కేరళీయుల ఆరాధ్యదైవమగు స్వామి అయ్యప్ప వారి మహిమలు అల్లనల్లగా తమిళనాడు , కర్ణాటకము , ఆంధ్రయని ప్రాకి నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు శబరిమల యాత్రీకులైనందులకు కారణం ఈ యాత్రలో చెప్పబడు సమత్వము , సాహోదరత్వం , సర్వమత సమ్మతము మున్నగు విధి విధానములే యగును. ఇచ్చటికి ఓ మారు వచ్చి శ్రీ స్వామి అయ్యప్పను దర్శించుకొన్నవారు , మరల మరల ఈ యాత్రను ప్రియముగా స్వీకరించుట ఈ స్థలమునకున్న ప్రత్యేక లక్షణ మగును.
దేవతలు ఎప్పుడు అవతరించినారు ? దేవతా విగ్రహములు ఎప్పుడు ఎవరిచే ప్రతిష్టింప బడినవి ? అనునది తెలుసుకొనదగిన విషయములే అయినను ఆ విషయమై చర్చకు దిగి , కాలం వృథా చేయక ఆ దైవములను ఆరాధించే విధి విధానములను తెలుసుకొని అనుగ్రహము బడయుటకు కృషిచేయుటయే ఉత్తమ భక్తులు లక్షణము. ప్రతిష్టింపబడిన ఆ విగ్రహము తమ కోర్కెలను తీరుస్తున్నదాయని తెలుసుకొన్న పిదపే భక్తులు ఆ దైవాన్ని తమ కులదైవముగాను ఇష్టదైవముగాను ఎంచి పూజించి ఆరాధిస్తున్నారు. సకల దైవములు శ్రీ హరి యొక్క రూపములే. సకల దేవతా నమస్కారములను స్వీకరించు వాడు శ్రీ మన్నారాయణుడే.
*ఆకాశాత్ పతితం తోయం యధాగచ్ఛతి సాగరం | సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి ॥*
అన్నట్లు సర్వదేవతా స్వరూపియై , ఇందుగల డందు లేడను సందేహము వలదను రీత్యా సర్వము నందు నిండియుండు భగవంతుడు ఎవరెవరు ఏఏ రూప నామములలో మ్రొక్కి ఆరాధిస్తున్నారో ఆయా రూపములో కనిపించి అనుగ్రహము ఒసంగు చున్నాడనునదే సత్యము. *'సంభవామి యుగే యుగే* అన్నట్లు కాల , దేశ కళాచారాను సారము భగవంతుడు పలువేరు రూప , నామములతో అవతరించి సజ్జనులను పాలించి రక్షిస్తున్నాడను సత్యమును తెలుసుకొన్నవారికి మాత్రమే ఏసు ప్రభువులోను , అల్లాలోను పరమాత్మను సందర్శించుకొనే భాగ్యము లభించును.
దారి తప్పి పతనం పైవు ఒరిగి పడిపోతున్న మానావాళికి ధర్మప్రబోధ చేసి , సద్గురువై , సన్మార్గము చూపించే అయ్యప్ప ఆరాధనయు , శబరిమలై యాత్రయు మానవులై పుట్టిన ప్రతివారు తమ జీవిత కాలములో ఒక్క పర్యాయమైన ప్రియముగా స్వీకరించ వలసిన యాత్రనిన మిన్నగాదు. *స్వామిశరణం.*
*రేపటి నుండి వివిధ ప్రాంతాలలోని అయ్యప్ప దేవాలయాలు గురించి చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*