🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*తుమ్మగుంట శ్రీ అయ్యప్ప క్షేత్రము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
దక్షిణాపథము నందలి కేరళ రాష్ట్రము అయ్యప్ప స్వామి భక్తులకు నిలయము. మరియు వేదపండితులు , మంత్రోపాసకులు నిత్యాగ్నిహోత్రులు. నియమనిష్ఠలతో సదాచారసంపన్నులై అహింసా సిద్ధాంతముతో తరతరాలుగా సత్ శీలురైన బ్రాహ్మణులకు నివాసస్థానము. ఆగమశాస్త్రముతో పాటు తాంత్రికవిధానముల పూజలు నిరాకారస్వరూప ప్రాముఖ్యతకు ప్రాధాన్యమిచ్చే అంకితమూర్తులు అచ్చటి విప్రోత్తములు. ఈ సిద్ధాంతము విరివిగా విస్తరించి మలయాళ మంత్ర పటిమ , యశస్సు వీరివలన దశదిశలా విస్తరించినది. ఇలాంటి సదాచార సంపన్న ఉపాసకులు అయ్యప్ప ఆరాధకులైన విప్రోత్తములు నివాసము కేరళ , తమిళనాడు సరిహద్దులలో ప్రవహించు తామ్రపర్ణీనదీ తీరమునగల కండ్రమాణిక్య అగ్రహారీకులు అనుటకు ముఖ్య ఆధారముగా
*తామ్ర పర్ణినదీతీరాత్ అగతాః ద్రవిడ ద్విజాః*
*పినాకినీ నదీతీర గ్రామేహ్యత్రవసన్తిపిహి |తుమ్మగుంటదే దేవః విశ్వేశః సకళ త్రవాన్ రక్షతిస్వాజ్ఞయాతత్ర భూసురాన్ భాసురాన్ ముదా ॥*
అందువలన వీరతామ్రపర్ణితీరము నుండి విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయల వారల ఆహ్వానముపై ఆంధ్రదేశమునకు వచ్చి తుమ్మగుంట అగ్రహారమేర్పరుచుకొనిరనుటకు సాక్ష్యాధారమైనది. ఈ పరిస్థితులలో దక్షిణా పథమును ఏకచక్రాధిపత్యముగా పరిపాలించు చున్న అరవీరభయంకరుడు కవిపండితపోషకుడు కళాపిపాసి హిందూ మతోద్దరణకు అవతరించిన కారణజన్ముడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. వీరు తన సామ్రాజ్య విస్తరణకై పలు యుద్ధములలో విజయము సాధించి ఇతర సామంతులను పరాజితులనుగావించి విజయయాత్ర చేయుచూ కేరళ ప్రాంతము చేరిరి. వారి సాహిత్య కళాభిరుచులు గుర్తెరింగి యెందరో వివిధ రంగములలో ప్రజ్ఞాధురీణులు వీరినాశ్రయించి నృపాలుని అనుగ్రహముతో అప్లైశ్వర్యములు పొందుచుండిరి. ఇట్టివారిలో కండ్ర మాణిక్య అగ్రహారీకులు మంత్రోపాసకులు వేదపండితులైన ద్రవిడ బ్రాహ్మణ కుటుంబములు వారి సమాచారము తెలుసుకొని ఆ పండితులను ఆహ్వానించి తన పర్యటనలో తనతో తీసికొనివచ్చిరి. ఇలా రాజాశ్రయముతో తెలుగు దేశమునకు వచ్చిన వారు నెల్లూరు జిల్లాలోని రామతీర్థక్షేత్రమునకు వెళ్ళి పవిత్ర సముద్ర స్నానానంతరం శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారికి అభిషేకపూజలు నిర్వహించి తిరుగు ప్రయాణములో వావిళ్ళ చౌకచర్ల గ్రామముల మధ్యగల విశాల మైదానములో విశ్రాంతికై విశ్రమించిరి. నృపాలుని రథగజతురగములు అచ్చటవిడిది చేయుట మత్త గజములు సమీపమునగల తటాకములో సేదదీర్చుకొని నిద్రపోయినవట. ఆ గుంట నేటికీ ఏనుగు గుంటగా శాశ్వత నామము కలిగియున్నది. రాజు - విశ్రమించి యున్న తరుణములో వారికి స్వప్నమున ఈ ప్రాంతమున ఒక గ్రామము నిర్మించమని దైవ ప్రేరణ కలుగ , విషయము మంత్రులకు తెలిపి గ్రామ నిర్మాణము జరిపించి అందుకండ్రమాణిక్య అగ్రహారీకులకు నివాసము లేర్పరిచి తగిన వసతులతో వారికి నీడకల్పించిరి. అటుల విజయనగరాధీశుడు శ్రీ కృష్ణ దేవరాయుల సంకల్ప కార్యరూపమే నేటి ప్రసిద్ధ దివ్యక్షేత్రమైన తుమ్మగుంట.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*