🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*తుమ్మగుంట శ్రీ అయ్యప్ప క్షేత్రము - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అయ్యప్ప స్వామి తుమ్మగుంటకు ఆగమనము*
ఈ విధముగా నిర్మాణమైన తుమ్మగుంటలో వేదపండితులైన బ్రాహ్మణ కుటుంబములతో పాటు బ్రాహ్మణేతరులైన రెడ్డి , అగ్నికులక్షత్రియులు , రజక , కంసాలి , మంగలి లాంటి ఇతర కులస్థులు వచ్చి చేరిరి. బ్రాహ్మణ కుటుంబములు గ్రామములో ప్రధాన ప్రాంతములో బ్రాహ్మణేతరులు తూర్పు , పడమర వీధులలో స్థిరపడిరి. ఇలా అంగరంగ వైభవముగా పాడిపంట సిరులకు నిలయమైనది తుమ్మగుంట. ఇన్ని వసతులు ప్రజల అండదండలున్నా వారికి తమ ఆరాధ్యదైవము అయ్యప్పకు దూరమైతిమను చింతబాధించు చుండెను. ఈ అసంతృప్తి తీర్చి తమకు దర్శనభాగ్యము కలిగించమని సమస్తకుటుంబములు అయ్యప్పను వేడుకొనసాగిరి. వీరికోరికను మన్నించుటకు సాక్షాత్తు శబరిగిరి వాసుడు అయ్యప్ప గ్రామపెద్దకు స్వప్న దర్శనమిచ్చి తన అంశ తుమ్మగుంటకు అరుదెంచి మీ అభీష్టము నేరవేర్చునని గ్రామ పశ్చిమ ప్రాంతములో నాకు అత్యంత ప్రీతికరమైన నిరాకారస్పూర్తితో శిలావేదిక నిర్మించి అందు దేవతావృక్షము మహాలక్ష్మీ , మహాసరస్వతి , మహేశ్వరీమాతలను త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు అత్యంత ప్రీతికరము. మణికంఠునికి అరణ్యములో చల్లని నీడ నిచ్చిన జువ్వి (ప్లక్ష) వృక్షమును శాస్తా మహామంత్ర సహితముగా ప్రతిష్ఠించి దేశాచారప్రకారము ఆగమశాస్త్రపూజలు , మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు అకారాంతక్షకారశబ్ద ఓంకారనాద సహిత అష్టోత్తర , సహస్రనామ పూజలు ఉభయ వేళలా దీపారాధన , మహానివేదన కర్పూరహారతులు శ్రీమహాలక్ష్మీ పూజలు పర్వదినములలో లలితాసహస్రనామ , ఖడ్గమాలాకుంకుమార్చనలు , తొలుతగా హరిద్రగణపతికి నిర్విఘ్న పూజలు జరిపి మనోభీష్టములు తీర్చుకొని సుఖసంతోషములతో ఇహపర సుఖములతో తనలో లీనము కమ్మని సెలవిచ్చిరి. మరియు క్లిష్ట సమయములో తనను ధ్యానించి ముడుపు కట్టి నాకు ప్రీతికరముగా శాంతి పూజలు వడపప్పు పానకములు చేసిన నేను భక్తులపై ఆవహించి కర్తవ్యముబోధించి పరిస్థితులు చక్కబరుతును.
అనగా స్వామి తమరు వెలసిన జువ్వి వృక్షము నెలాగుర్తింప గలమని ప్రశ్న వేయగా స్వామి ఆవహించి గ్రామమునకు దక్షిణ ప్రాంతమున గల పెద్ద మామిడి తోటలో గల పెద్ద రావి వృక్ష సమీపములో జువ్వి మొలకలు గలవు. అందునేను వెలసిన మొక్క సాంబ్రాణివాసనలు వెదజల్లుచుండును. ఈ విషయముల గమనించి దేవకార్యము జరుపుడని అనుజ్ఞయివ్వగా గ్రామస్థులు ఒక శుభము హుర్తమున శిలావేదిక నిర్మించి మంగళ వాయిద్యములతో ఆ మామిడితోట జొచ్చి రావివృక్ష సమీపమున గల జువ్వి మొలకలలో ఒక మొక్క జీవకళతో శోభాయమానమై సాంబ్రాణివాసనలు వెదజల్లు మొక్క కనిపించెను. పరమానంద భరితులై పుణ్యా హవచనము జరిపి వేదపారాయణ అయ్యప్ప నామసంకీర్తన మంగళవాయిద్యములతో గ్రామమునకు తెచ్చి శిలాపీఠముపై ప్రతిష్ఠించి యంత్రప్రతిష్ఠ మహా కుంభాబిషేకములు ఆగమశాస్త్రానుసారము జరిపినాటినుండి గ్రామములోని బ్రాహ్మణకుటుంబములు ప్రతిరోజు ఒక్కొక్కరు వంతులుగా ఉభయవేళ దూపదీపారాధనలు మహానివేదన కర్పూర హారతులు నిర్వహించుచుండ ఇతర కులస్థులు ఈ సత్కార్యమునకు సహకరించుచుండిరి.
ఈ విధముగా అయ్యప్ప స్వామి స్వయముగా వచ్చి వెలసిన మహి మాన్విత దివ్యక్షేత్రము తుమ్మగుంట అయ్యప్ప స్వామి క్షేత్రము. స్వామివారి ఆగమనముతో గ్రామములోని అన్ని కుటుంబములతో పాటు పాడిపంటలు పశువులు , భూములు దినదినాభివృద్ధి చెంది విస్తరించసాగెను. ఇంతటి మహిమాన్విత కలియుగ ప్రత్యక్షదైవము హరిహరపుత్రుడు , పూర్ణ , పుష్కలా దేవీసమేత ధర్మశాస్తా అవతారమైన అయ్యప్ప తుమ్మగుంట క్షేత్రమును నాటి నుంచి నేటివరకేగాక ముందు తరములకు ఆరాధ్య మూర్తియై తన అభయహస్త ఆశీర్వచనముతో కాపాడుచున్నారు. ప్రజలు స్వామిని పూజించుటయే గాక తమ సంతానములను , స్వామి పేరున నామధేయము చేయుటవలన తుమ్మగుంట , అనుబంధ గ్రామములలో అయ్యప్ప , మణికంఠ , శాస్తా గురునాథ , గుఱ్ఱప్ప అనుపేర్లు పురుషులకు , పూర్ణ , పుష్కల మంజు నామధేయములు స్త్రీలు కలిగి విరాజిల్లుచున్నారు. మరియు ప్రకృతి వైపరీత్యములు కలిగినంతనే స్వామి భక్తులపై ఆవాహనమై తనమహిమను ఋజువుచేసి సమస్య పరిష్కారము చేయుట నేటికి ప్రబల నిదర్శనము. ఈ గ్రామస్థులు తమగృహములో యెలాంటి శుభకార్యము నిర్వహించిన తొలుత అయ్యప్ప పూజలు , పొంగళ్ళు పొంగించుట జరిపి తమకులదైవమైన శ్రీ అయ్యప్ప స్వామిని ప్రసన్నుని చేసుకోని శుభములు పొందుచున్నారు. ఈ సమయములలో స్వామి వారు చూపిన మహిమ నిదర్శనలు అద్భుతమైనవి. ఈ ఆలయము ప్రభుత్వపర్యవేక్ష ఎండోమెంటు ద్వారా ఇ.వో.లు నిర్వహించుచున్నారు.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*