🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కుళత్తు పుళ - 3*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*క్షేత్రవిశేషము*
*"కుళత్తూర్ అయ్యన్"* అని పిలువబడే ఈ బాల శాస్తావారి దేవాలయము చుట్టు నదీప్రవాహముతో ఒక దీప గర్భములోని ఆలయములా కన్పించుచున్నది. ఇచ్చట శ్రీ మహాగణపతి , శ్రీ మాతా భగవతిల సన్నిధిలు గలవు. అత్యంత ఆచారముగల నైష్టిక బ్రహ్మచర్యమును స్ఫూర్తించే సన్నిధిలో కుళత్తుపుళై బాలునిగా శ్రీశాస్తావారు అమరియున్నారు. శ్రీ శాస్తావారి ఐదు ఆధార స్థలములలో ఈ కుళత్తుపుళై ఆలయమొకటి యగును. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ స్థలము , ఈ దేవాలయము , చుట్టు ప్రవహించే నదియు ఇచ్చట సందర్శకులై వచ్చే భక్త జనావళికి అలౌకిక ఆనందానుభూతిని కల్గించుననుటలో సందేహము లేదు. ఈ ఆలయమునకు వెనుక ఒక ఫర్లాంగు దూరమున నాగకన్యల ప్రతిష్టలు గలవు.
చైత్రమాసము విషు తదనంతరము వచ్చే నాల్గవ దినము
*“నూరం - పాలుం"* అనబడు విశేష అభిషేక ఆరాధనలు ఈ నాగకన్యలకు జరిపించినచో సంతానప్రాప్తికి అడ్డుగా యుండు సర్పదోషము తొలగి సత్ సంతానప్రాప్తి కల్గునని సద్గురునాథుని తిరువనంతపురం శ్రీనీలకంఠ అయ్యర్ గురుస్వామిగారు చెపుతుంటారు. ఆమేరకు ఇచ్చట అభిషేకము జరిపించి సత్ సంతానము పొందినవారు ఆ బిడ్డలకు నాగదేవత నామాన్ని పెట్టుకొన్న కథలు అనేకము గలదు. ప్రస్తుత కాలములో ఈ అభిషేక ఆరాధనము చేయుచున్నారా ? అని సరిగ్గా తెలియడం లేదు. కలత్తుపుళై ఆ యములో చైత్రమాసం విషు పర్వదినం ముఖ్యతిరునాళ్ళుగా యెంచి సలుపబడుచున్నది. విషు పండుగకు మొదటి దినం భక్తులు పరిసర ప్రాంతములోని గ్రామవాసులు గూడా కుళత్తుపుళై గ్రామము చేరి ఆడుతూ , పాడుతూ రాత్రి అంతా జాగారము చేసి తెల్లవారకముందే పుణ్యనదిలో స్నానమాడి స్వామి సన్నిధి చేరి తలుపులు తెరవగానే శ్రీస్వామివారిని *'కణిచూచుట'* అను ఆచారము బహువిశేషముగా నేటికిని ఈ ఆలయమున జరిగే కార్యక్రమమగును. శ్రీబాలశాస్తావారి అనుగ్రహముచే గొడ్రాలి తనము గూడా తొలగి అద్భుతములా పుత్రభాగ్యము పొందిన కథలు ఇచ్చట అనేకము గలవు.
అట్టివారు తమకు వరప్రసాదముగా లభించిన ఆ పసికందులను ఆలయ ప్రాకారమంతయూ శయన ప్రదక్షిణము గావించుట చూచువేళ భక్తి పారవశ్యము నిండును. ఈ కుళత్తూర్ బాలశాస్తావారిని గూర్చి అనేక పెద్ద పెద్ద గురుస్వాములు గేయ గాన రూపముగా కీర్తించి యున్నారు. మరెందరో శ్రీ కుళత్తూర్ అయ్యను కులదైవముగా ఎంచి ఆరాధిస్తున్నారు. భక్తులు శబరిమల యాత్రలో యొకభాగముగా కుళత్తూర్ బాలశాస్తావారిని దర్శించి తరించి జీవితమున కొరతలు తీరి సుఖించవలయునని ఆ కుళత్తూర్ నివాసియగు బాలశాస్తావారి వద్ద వేడుకొనుచున్నాము.
*రేపటి నుండి అచ్చన్ కోవిల్ అరసే ...! అచ్చన్ కోవిల్ కరుప్పస్వామి గురించి చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*