🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కుళత్తు పుళ - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇచ్చట ఎవ్వరు ఇందులోని చేపలను పట్టకూడదన్నది విధి. ఈ దేవాలయమును సందర్శించుకొనే భక్తులు ఈ ఏటిలోని మత్స్యములను శ్రీశాస్తావారిగానే భావించి ఆ చేపలకు బొరుగులు విసిరి ఆనందించెదరు. ఆ చేపలు ఒకదాని మీద యొకటి పడుతూ , ఎగురుతూ , నీటమీదకు వచ్చి భక్తులు ప్రసాదించే బొరుగులను నోట స్వీకరించి నీటిలో మాయమగుట చూసి తరించవలసిన యొక ఆనంద దృశ్యమగును. ఈ ఏటిలోని చేపల గురించి కర్ణపాఠం పర్యముగా పలుగాథలలో యొకటి మిక్కిలి అద్భుతముగా వినసొంపుగా యున్నది.
అది ఏమనగా ఒక యుక్త వయస్సు వచ్చిన కన్నెపిల్ల , అబల , సవితి తల్లి కట్టుబాటులో బానిసలా యుంటూ , ఆమె ఆజ్ఞలకు కట్టుబడి పనిచేస్తూ బ్రతుకుచుండెను. ఆమెకుయున్న ఒకే ఒక ఆస్తి ఏమనగా తన అమ్మ మరణించు తరుణాన ఆమెచేతిలో వేసిన ఒక బంగారు ఉంగరము మాత్రమే. ఒకదినం ఆమెనదిలో స్నానమాడి లేవగా ఆ ఉంగరం ఊడి నీటిలోపడిపోయెను. అభము శుభము తెలియని కన్నెపిల్ల , పిన్ని ఏమంటుందో అనిదలచి బెదరి ఎంతోసేపు నీటిలో వెతికిననూ పడిపోయిన ఉంగరము దొరకలేదు. అలసిపోయిన ఆ యువతి ఏమిచేయాలో తోచక కుళత్తూర్ బాలుని సన్నిధి ముంగిట కన్నీరు మున్నీరుగా నిలబడి విలపించెను. ఉంగరము లేక ఇంటికి వెళ్ళినచో పినతల్లి ఊరకుండదు. దిక్కులేని పసిపిల్ల ఇంకెవరితో మొరలిడుతుంది. అందరి కోర్కెలను తీర్చు శ్రీ స్వామి వారివద్దనే మొరలిడెను. వేరేదారి తోచక చాలాసేపు కంటతడి పెట్టుకొంటూ అచ్చటే నిలబడిపోయిన ఆ పిల్ల కాసేపటికెల్లా దిగ్భ్రాంతి చెంది అటూ ఇటూ తిరుగసాగెను.
అలా ఎన్నిసార్లు తిరిగినదో ఆమెకే తెలియదు. పిల్ల వచ్చినది మొదలు ఆమె ఆరాటస్థితిని గమనించు చుండిన పూజారి ఆమెను దగ్గరకు పిలిచి విషయమేమని అడుగగా తనబాధను ఏడుస్తూ ఆమె వివరించెను. పూజారి పశ్చాత్తాప హృదయుడై , *"బిడ్డా ! కుళత్తూర్ బాలుడు నీమొర ఆలకిస్తాడులే , నిన్ను తప్పక ఆదరించి , నీబాధను తీరుస్తాడు. చింతవలదు. ఏడ్పు మానుము"* అని ఓదారుస్తుండగానే ఒక అద్భుతము అచ్చట జరిగినది. ఆలయ ముఖద్వారము బయటనుండి ఒక మత్స్యకారుడు పూజారిని కేకపెట్టి పిలిచెను. ఏమయ్యా అని దగ్గరకు వచ్చిన పూజారి అడుగగా తాను ఉదయం చేపలు పట్టడానికి సుదూరాన వెళ్ళినట్టుగాను , వెళ్ళగానే ఒక పెద్దసోరచేప వలలో చిక్కినదనియు , ఆనందము చెందిన తాను దానిని ఇంటికి కొనిపోయి కోయగా దాని కడుపునుండి ఒక బంగారు ఉంగరము బయటపడినదనియు , బెదిరిపోయిన తాను దానిని సర్కారు వారివద్ద అప్పగించుటకు మార్గమేమని అడిగి తెలుసుకొనుటకు వచ్చినట్లుగాను తెల్పెను. ఉంగరము చూడగానే ఆ వనితయొక్క ముఖము వికసించిన కమలములా మారెను. పరుగిడి వెడలి మత్స్యకారుని సమీపించి అతనిచేతిలోని ఉంగరము తనదేనని పూజారికి తెల్పెను. తననే నమ్ముకొని , తన సన్నిధి చేరిన భక్తురాలి బాధను తీర్చుటకు శ్రీబాలశాస్తావారే మీనావతారము దాల్చి నదిలో పడ్డ ఉంగరమును మింగి మత్స్యకారుని మూలాన అందించినట్లుగా పూజారి గ్రహించి *"చింత వలదు. కుళత్తూరు బాలుడు ఆదుకొంటాడని బాలికను ఓదార్చిన తనమాటలను సత్యము గావించిన కుళత్తూరు బాలుని పలువిధములా స్తుతించి తరించెను. అబల అయిననూ అయ్యప్ప అనుగ్రహము పొందిన ఆ యువతి ఉంగరముతో నిశ్చింతగా తనఇల్లు చేరుకొనెను. ఈ కథ మలయాళములోను , అరవ భాషలోను పలుగేయాలుగా రచించబడి నేటికినీ ఆయా ప్రాంతములలో గానము చేయబడుచున్నది.
ఇక ఇంకొక గాథను గూర్చి తెలుసుకొందాము. బ్రిటీషు వారి పరిపాలనా సమయములో విలాసయాత్రగా ఈ ప్రదేశమునకు వచ్చిన తెల్లదొర ఒకరు అక్కడి వారు ఎంత అడ్డగించినా వినక ఈ సెలయేటిలోనే ఒక సోరచేపను పట్టి నరికి వండి తినేసారట. వెంటనే అతనికి కనుచూపు కరువైనట్లుగాను , కొన్నాళ్లు అంధకారమనుభవించి అచ్చటి పెద్దల ఆదేశానుసారం చంపబడ్డ మత్స్యమునకు ప్రతిగా స్వర్ణముతో మత్స్య మొకటి చేయించి శ్రీబాలశాస్తావారికి సమర్పించుకొనేట్లు మ్రొక్కుకోగా వారికి మరల కనుచూపువచ్చినదనియు , మ్రొక్కుకొన్నట్లే ఆ తెల్లదొర శ్రీస్వామివారి మహిమలను తెలుసుకొని పరవశము చెంది , మనస్పూర్తిగా స్వర్ణముతో మత్స్యమొకటి చేయించి శ్రీస్వామివారి గర్బాలయము ముంగిట కట్టించి వెళ్ళినారట. ప్రస్తుతము ఆ స్వర్ణ మత్స్యము అచ్చటలేదు. అందులకు ప్రతిగా పంచలోహములతో చేయించబడ్డ మత్స్యప్రతిమ యొకటి అచ్చట ఊగులాడుతూ ఈ కథ వాస్తవమేనని తెలుపుచున్నది. స్వర్ణమత్స్యము దేవస్వం బోర్డు కార్యాలయములో భద్రపరచబడి యున్నట్ల చెప్పుకొనుచున్నారు.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*