🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కుళత్తు పుళ - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మధురైకు సమీపానగల చెంగోట్టై నుండి తెనలై మార్గముగా తిరువనంతపురం వెళ్ళేమార్గములో ఆర్యంగావు నుండి సుమారు 30 కి.మీ. దూరమున గలదు కుళత్తూర్ పుళ అనబడు చిన్నగ్రామము. ఊరికి నాలుగు పక్కల పుళ (సెలయేరు) ప్రవహిస్తూ ఒక చిన్న ద్వీప గర్భములా కన్పించు ఆ గ్రామము మద్య భాగమున మిక్కిలి అందముగా అమరియున్నది *శ్రీ బాలా శాస్తా* వారి ఆలయం. ప్రధాన రహదారి నుండి ఆలయమునకు వెళ్ళుటకు ప్రవహించే నదిని దాటియే వెళ్ళవలయును. వెడల్పు తక్కువగా యున్ననూ లోతు మరియు ప్రవాహము ఎక్కువగా యుండు ఈ చిన్న నదిని దాటుటకు పూర్వము చిన్న చిన్న ఓడల మూలముగానేదాట వలసియుండేది. కొన్నేళ్లక్రితం కాంక్రీట్ బ్రిడ్జి వేయించియున్నారు.
*స్థలపురాణము*
ముందొక కాలమున గురు శిష్యులిరువురు ఈ బాటన వెళ్లుచుండిరి. ఈ గ్రామమునకు సమీపించగానే గల గల పారుచుండు సెలయేటిలో స్నానమాడి ఆహారము తయారుచేసి , భుజించి , కాస్త విశ్రమించి వెల్లుదామని తీర్మానించిన గురువు తన శిష్యుని స్నానము చేసి , వంటచేసి పెట్టమని ఆజ్ఞాపించి , తాను స్నానమాడుటకు మరోవైపువెళ్ళెను. గురువాజ్ఞ మేరకు శిష్యుడు స్నానమాచరించి వంటచేయుటకు పొయ్యి కొరకు మూడు రాళ్లను వెదకగా అచ్చట ముందుగానే ఒకరాయి పడియుండెను. మిగిలిన రెండు రాళ్లనుతెచ్చి దాని సమీపాన యుంచి పొయ్యి ముట్టించుటకు ప్రయత్నించెను. అప్పుడు ముందుగా యుండిన రాయి కాస్త ఎత్తుగాయుండినది గాంచిన శిష్యుడు మరో రెండు పెద్దరాళ్లు తెచ్చి దానికి సమీపాన పెట్టెను. అప్పటికిగూడ మొదటిరాయి ఎత్తుగానే కన్పించెను. మరల మరల తాను తెచ్చినరాళ్లను ఎన్నిసార్లు మార్చి మార్చి పెట్టినను తొలిరాయి ఎత్తుగా పెరిగిపోవుట గాంచి అలసట చెందిన శిష్యుడు అసహనముతో మొదటిరాయిని సమముచేయుట కొరకు తాను తెచ్చిన మరొకరాయితో ఆ మొదటిరాయి పైభాగమున గట్టిగా కొట్టెను. వెంటనే ఆ రాయి ఎనిమిది ముక్కలైపోవడమే గాక అందుండి రక్తము కారసాగెను. ఆ దృశ్యము చూడగానే బెదిరిపోయిన శిష్యుడు గడగడవణకుచు అటువైపు స్నానమాడు చుండిన గురువుగారి వద్దకు పరుగిడి వెళ్ళి జరిగిన దంతయు తెల్పెను. పరుగిడి వచ్చిన గురువు పగిలిపడి నెత్తురుకారుచుండిన రాళ్లముక్కలను చూసి అదిరిపోయెను. తనజ్ఞాన దృష్టితో చూడగా అచ్చట *శ్రీశాస్తావారు స్వయంభూగా ఆశిలారూపమున వేంచేసియుండినది గ్రహించెను.*
అదితెలియని తన శిష్యుడు పెరుగుచుండిన శిలను సమముచేయదలచి శిరోభాగమున రాయితో కొట్టగా శిలపగిలి రక్తముకారడము తెలుసుకొని పొరబాటు క్షమించమని కోరుతూ మంత్రోచ్ఛారణ చేస్తూ దర్భతో పగిలిన ముక్కలను ఒకటిగచేసి బంధించెను. పిదప ఆ గురుశిష్యులు రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది తెలిపి ఆ స్థలమున *కుళత్తుపుళ్తే బాలశాస్తా* వారికి దేవాలయమొకటి కట్టించెను. పగిలిన రాయి ముక్కలను ఒకటిగ బంధనము చేసి దానికి కవచము చేయించి , అచ్చట ప్రతిష్ఠిచేయించెను. నేటికిను కుళత్తుపుళై యందలి ఆ పగిలిన సాలగ్రామ రాళ్లముక్కలకే నిత్య అభిషేక ఆరాధనలు జరుగుచున్నది. కొంతకాలమునకు క్రితము *శబరిమలై శ్రీధర్మశాస్తా* వారిని పోలిన విగ్రహమొకటి తయారుచేసి అచ్చట ప్రతిష్ఠ చేయించిరి. దానిని ఆ కుళత్తూర్ బాలుడు ఇష్టపడలేదన్నట్లు ప్రతిష్ఠించిన కొన్నిదినములకే ఆ విగ్రహము తస్కరించబడెను. పైపైకి పెరిగిన రాయిని తలపై కొట్టి ఆ శిలలో శాస్తా స్వయంభుగా వెలసియుండిన విషయాన్ని ప్రప్రథముగా లోకులకు తెలిపిన ఆ మహనీయునకు వారి బృందమునకు తలై అడిచ్చిన్ గ్రూప్ అని పిలిచెదరు. ఆ బృందము వారికి రాజు ధనకనకములను , కొన్ని గ్రామములను బహుమతిగా యొసంగినట్లుగాను చెప్పెదరు. నేటికినీ కుళత్తుపుళై దేవాలయములో సంవత్సర ప్రధాన ఉత్సవమగు విషు పుణ్యదినాన అలనాడు రాజులు ఏర్పరచి వెళ్ళిన బహుమతి ఆచారమును అనుసరిస్తూ దేవస్వం బోర్డు వారు ఈ తలైయడిచ్చాన్ గ్రూప్ వంశీయులకు వడ్లు ప్రసాదము , సంభావనలు అందిస్తున్నట్లు చెప్పబడుచున్నది. ఆలయములో ఈ గ్రూపు వంశావళిలోని పూర్వీకులకు ప్రథమ పూజ , నైవేద్యములు చేసిన పిమ్మటే శ్రీబాలశాస్తావారికి పూజలు చేయుచున్నారనియు తెలియవస్తున్నది. ఈ దేవాలయము ముంగిట ప్రవహించే కుళత్తుపుళై ఏటిలో పెద్ద పెద్ద మత్స్యములు నిర్భయముగా విహరించు చున్నది.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*