🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*అచ్చన్ కోవిల్ అరసే ...! అచ్చన్ కోవిల్ కరుప్పస్వామి - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*"కాంతగిరిపై స్వర్ణమందిరములోనున్న నన్ను తనువుతో దర్శింపదలచిన నీకోర్కె త్వరలో నెరవేరును. నీ ఆత్మశరీరముతో కాంతగిరివచ్చిచేరును. అచ్చట నా దర్శనము లభించును. పిదప నీకు ఇష్టమైతేనే భూలోకము రావచ్చును. లేనిచో నీవు అచ్చటనే ప్రమదగణములతో యుండిపోవచ్చును. కాని ఒక నిబంధన. కాంతమలకు నీవు వచ్చినపుడు అచ్చటనున్న దివ్యవస్తువులను చూసి , అతిశయించి , దేనిమీదనైన మోజుపడి కోరిక కల్గించుకొన్న వాడైనచో మరుక్షణమే భూలోకమున పడిపోగలవు. దీనిని నీవు ఎట్టిపరిస్థితిలోను మరచిపోకూడదు. నీ మీద గల ప్రేమతోనే నీకిది ముందుగా తెలియజేయుచున్నాను"* అని అనిరి. పూజారి గూడా శ్రీ స్వామివారి మాటలను గుర్తుంచు కొని యుంటానని చెప్పెను. కొన్నాళ్ళకు శ్రీస్వామివారు పంపిన భటులసాయముతో పూజారి శరీరముతో కాంతగిరి చేరుకొనెను. కాంతగిరి పొలిమేరులో అడుగుపెట్టగానే అతని తనువు పులకించిపోయెను. కనులుతెరచి చూచిన స్థలమెల్లయు కనకమయమై ధగ ధగ మెరయుచుండెను. దివ్యకాంతి పుంజములను విరజిమ్ము కాంతగిరిని గాంచిన బ్రాహ్మణుని కన్నులు ఆనందభాష్పములను రాల్చెను. మనసు ఉప్పొంగి చిందులు వేసెను. నాలుక దడపడెను. శరీరమున రోమాంజలి కల్గెను. మతికందని ఆ ప్రదేశమున పడి దొల్లెను. శరణాలు పలికెను. దేవతలు నడయాడుచుండిన ఆ కాంతగిరిపై తనపాదము సోకుట అపచారమని దలచి అలా ద్రొల్లుతూ గర్భాలయముచేరుకొనెను. స్వర్ణమయ విమాన గోపురపు మధ్యభాగమున నవరత్నఖచిత సింహాసనమున సర్వాలంకార భూషితుడుగా , పూర్ణా పుష్కళాదేవియర్ల మధ్యన అమరియుండిన హరిహర సుతుని దర్శించుకొనెను. పదునెనిమిది దేవతలు కనులు గీటుతూ మెట్లైపరుండిన దృశ్యము.
అతిశయమునకే అత్యతిశయమై గోచరించెను. ఎనలేని ఆనందము చెందిన పూజారి పరిసరములను వీక్షించగా యక్ష , కిన్నెర , కింపురుషాదులు , నారద తుంబురులు , వాద్యములు ఘోషింపగా గంధర్వులు గగనమునుండి పుష్పవృష్టి కురిపింపగా , ఋషులు వేదఘోషములు ఘోషింపగా , మునులు స్వస్తివాక్యములు పలుకగా , దేవకాంతలు నృత్యములు చేయగా గంగాది పుణ్యతీర్థములు స్వామివారి పాదములనభిషేకించగా , దేవతలు మంగళహారతి పట్టగా , దిగ్దేవతలు మంగళగానములు చేయగా , తారక ప్రభువైన శ్రీధర్మశాస్తావారు వాటన్నిటిని మందహాసపూరిత వదనుడై స్వీకరించి మురిసిన దృశ్యము బ్రాహ్మణుని తనువును మరిపించెను. కరములు పైకెత్తిప్రణమిల్లి శ్రీస్వామివారిని స్తోత్రించి జన్మసాఫల్యము చెందెను.
శ్రీస్వామివారి ముంగిట సాష్టాంగ ప్రణామములు చేయుచూ భక్తిపారవశ్యపుటంచును చేరుకొని మతిస్థిమితమైన వానిలా శరణుఘోషములను ఘోషించుచూ అటులనే పరుండి పోయెను. అలా ఎన్నిదినములు గడిచిపోయెనో అతనికే తెలియదు. అపుడే శ్రీస్వామివారి పరీక్షమొదలయ్యెను. ఉన్నఫళంగా ఆ బ్రాహ్మణుని మనస్సు భూలోకమునుచూసి దిగజారెను . ఉన్నతస్థితిచేరుకొన్నవారు తక్కువస్థితిని చూచువేళ వారి మనసుగూడా దిగజారి పోవును కాబోలు ! *ఇక భూలోకమునకు వెళ్ళనవసరములేదు. స్వర్ణమందిరము నందే ప్రమథగణములతో బాటే స్థిరనివాసము లభించిన పిమ్మటగూడా పూజారిమనసు తనువులో యుండినందు వలన వెంటనే భూలోకమునకు వెళ్ళవలెను. భగవంతుని చూచినవారు చెప్పరు - చెప్పేటివారు చూచి యుండరు"* అను నానుడిని అసత్యము గావించవలెను.
తాను బాహ్యనేత్రములతో చూచి తరించిన ఆనందాను భూతిని అందరికి తెలిపి ఆనందించవలయునను ఆలోచన అతనిలో చెలరేగినది. వెంటనే భూలోకమునకు వెళ్ళేమార్గమేమని ఆలోచించగా మొదట శ్రీస్వామివారు హెచ్చరించిన విషయము జ్ఞప్తికివచ్చెను. నీవు కాంతగిరిలో యుండగా అచ్చట యుండే ఏ వస్తువుమీదనైన మోజుపడినచో తక్షణమే నీవు భూలోకము నందు పడిపోగలవని శ్రీస్వామివారే భూలోకము చేరుకో గల మార్గము గూడా సెలవిచ్చియున్నారు గదా ! అని అజ్ఞానముతో తాను ఇంకెవ్వరు పొందలేని స్థితికి చేరుకొని యున్న సంగతి మరచి ఒక విపరీత చర్యకు పాల్పడెను. శ్రీస్వామివారు చిరునవ్వుతో ఇవన్నిటిని వీక్షించుచుండెను. తనపాదము గూడా కాంతగిరిపై సోకకూడదని - ఇన్నాళ్ళు పరుండిపోయిన పూజారి భూలోకమునకు వెళ్ళే తలంపు రాగానే ఒక్కసారిగా లేచి నిలబడి పరిసరమంతయూ వీక్షించెను. ఎవరికి వారు వారి వారి పనిలో మునిగి ప్రవర్తించుచున్నారే తప్ప ఏయొక్కరు గూడా ఈ బ్రాహ్మణుని పట్టించుకోలేదు.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*