🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*అచ్చన్ కోవిల్ అరసే ...! అచ్చన్ కోవిల్ కరుప్పస్వామి - 3*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మనము భూలోకమునకు వెళ్ళి ఇచ్చట చూసినదానిని వివరించునపుడు అందరూ తనమాటలను అలాగే విశ్వసిస్తారని ఏమి నమ్మకము ? అందులకు ఆధారమేమని అడిగితే ఏమి చెప్పగలము ? ఆధారములేక చెప్పేమాటలు ప్రజలు నమ్మరు కదా ! ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడని నెట్టివేయుదురు కదా ! కావున వార్లను నమ్మించుటకు ఆధారముగా ఇచ్చటనుండి ఏదైన యొక్క వస్తువును తీసుకొనిపోవలసినదే యని నిర్ణయించి చుట్టుముట్టి చూడగా అచ్చటగోడకు వేలాడుచుండిన ధగ ధగ మెరియు నవరత్న ఖచిత స్వర్ణ ఖడ్గమొకటి కన్పించెను. వెంటనే ఒక నిర్ణయమునకు వచ్చిన అతడు ఈ ఖడ్గమును ఇచ్చట నుండి కొనిపోదును. మిక్కిలి బడుగుస్థితిలో నున్న తనకు ఈ స్వర్ణఖడ్గము పొన్నంబలము నుండి లభించినదనిన ప్రజలు నమ్మకయుందురా ? కనుక దీనినె తాను శరీరముతో కాంతగిరి వెళ్ళి వచ్చినందులకు ఆధారముగా చూపించి తానుపొందిన అనుభూతిని అందరితోనూ పంచుకోవచ్చునని తలచి ఆస్వర్ణ ఖడ్గము మీద కరముంచెను. మరుక్షణమే తలతిరిగి స్పృహతప్పి భూమిపై వచ్చిపడెను. పూజారిని గూర్చియు , వారికోర్కెను గూర్చియు చుట్టుముట్టియున్న వారందరికి బాగానే తెలుసును.
మాటా పలుకులేక స్పృహతప్పి పడియున్న పూజారిని అందరూ చూచిరి. చేతిలో ధగ ధగ మెరిసే స్వర్ణ ఖడ్గమునూ చూచిరి. పూజారియొక్క అనుభూతిని , వారుపొందిన ఆనందానుభూతిని వారికి చెప్పగా విని తరించిరి. కొన్నాళ్ళకు సిద్ధపురుషుడైన ఆపూజారి ఆస్థలమునందే పరమపదించెను. వారి జ్ఞాపకార్ధముగానే నేటికిను అచ్చన్ కోవిల్ దేవాలయము నందలి వారిజన్మ నక్షత్ర దినము నందు పుష్పాంజలి వైభవోపేతముగా జరుపబడుతున్నది. వారుకాంతమలై స్వర్ణమందిరము నుండి తెచ్చినారని చెప్పబడు స్వర్ణ ఖడ్గము నేటికి ట్రావంకూర్ దేవస్వంబోర్డువారి రక్షణలో భద్రపరచబడియున్నదనియు , అచ్చన్ కోవిల్ పొన్వాళ్ అని సూచింపబడియున్న ఆ ఖడ్గమునకు నిర్దిష్టమైన తూకమో , మదింపో చెప్పలేమని అందురు. మన ఊహకందని ఇలాంటి అతిశయమైన సంఘటనలు ఈ స్థలమున ఎన్నోజరిగియున్నట్లు ఇచ్చటివారు చెప్పుకొనుచున్నారు. తన స్వర్ణ ఖడ్గాన్ని ఆ పూజారి మూలంగా భూలోకమునకు పంపి , తనసాటిలేని తనాన్ని శ్రీ ధర్మశాస్తావారు భక్తులకు చూపి యున్నారని గూడా అందురు. మరణించినవారిని సైతం బ్రతికించుటలోను , అంగవికలము అద్భుతముగా తొలగుటయు , మూగవాడు మాటాడుటయు , విషకాటుకు గురియై ఇక బ్రతకడని విశ్వాసము కోల్పోయిన వారు సైతం ఈ క్షేత్రపు తీర్థముతో బ్రతికి బట్టకట్టిన కథలు అనేకములు గలవు. ఇచ్చటి పరిసరప్రాంతములో తపస్సుచేసిన సిద్ధపురుషులు ఇచ్చటనే జీవసమాధియైన సంఘటనలు సమీపకాలము వరకు గూడా జరిగినట్లు చెప్పుకొను చున్నారు. అచ్చన్ కోవిల్ స్వర్ణఖడ్గము గూడా అలాంటి అద్భుత శక్తినిండినదేయని అందురు. మనకు మించిన మనకు తెలియని మహశక్తి యొకటి ఈ ప్రపంచమును , అందులోని మనలను కదలాడించుచున్నది.
దాని కట్టుబాటులో కట్టబడి యుండుటయే తప్పు , దానిని కట్టుబరచుటకో మన చిరుమతికి అందినంతలో పరిశోధించి చూచుటకో వీలుకాని అసాధ్యమైన పనులలో ఇదియు యొకటియేననియు తెలిసి మ్రొక్కి తరించుటయే మనకర్తవ్యం. అచ్చన్ కోవిల్ పూజారియొక నిండుభక్తుడు. ఆతని కోర్కె నెరవేరినది. నిండు భక్తికొక తార్కాణం. అందులకు ఆస్వర్ణ ఖడ్గమే ఆధారం. అయినను ఆరోజులలో అందరికి కలగని కోర్కె పూజారికి కలగడము తనసాటిలేని తనాన్ని లోకులకు చూపాలని శ్రీస్వామివారికి సంకల్పము తదేక కాలములో కల్గడం వలననే తనువుతో పూజారి పొన్నంబల దర్శనముచేసుకోగల్గినాడని చెప్పుకొందురు. కాని ఎందరికి కలుగుతుంది అట్టిభాగ్యము. అందులోను ఎందరికి యుంటుంది అంతటి వైరాగ్యము ? కావున మనము గూడా మన ప్రార్ధనలన్నియు నెరవేరాలన్న పట్టుతో ఆ అచ్చన్ కోవిల్ రారాజు వద్దవేడుకొందాము.
*ముఖ్య గమనిక :*
కాంతగిరిపై నున్న స్వర్ణమందిరమును అందరూ చూసి తరించలేక పోవచ్చును , కాని శబరిగిరి సన్నిధానమునే స్వర్ణమయమందిరముగా తీర్చిదిద్ది భక్తులకు పొన్నంబల దర్శనమును కలుగజేసి తన స్వంతధనమగు మూడుకోట్ల రూ॥లు వెచ్చించి నిర్మించి శబరిగిరి నాధునికి స్వర్ణమందిర వాసుడను నామధేయమును సార్థకతచేసిన భక్తి శిఖామణి బెంగుళూరు వాస్తవ్యులు శ్రీ విజయమాల్య గారికి శుభాభి నందనలు తెలియజేస్తూ , శబరిమలకు వచ్చే భక్తులు పొన్నంబల స్వర్ణమందిరమును శబరిమల యందే దర్శించుకొనవచ్చును అని చెపుతూ స్వస్తివాక్యములు పలుకుచున్నది ఈ వ్యాసము.
*రేపటి నుండి ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం గురించి చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*