అయ్యప్ప సర్వస్వం - 83*ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం - 1*

P Madhav Kumar

 *


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం - 1*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*కళ్యాణ వరద శాస్తా*


(ఆరియన్ కావు క్షేత్రమున ఏటేట శాస్తాకళ్యాణ మహోత్సవము కోలాహలముగా జరుగును. కేరళీయులు. తమిళులు కలిసికట్టుగా జరిపించే పై త్రిదిన వివాహవేడుకలలో తొలిరోజు పాండియన్ ముడిప్పు అనబడు ఎదురుకోల వైభవము , రెండవదినం ఉత్సవమున నాగసర్ప వాహనమున పుష్కళా సమేత శ్రీ శాస్తా ఊరేగింపు మరియు వివాహవేదికపై మాంగల్యధారణతో కల్యాణ మహోత్సవము కన్నుల పండుగగా జరుగును. మూడవదినం ఉత్సవమున అమ్మవారికి విశేష అభిషేక ఆరాధనలు జరిగినది. అశేషభక్త జనులు పై శాస్తా కళ్యాణ మహోత్సవములో పాల్గొని పుష్కళా దేవీ సమేత శ్రీ శాస్తా వారిని దర్శించి తరింతురు. సుమారు రెండు వందల సంవత్సరాలుగా ఏటేట ఆరియన్ కావు క్షేత్రములో జరుపబడే శాస్తా కళ్యాణ మహోత్సవములో తమిళనాడు మధురైకు చెందిన సౌరాష్ట్రీయు లనేకులు బహు ఉత్సాహముతో పాల్గొందురు. ఈ కళ్యాణ తంతు అలనాడు పంజవర్మ కొలువులో ఎలా జరిగియుంటుందను కల్పనా కథనమీ ఈ క్రింది వ్యాసము.)


అది నేపాళ దేశము. రాజు గారి సభా భవనం నిండుగా వుంది. సభ అంతా నిశ్శబ్దంగ వుంది. వందిమాగధుల స్తోత్ర పాఠములు చెవులు సోకగానే సభ మొత్తం గౌరవ సూచకంగా లేచి నిలబడింది. పండితులు ఉత్తరీయాలు సవరించుకొన్నారు. కవి జనం హస్తాల లోని కవితా సంకలనాలను సరిజూసుకొంటున్నారు. నాట్యగత్తెలు కాలి అందియలు సరిజేసుకొన్నారు. రాజాధి రాజ ! రాజ మార్మాండ ! రాజ గంభీర ! నేపాళ ప్రజా హృదయ రంజకా ! నేపాళ దేశ రాజ చంద్రా ! కాళికాదేవి వర ప్రసాదా ! మంత్ర తంత్ర విద్యా ప్రకాండా ! అణిమాద్యష్ట యోగ సిద్ధా ! పళిజ్ఞవర్మ నామధేయ ! జయము ! జయము ! అంటున్న వందిమాగధుల స్తోత్ర శబ్ద తరంగాలు వెంటనంటి రాగా శ్రీమాన్ రాజా పళిజ్ఞవర్మ గారు సభలోకి వచ్చారు మంత్రి వర్యులు సవినయంగా లేచి నిలబడగా రాజా పళిజ్ఞవర్మ గారు వారి భుజముపై చేయి వేసి , ఆప్యాయతగా పలకరిస్తూ ఉన్నతాసనం పై ఆశీనులయ్యారు. చెలికత్తెలు వింజామర సేవలు ప్రారంభించారు. వేద పండితులు మహదాశీర్వచనాలు అందజేశారు. రాజుగారు ముకుళిత హస్తాలతో సభకు నమస్కరించారు. *“నా ప్రియా ప్రజలారా ! నేడు నేపాళ ప్రజలకు శుభదినం. కాళికా మాత ఆశీస్సులతో మీరంతా సుఖమయ జీవనం సాగించునట్లుగా ప్రజాపాలన విస్తున్నాను. నా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నదే నా ఆశయం"* అన్నారాయన. అవును మహారాజా ! నిజము. నిజము. - ముక్తకంఠంతో సభ బదులు పలికింది.


నా ప్రజల సుఖమే నా సుఖం. వారి ఆనందమే నా ఆనందం. జరామరణములను జయించి నా జనులకు శాశ్వత సుఖానందాన్ని అందివ్వడమే నా జీవిత ఆకాంక్ష. నా ఆకాంక్ష మీకు ఆనందాన్ని అందిస్తుందనేదే నా విశ్వాసం. ఆ మహాదేవి ఆశీస్సులతో అంతంలేని ఈ నా జీవనాన్ని నా ప్రజలకు అంకితం చేస్తున్నాను. - అని పల్కగానే సభలో జయ జయధ్వానాలు మిన్నంటాయి. సభా సంబరం అంబరం తాకింది. విద్వత్ గోష్ఠి ఆరంభమైంది. పండిత ప్రకాండులు పరమ రహస్యాలపై చర్చ సాగించారు. తదుపరి నర్తకీమణుల నాట్యాలతో సభలో ఆనంద హేల తాండవించింది. కాళికాలయ అర్చక స్వాములు మహారాజు గారికి కాళీ ప్రసాదం అందించారు. రాజుగారు వారికి తగిన కానుకలు అందజేసి నమస్కరించారు. సభముగిసింది. రాజు గారి ఆంతరంగిక సమావేశం ప్రారంభమైంది. మహామంత్రి సేనాధిపతి కాళికాలయ ప్రధానార్చన స్వాములు మాత్రం మిగిలారు. అర్చక స్వాములకు అభివాదములు అని రాజుగారు సవినయంగా నమస్కరించారు. దీర్ఘాయుష్మాన్ భవ అని అర్చక స్వాముల నోట వెలుబడిన ఆశీర్వాదం విన్న మహారాజు వెటకారంగా నవ్వారు. అర్చకోత్తమా ! మీ ఆశీర్వాదం హాస్యాస్పదం కాదు గదా ! ఏమిటి రాజన్ ! ఈనాడు మీనోట వింత పలుకులు వింటున్నాము. మా ఆశీర్వాదాన్నే అనుమానిస్తున్నారా ! మేము అనునిత్యం ఆరాధిస్తున్న మన కులదేవత కాళికామాత కరుణాకటాక్షాలపై మీకు శంక ఏలకలిగింది. మహారాజా ! ఆగ్రహించకండి అర్చకోత్తమా ! అమ్మ దయ పైన అనుమానం కాదు. మరేమిటి రాజా ! మీ మనస్సులో మాట తెల్పండి. నా మనసులో మాట మీకు తెలియాదా స్వామీ ! అమ్మకు అర్పించవలసిన బలి నివేదన సక్రమంగా జరుపగలమో లేదో నని...... రాజుగారి మాట పూర్తి గాకముందే అందుకొన్నారు అర్చకస్వామి. సందేహంచకండి మహా రాజా ! మీరు కోరినట్లుగా అమ్మవారి ఆరాధనకు సర్వం సిద్ధం చేయడానికి మన మంత్రివర్యులు ఎంతో శ్రమిస్తున్నారు.


అవును మహారాజా ! మీరు జరామరణములను జయించి నిత్య యౌవ్వనంతో నేపాళ రాజ్యరమా వల్లభునిగా నిలవాలని మేము నిరంతరం కోరుకుంటున్నాము. నిజమే మహామంత్రీ ! కోరికలున్నంత మాత్రాన మన కలలు నిజం అవుతాయా అమాత్యా ! ఏం చేయ్యమంటారో చెప్పండి మహాప్రభూ ! - 'అంటూ అభిమానంగా అడిగాడు మంత్రి. మహామంత్రీ ! మీకు తెలియనిది కాదు. కార్తీక పౌర్ణమి నాడు మహా శివభక్తురాలైన కన్యకను కాళికాదేవికి బలి ఇవ్వాలి. ఆమె రక్తంతో హోమం చేసి అమ్మవారికి రక్త తర్పణం గావించిన నాడు నాకిక జరామరణాలు దరి కాబోవని అర్చక స్వాములు శెలవిచ్చారు కదా ! అవును మహారాజా ! అర్చక స్వాములు కోరిన సమస్తం సిద్ధమయ్యాయి. ప్రభూ ! కాళికామాతకు బలి ఇవ్వడానికి కన్యకను కూడా సిద్ధం చేశాను. నేడు కార్తీక మాసం ఆరంభమైంది. ఇక పక్షం రోజులు మాత్రమే మనకు గడువుంది. అర్చక స్వాములను కాళికా రాధన నేటి నుండే ప్రారంభించమని తెల్పండి మహారాజా ! సంతోషం మహామంత్రీ ! మీ ప్రజ్ఞాపాటవాలు మాకు తెలియనివి కావు కదా ! మీ అభిమానానికి కృతజ్ఞడిని. ఆ అర్చక స్వాములూ ! మీరు నేడు కాళికారాధనకు సమాయత్తం కండి. మేము నేటి నుండి ప్రతి నిత్యం రాత్రి నడిరేయి జామున అమ్మ ఆలయానికి వస్తాము. మహామంత్రీ కోశాగారం నుండి కావలసినంత ధనం తీసుకోండి. ఆ శివ భక్తురాలి కుటుంబానికి సర్వం సమకూర్చండి వారికి ఏ లోటూ రానివ్వకండి.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat