_*అయ్యప్ప సర్వస్వం - 84*_ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం - 2*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం - 2*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*"చిత్తం మహారాజా!" - అంటూ అమాత్యులు - అర్చకస్వాములు శెలువు తీసికొని వెళ్లారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు అమ్మవారి ఆరాధన అత్యంత వైభవంగా ప్రారంభమయింది. ఆనాడు కార్తీక పౌర్ణమి. పున్నమి వెన్నల కాంతులతో పుడమి పులకరిస్తోంది. అంతః పురజనం అదమరచి నిదురిస్తున్నారు. అమాత్యులవారు. అనుసరించిరాగా వళిజ్ఞన్ మహారాజుగారు కాళికాలయానికి పయనమయ్యారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కాళిమాతను మనసులో ధ్యానించసాగాడు. మాత పూజా మందిరం నేతిదీపాల వెలుగులతో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. అర్చక స్వాములు మాత విగ్రహం ఎదురుగా అమృతహోమం చేస్తున్నారు. ఆలయ పరిసరాలు వారి మంత్రోచ్ఛారణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ నేపాళ రాజ్యంలో ఇలా మంత్ర తంత్రాలు వినిపించడం పరిపాటి కాబట్టి ఎవరూ వాటికంత ప్రాధాన్యం ఇవ్వరు. అందరూ హాయిగా నిదురిస్తున్నారు. "ఓం ఐం హ్రీం శ్రీం కాళికా మాత్యైనమః"* అమ్మవారి మూల మంత్రాన్ని జపిస్తూ రాజు గారు హోమగుండం ఎదుట నిలిచారు. అర్చక స్వామి అర్ధనిమీలత నేత్రాలతో రాజు గారిని చూచి ఆశీనులు కమ్మని అర్థించారు చూపులతోనే. రాజుగారు. హోమగుండం ఎదుట పీఠం పై ఆశీనులయ్యారు.


కాళికారాధన ఆరంభమైంది. మంత్రివర్యులు మరోప్రక్కనున్న తన అంతరంగిక భటులకు కనుసైగ చేయగానే వారు ఆలయం వెలుపలనుండి ఓ అందమైన అమ్మాయిని తెచ్చి రాజుగారి ఎదుట నిలబెట్టారు. ఆమెను చూడగానే రాజుగారి మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది. తన చిరకాలవాంఛ నెరవేరబోతుంది. ఇక తాను భయపడవలసిన అవసరం లేదు. తనకు ముసలి తనం రాబోదు. మరణం అసలే లేదు. తన ప్రజలకు ఏలాంటి బాధలు లేకుండా ప్రజారంజకంగా తానే పాలిస్తానని. అమ్మ అనుగ్రహం పూర్తిగా తనపై వుందికదా అని. ఇలా సాగి పోతున్నాయి రాజుగారి ఆలోచనలు. పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఆమె ఒక ప్రక్కగా ఒదిగి నిలిచింది. ఆమె నొసటన వెలసిన స్వేత బిందువులు హోమాగ్నికాంతులలో మెరుస్తున్నాయి. కంటసీమనున్న రుద్రాక్షమాలలు రక్తవర్ణంతో ప్రకాశిస్తున్నాయి. ఆమె నోట నుండి నిరంతరంగా *“ఓం నమశ్శివాయ"* - అన్న పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనిస్తోంది. తనకు కాలం దాపురించిందన్న నిజం తెలిసిన ఆమె నిస్సహాయంగా నమశ్శివాయ మంత్రాన్ని పఠించసాగింది. పంచాక్షరీ మంత్రమే తనపాలిట రక్షగా భావించింది ఆ శివభక్తురాలు. ఆమె ఒక నిరుపేద బ్రాహ్మణబాలిక. ఆమె తండ్రీ శివారాధకుడు. నిత్య శివార్చనా కుటుంబం వారిది.


బీదరికం కారణంగా ఇంకనూ మాంగల్య ధారణకు నోచుకోలేక పోయిన ఆ కన్య శివనామస్మరణమే తన జీవనంగా సాగిస్తోంది.

అటువంటి ఆమె హోరుగాలిలో నిలచిన చిరుదీపంలా ఆరిపోయేందుకు సిద్ధంగా వుంది. ఆమె నుండి ఎలాంటి ప్రతిఘటనా లేదు. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టలేదన్నది ఆమె భావన. అంతా ఆ ఆదిశంకరుడే చూచుకొంటాడన్న భావంతో ఆమె నిర్లిప్తంగా వుంది. ఆమె జపిస్తున్న శివనామం ఆలయం దాటి అంతరిక్షంలో పయనించి కైలాసం చేరింది. పరమశివుని హృదయాన్ని తాకాయి ఆ జపతరంగాలు. పరమేశ్వరుని హృదయం పరవశించింది. భక్తవశంకరుడైన ఆ శంకరుడు క్షణం పాటు ఆలోచించి సర్వమూ  గ్రహించాడు. గ్రహించిందే తడవుగా శాస్తాను తలచాడు. తలచిందే తడవుగా ఆయన ఎదుట అవతరించాడు శ్రీధర్మశాస్తా *"ఏమటి తండ్రీ ! నన్ను పిలచిన కారణమేమి ? ఆజ్ఞాపించండి"* - వినమ్రుడై వందన మర్పించాడు శాస్తా.


*"శాస్తా ! ధర్మాన్ని శాసించగల కర్తవు నీవు. నేపాళప్రభువైన  పళింజన్ తెలియనితనంతో మహాఘోరం జరిపించబోతున్నాడు. నా భక్తురాలు ఆపదలో అలమటిస్తోంది. నీవు తక్షణం అక్కడకు వెళ్లి ఆ మహాపదను తప్పించు. నీకు శుభం కలుగుగాక" అంటూ " ఆజ్ఞాపించాడు. అలాగే తండ్రీ ! తమరి ఆజ్ఞ ! ధర్మాన్ని నెలకొల్పుతాను..."* అంటూ శాస్తా శంకరునకు నమస్కరించి అంతర్ధాన మయ్యాడు. కాళికాదేవి ముంగిట మౌనంగా రోదిస్తోంది ఆ కన్యక. మహారాజు ముఖాన విజయ చంద్రికలు విరబూస్తున్నాయి రేపటి నుండి తాను జరామరణాలను జయించిన విశ్వనేత కాబోతున్నాడు. అమృతహోమం పూర్తి కావస్తోంది. పూర్ణాహుతి ప్రారంభమైంది. బలి సమయం ఆసన్నమయింది. రాజు గారి చేతి కత్తి రక్తం వర్షించడానికి సిద్ధంగా వుంది. మహాకాళీ అమృతహోమంలో పూర్ణాహుతి మంత్రాలు స్వాములవారు పఠిస్తుండగా బలికాబోతున్న ఆ కన్యక పంచాక్షరీ మంత్రం నిరంతరంగా జపించుతోంది. రాజుగారు కరవాలాన్ని సిద్ధం చేశారు. ఇక క్షణకాలంలో కన్యక కాళికామాతకు బలి కాబోతోంది. ఇంతలో జరిగిందో అద్భుతం. అంతరిక్షం నుండి ఓ అద్భుత కాంతిరేఖ ఆలయం లోనికి ప్రసరించింది. కాంతిరేఖ నుండి కమనీయ మూర్తి అక్కడ సాక్షాత్కరించాడు. అతని బలిష్ఠమైన హస్తం రాజుగారి చేతిని బలంగా బంధించింది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat