[ ప్రథమ భాగం – ద్వితీయ భాగం ]
(కృతజ్ఞతలు: కీ.శే. సుందరదాసు శ్రీ ఎం.ఎస్.రామారావు గారికి, శ్రీ పి.శ్రీనివాస్ గారికి)
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు .
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు . ౧
జాంబవదాది వీరులందరును
ప్రేరేపింపగ సమ్మతించెను .
లంకేశ్వరుడు అపహరించిన
జానకీమాత జాడ తెలిసికొన . ౨
తన తండ్రి యైన వాయుదేవునకు
సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు .
వానరేంద్రుడు మహేంద్రగిరి పై
వందనములిడె పూర్వాభిముఖుడై . ౩
రామనామమున పరవశుడయ్యె
రోమరోమమున పులకితుడయ్యె .
కాయము పెంచె కుప్పించి యెగసె
దక్షిణ దిశగా లంక చేరగా . ౪
పవనతనయుని పదఘట్టనకే
పర్వతరాజము గడగడ వణకె .
ఫలపుష్పాదులు జలజల రాలె
పరిమళాలు గిరిశిఖరాలు నిండె . ౫
పగిలిన శిలల ధాతువులెగసె
రత్నకాంతులు నలుదిశల మెరసె .
గుహలను దాగిన భూతములదిరి
దీనారవముల పరుగిడె బెదిరి . ౬ | శ్రీ హనుమాను |
రఘుకులోత్తముని రామచంద్రుని
పురుషోత్తముని పావన చరితుని .
నమ్మిన బంటుని అనిలాత్మజుని
శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని . ౭
నీ కడ కొంత విశ్రాంతి దీసికొని
పూజలందుకొని పోవచ్చునని .
సగర ప్రవర్థితుడు సాగరుడెంతో
ముదమున పలికె మైనాకునితో . ౮
మైనాకుడు ఉన్నతుడై నిలిచె
హనుమంతుడు ఆగ్రహమున గాంచె .
ఇదియొక విఘ్నము కాబోలునని
వారిథి బడద్రోసె ఉరముచే గిరిని . ౯
పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగె
పవనతనయుని బలము గని పొంగె .
తిరిగి నిలిచె హనుమంతుని పిలిచె
తన శిఖరముపై నరుని రూపమై . ౧౦ | శ్రీ హనుమాను |
వానరోత్తమా ఒకసారి నిలుమా
నా శిఖరాల శ్రమ దీర్చుకొనుమా .
కందమూలములు ఫలములు తినుమా
నా పూజలు గొని మన్ననలందుమా . ౧౧
శత యోజనముల పరిమితముగల
జలనిధినవలీల దాటిపోగల .
నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు
నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు . ౧౨
పర్వతోత్తముని కరమున నిమిరి
పవనతనయుడు పలికెను ప్రీతిని .
ఓ గిరీంద్రమా సంతసించితిని
నీ సత్కారము ప్రీతినందితిని . ౧౩
రామకార్యమై యేగుచుంటిని
సాధించువరకు ఆగనంటిని .
నే పోవలె క్షణమెంతో విలువలే
నీ దీవెనలే నాకు బలములే . ౧౪ | శ్రీ హనుమాను |
అనాయాసముగ అంబరవీధిని
పయనము జేసెడు పవనకుమారుని .
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు
పులకాంకితులై ప్రస్తుతించిరి . ౧౫
రామకార్యమతి సాహసమ్మని
రాక్షసబలమతి భయంకరమని .
కపివరుడెంతటి ఘనతరుడోయని
పరిశీలనగా పంపిరి సురసను . ౧౬
ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని
వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని .
అతిగా సురస నోటిని దెరచె
హనుమంతుడలిగి కాయము బెంచె . ౧౭
ఒకరినొకరు మించి కాయము బెంచిరి
శత యోజనములు విస్తరించిరి .
పై నుండి సురలు తహతహలాడిరి
ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి . ౧౮
సురస ముఖము విశాలమౌట గని
సూక్ష్మబుద్ధి గొని సమయమిదేనని .
క్షణములోన అంగుష్ఠమాతృడై
ముఖము జొచ్చి వెలివచ్చె విజయుడై . ౧౯
పవనకుమారుని సాహసము గని
దీవించె సురస నిజరూపము గొని .
నిరాలంబ నీలాంబరము గనుచు
మారుతి సాగెను వేగము పెంచుచు . ౨౦
జలనిధి తేలే మారుతి ఛాయను
రాక్షసి సింహిక అట్టె గ్రహించెను .
గుహను బోలు తన నోటిని దెరచెను
కపివరుని గుంజి మ్రింగజూచెను . ౨౧
అంతట మారుతి సూక్ష్మరూపమున
సింహిక ముఖమును చొచ్చి చీల్చెను .
సింహిక హృదయము చీలికలాయెను
సాగరమున బడి అసువులు బాసెను . ౨౨
వారిథి దాటెను వాయుకుమారుడు
లంక చేరెను కార్యశూరుడు .
నలువంకలను కలయజూచుచు
నిజ రూపమున మెల్లగ సాగుచు . ౨౩
త్రికూటాచల శిఖరముపైన
విశ్వకర్మ వినిర్మితమైన .
స్వర్గపురముతో సమానమైన
లంకాపురమును మారుతి గాంచెను . ౨౪ | శ్రీ హనుమాను |
అనిలకుమారుడా రాత్రివేళను
సూక్ష్మరూపుడై బయలుదేరెను .
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనులబడకను . ౨౫
పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము జేరెను .
లంకారాక్షసి కపివరు గాంచెను
గర్జన సేయుచు అడ్డగించెను . ౨౬
కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురికి యే పనికై వచ్చితివి ?
లంకేశ్వరుని ఆనతి మేర
లంకాపురికి కావలి యున్నా . ౨౭
లంకను నేను లంకాధిదేవతను
నీ ప్రాణములను నిలువున దీతును .
కదలక మెదలక నిజము పల్కుమని
లంక యెదుర్కొనె కపి కిశోరుని . ౨౮
అతి సుందరమీ లంకాపురమని
ముచ్చటపడి నే చూడవచ్చితిని .
ఈ మాత్రమునకు కోపమెందుకులే
పురము గాంచి నే మరలిపోదులే . ౨౯
అని నెమ్మదిగా పలుకగా విని
అనిలాత్మజుని చులకనగాగొని
లంకా రాక్షసి కపికిశోరుని
గర్జించి కసరి గద్దించి చరచెను . ౩౦
సింహనాదమును మారుతి జేసె
కొండంతగ తన కాయము బెంచె .
వామ హస్తమున పిడికిలి బిగించె
ఒకే పోటున లంకను గూల్చె . ౩౧
కొండ బండలా రక్కసి దొల్లె
కనులప్పగించి నోటిని దెరచె .
అబలను చంపుట ధర్మము గాదని
లంకను విడిచె మారుతి దయగొని . ౩౨
ఓ బలభీమా ! వానరోత్తమా !
నేటికి నీచే ఓటమెరిగితి .
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వమే బ్రహ్మ వరమొసగెనని . ౩౩
రావణుడాదిగ రాక్షసులందరు
సీతమూలమున అంతమొందెదరు .
ఇది నిజమౌనని మీదే జయమని
లంకారాక్షసి పంపె హరేశుని . ౩౪ | శ్రీ హనుమాను |
కోటగోడ అవలీలగ ప్రాకెను
కపికిశోరుడు లోనికి దుమికెను .
శత్రుపతనముగ వామపాదమును
ముందుగ మోపెను ముందుకు సాగెను . ౩౫
ఆణిముత్యముల తోరణాలు గల
రమ్యతరమైన రాజవీధుల .
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను . ౩౬
సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరసే ఉన్నత గృహముల .
కళకళలాడే నవ్వుల జల్లులు
మంగళకరమౌ నృత్యగీతములు . ౩౭
అప్సరసల మరపించు మదవతుల
త్రిస్థాయి బలుకు గానమాధురులు .
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను . ౩౮
సుందరమైన హేమ మందిరము
రత్నఖచితమౌ సింహద్వారము .
పతాకాంకిత ధ్వజాకీర్ణము
నవరత్నకాంతి సంకీర్ణము . ౩౯
నృత్య మృదంగ గంభీర నాదితము
వీణాగాన వినోద సంకులము .
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను . ౪౦
అత్తరు పన్నీట జలకములు
కాలాగరు సుగంధ ధూపములు .
స్వర్ణ ఛత్రములు వింజామరలు
కస్తూరి పునుకు జవాది గంధములు . ౪౧
నిత్య పూజలు శివార్చనలు
మాస పర్వముల హోమములు .
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను . ౪౨ | శ్రీ హనుమాను |
యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది .
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది . ౪౩
రావణుండు కుబేరుని రణమందు
ఓడించి లంకకు గొని తెచ్చినది .
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె . ౪౪
నేలను తాకక నిలచియుండునది
రావణ భవన మధ్యంబుననున్నది .
వాయుపథమున ప్రతిష్ఠితమైనది
మనమున దలచిన ప్రీతిపోగలది . ౪౫
దివినుండి భువికి దిగిన స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది .
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె . ౪౬
లంకాధీశుని ప్రేమ మందిరము
రత్నఖచితమౌ హేమ మందిరము .
చందనాది సుగంధ బంధురము
పానభక్ష్య పదార్థ సమృద్ధము . ౪౭
ఆయా పరిమళ రూపానిలము
అనిలాత్మజుచే ఆఘ్రాణితము .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . ౪౮
మత్తున శయనించు సుదతుల మోములు
పద్మములనుకొని మూగు భ్రమరములు .
నిమీలిత విశాల నేత్రములు
నిశాముకుళిత పద్మపత్రములు . ౪౯
ఉత్తమ కాంతల గూడి రావణుడు
తారాపతి వలె తేజరిల్లెడు .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . ౫౦
రావణుండు రణమందున గెలిచి
స్త్రీలెందరినో లంకకు జేర్చెను .
పితృ దైత్య గంధర్వ కన్యలు
ఎందెందరో రాజర్షి కన్యలు . ౫౧
సీత తక్క వారందరు కన్యలె
రావణుమెచ్చి వరించిన వారలె .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . ౫౨ | శ్రీ హనుమాను |
ఐరావతము దంతపు మొనలతో
పోరున బొడిచిన గంటులతో .
వజ్రాయుధపు ప్రఘాతములతో
చక్రాయుధపు ప్రహరణములతో . ౫౩
జయపరంపరల గురుతులతో
కీర్తి చిహ్నముల కాంతులతో .
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో . ౫౪
మినప రాశి వలె నల్లని వాడు
తీక్షణ దృక్కుల లోహితాక్షుడు .
రక్తచందన చర్చిత గాత్రుడు
సంధ్యారుణ ఘన తేజోవంతుడు . ౫౫
సతులగూడి మధు గ్రోలిన వాడు
రతికేళి సలిపి సోలిన వాడు .
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో . ౫౬
అందొక వంక పర్యంకము జేరి
నిదురించుచుండె దివ్యమనోహరి .
నవరత్నఖచిత భూషణధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి . ౫౭
స్వర్ణదేహిని చారురూపిణి
రాణులకు రాణి పట్టపురాణి .
లంకేశ్వరుని హృదయేశ్వరి
మందోదరి లోకోత్తర సుందరి . ౫౮
మందోదరిని జానకి యనుకొని
ఆడుచు పాడుచు గంతులు పెట్టి .
వాలము బట్టి ముద్దులు పెట్టి
నేలను గొట్టి భుజములు తట్టి . ౫౯
స్తంభములెగసి క్రిందకు దుమికి
పల్లటీలు గొట్టి ఛెంగున జుట్టి .
చంచలమౌ కపిస్వభావమును
పవనతనయుడు ప్రదర్శన జేసెను . ౬౦ | శ్రీ హనుమాను |
రాముని సీతా యిటులుండునా ?
రావణు జేరి శయనించునా ?
రాముని బాసి నిదురించునా ?
భుజయించునా భూషణముల దాల్చునా ? ౬౧
పరమపురుషుని రాముని మరచునా ?
పరపురుషునితో కాపురముండునా ?
సీత కాదు కాదు కానేకాదని
మారుతి వగచుచు వెదకసాగెను . ౬౨
పోవగరాని తావుల బోతి
చూడగరానివి యెన్నో జూచితి .
నగ్నముగా పరున్న పరకాంతల
పరిశీలనగా పరికించితిని . ౬౩
రతికేళి సలిపి సోలిన రమణుల
ఎందెందరినో పొడగాంచితిని .
ధర్మము గానని పాపినైతినని
పరితాపముతో మారుతి కృంగెను . ౬౪
సుదతుల తోడ సీతయుండగా
వారల జూడక వెదకుటెలాగ ?
మనసున యేమి వికారమునొందక
నిష్కామముగ వివేకము వీడక . ౬౫
సీతను వెదకుచు చూచితి గాని
మనసున యేమీ పాపమెరుగనని .
స్వామి సేవ పరమార్థముగా గొని
మారుతి సాగెను సీత కోసమని . ౬౬
భూమీగృహములు నిశాగృహములు
క్రీడాగృహములు లతాగృహములు .
ఆరామములు చిత్రశాలలు
బావులు తిన్నెలు రచ్చవీధులు . ౬౭
మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్లు
సందులు గొందులు బాటలు తోటలు .
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె . ౬౮
సీతామాత బ్రతికి యుండునో
కౄర రాక్షసుల పాల్పడి యుండునో ?
తాను పొందని సీత యెందుకని
రావణుడే హతమార్చి యుండునో ?౬౯
అని యోచించుచు అంతట వెదకుచు
తిరిగిన తావుల తిరిగి తిరుగుచు .
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె . ౭౦
సీత జాడ కనలేదను వార్తను
తెలిపిన రాముడు బ్రతుకజాలడు .
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు
ఆపై రఘుకులమంతయు నిశించు . ౭౧
ఇంతటి ఘోరము కాంచినంతనె
సుగ్రీవాదులు మడియక మానరు .
అని చింతించుచు పుష్పకము వీడి
మారుతి చేరె ప్రాకారము పైకి . ౭౨
ఇంత వినాశము నా వల్లనేను
నే కిష్కింధకు పోనే పోను .
వానప్రస్థాశ్రమవాసుడనై
నియమ నిష్ఠలతో బ్రతుకువాడనై . ౭౩
సీతామాతను చూచితీరెదను
లేకున్న నేను అగ్ని దూకెదను .
అని హనుమంతుడు కృత నిశ్చయుడై
నలుదెసల గనె సాహసవంతుడై . ౭౪
చూడ మరచిన అశోక వనమును
చూపు మేరలో మారుతి గాంచెను .
సీతారామ లక్ష్మణాదులకు
ఏకాదశ రుద్రాది దేవులకు . ౭౫
ఇంద్రాది యమ వాయుదేవులకు
సూర్యచంద్ర మరుద్గణములకు .
వాయునందనుడు వందనములిడి
అశోకవని చేరెను వడివడి . ౭౬ | శ్రీ హనుమాను |
విరితేనియలు గ్రోలు భృంగములు
విందారగ సేయు ఝంకారములు .
లేజివురాకుల నెసవు కోయిలలు
పంచమ స్వరముల పలికే పాటలు . ౭౭
పురులు విప్పి నాట్యమాడు నెమళులు
కిలకిలలాడే పక్షుల గుంపులు .
సుందరమైన అశోకవనమున
మారుతి వెదకెను సీతను కనుగొన . ౭౮
కపికిశోరుడు కొమ్మకొమ్మను
ఊపుచు ఊగుచు దూకసాగెను .
పూవులు రాలెను తీవెలు తెగెను
ఆకులు కొమ్మలు నేలపై బడెను . ౭౯
పూలు పై రాల పవనకుమారుడు
పుష్పరథము వలె వనమున దోచెడు .
సుందరమైన అశోకవనమున
మారుతి వెదకెను సీతను కనుగొన . ౮౦
పూవులనిన పూతీవియలనిన
జానకికెంతో మనసౌనని .
పద్మపత్రముల పద్మాక్షుని గన
పద్మాకరముల కొంతె జేరునని . ౮౧
అన్ని రీతులా అనువైనదని
అశోకవని సీత యుండునని .
శోభిల్లు శింశుపా తరుశాఖలపై
మారుతి కూర్చొని కలయజూచెను . ౮౨ | శ్రీ హనుమాను |
సుందరమైన అశోకవనమున
తను కూర్చొనిన తరువు క్రిందున .
కృంగి కృశించిన సన్నగిల్లిన
శుక్లపక్షపు చంద్రరేఖను . ౮౩
ఉపవాసముల వాడిపోయిన
నివురు గప్పిన నిప్పు కణమును .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున . ౮౪
మాసిన పీతవసనమును దాల్చిన
మన్నున పుట్టిన పద్మమును .
పతి వియోగ శోకాగ్ని వేగిన
అంగారక పీడిత రోహిణిని . ౮౫
మాటిమాటికి వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున . ౮౬
నీలవేణి సంచాలిత జఘనను
సుప్రతిష్టను సింహమధ్యను .
కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను
రతీదేవి వలె వెలయు కాంతను . ౮౭
పుణ్యము తరిగి దివి నుండి జారి
శోక జలధి పడి మునిగిన తారను .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున . ౮౮
పతి చెంతలేని సతికేలనని
సీత సొమ్ముల దగిల్చె శాఖల .
మణిమయ కాంచన కర్ణవేష్ఠములు
మరకత మాణిక్య చంపసరాలు . ౮౯
రత్నఖచితమౌ హస్త భూషలు
నవరత్నాంకిత మణిహారములు .
రాముడు దెలిపిన గురుతులు గలిగిన
ఆభరణముల గుర్తించె మారుతి . ౯౦
సర్వ సులక్షణ లక్షిత జాత
సీతగాక మరి యెవరీ మాత ?
కౌసల్యా సుప్రజారాముని
సీతగాక మరి యెవరీ మాత ? ౯౧
వనమున తపించు మేఘశ్యాముని
సీతగాక మరి యెవరీ మాత ?
ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి . ౯౨ | శ్రీ హనుమాను |
పూవులు నిండిన పొలములందున
నాగేటిచాలున జననమందిన .
జనక మహారాజు కూతురైన
దశరథ నరపాలు కోడలైన . ౯౩
సీతాలక్ష్మికి కాదు సమానము
త్రైలోక్యరాజ్య లక్ష్మీ సహితము .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని . ౯౪
శత్రుతాపకరుడు మహాశూరుడు
సౌమిత్రికి పూజ్యురాలైన .
ఆశ్రితజన సంరక్షుడైన
శ్రీరఘురాముని ప్రియసతి యైన . ౯౫
పతి సన్నిధియే సుఖమనియెంచి
పదునాల్గేండ్లు వనమునకేగిన .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని . ౯౬
బంగరు మేని కాంతులు మెరయ
మందస్మిత ముఖ పద్మము విరియ .
హంసతూలికా తల్పమందున
రాముని గూడి సుఖింపగ తగిన . ౯౭
పురుషోత్తముని పావనచరితుని
శ్రీరఘురాముని ప్రియసతి యైన .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని . ౯౮ | శ్రీ హనుమాను |
మూడు ఝాముల రేయి గడువగా
నాల్గవ ఝాము నడచుచుండగా .
మంగళవాద్య మనోహర ధ్వనులు
లంకేశ్వరుని మేలుకొలుపులు . ౯౯
క్రతువులొనర్చు షడంగవేదవిదుల
స్వరయుగ శబ్దతరంగ ఘోషలు .
శోభిల్లు శింశుపా శాఖలందున
మారుతి కూర్చొని ఆలకించెను . ౧౦౦
రావణాసురుడు శాస్త్రోక్తముగా
వేకువనే విధులన్ని యొనర్చెను .
మదోత్కటుడై మదనతాపమున
మరిమరి సీతను మదిలో నెంచెను . ౧౦౧
నూర్గురు భార్యలు సురకన్యల వలె
పరిసేవింపగ దేవేంద్రుని వలె .
దశకంఠుడు దేదీప్యమానముగ
వెడలెను అశోకావనము చేరగా . . ౧౦౨
లంకేశునితో వెడలిరి సతులు
మేఘము వెంట విద్యుల్లతల వలె .
మధువు గ్రోలిన పద్మముఖుల
ముంగురులు రేగె భృంగముల వలె . ౧౦౩
క్రీడల తేలిన కామినీమణుల
నిద్రలేమి పడు అడుగులు తూలె .
దశకంఠుడు దేదీప్యమానముగ
చేరెను అశోకావనము వేగముగ . ౧౦౪
లంకేశుని మహా తేజమును గని
మారుతి కూడ విభ్రాంతి జెందెను .
దశకంఠుడు సమీపించి నిలిచెను
సీతపైననే చూపులు నిలిపెను . ౧౦౫
తొడలు చేర్చుకొని కడుపును దాచి
కరములు ముడిచి చనుగన దాచి
సుడిగాలి పడిన కదళీ తరువు వలె
కటిక నేలపై జానకి తూలె . ౧౦౬ | శ్రీ హనుమాను |
ఓ సీతా ! ఓ పద్మనేత్రా !
నా చెంత నీకు యేల చింత ?
ఎక్కడి రాముడు ? ఎక్కడి అయోధ్య ?
ఎందుకోసమీ వనవాస వ్యథ ? ౧౦౭
నవయవ్వన త్రిలోకసుందరీ
నీకెందుకు యీ మునివేషధారి ?
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె . ౧౦౮
రాముడు నీకు సరిగానివాడు
నిను సుఖపెట్టడు తను సుఖపడడు .
గతిచెడి వనమున తిరుగుచుండెనో
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో . ౧౦౯
మరచిపొమ్ము ఆ కొరగాని రాముని
వలచి రమ్ము నను యశోవిశాలుని .
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె . ౧౧౦
రాముడు వచ్చుట నన్ను గెల్చుట
నిన్ను పొందుట కలలోని మాట .
బలవిక్రమ ధన యశములందున
అల్పుడు రాముడు నా ముందెందున . ౧౧౧
యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నాకిల నరభయమేల ?
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె . ౧౧౨ | శ్రీ హనుమాను |
నిరతము పతినే మనమున దలచుచు
క్షణమొక యుగముగ కాలము గడుపుచు .
రావణ గర్వమదంబుల ద్రుంచు
రాముని శౌర్యధైర్యముల దలచుచు . ౧౧౩
శోకతప్తయై శిరమును వంచి
తృణమును ద్రుంచి తన ముందుంచి .
మారు పల్కె సీత దీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన . ౧౧౪
రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించితివె నను ఆశ్రమమున .
పురుష సింహముల గాలికి బెదిరి
పారిపోతివి శునకము మాదిరి . ౧౧౫
యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నీకీ వంచనలేల ?
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన . ౧౧౬
ఓయి రావణా ! నా మాట వినుము
శ్రీరామునితో వైరము మానుము .
శీఘ్రముగా నను రాముని జేర్చుము
త్రికరణ శుద్ధిగా శరణు వేడుము . ౧౧౭
నిను మన్నించి అనుగ్రహింపుమని
కోరుకొందు నా కరుణామూర్తిని .
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన . ౧౧౮ | శ్రీ హనుమాను |
ఓ సీతా ! నీవెంత గడసరివె
ఎవరితో యేమి పల్కుచుంటివె ?
ఎంతటి కర్ణ కఠోర వచనములు
ఎంతటి ఘోర అసభ్య దూషణలు . ౧౧౯
నీపై మోహము నను బంధించెను
లేకున్న నిను వధించియుందును .
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . ౧౨౦
నీకొసగిన ఏడాది గడువును
రెండు నెలలలో తీరిపోవును .
అంతదనుక నిన్నంటగ రాను
ఈలోపున బాగోగులు కనుగొను . ౧౨౧
నను కోరని నిను బలాత్కరించను
నను కాదను నిను కనికరించను .
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . ౧౨౨
ఓ రావణా ! నీ క్రొవ్విన నాలుక
గిజగిజలాడి తెగిపడదేమి ?
కామాంధుడా నీ కౄర నేత్రములు
గిర గిర తిరిగి రాలిపడవేమి ?౧౨౩
పతియాజ్ఞ లేక యిటులుంటి గాని
తృటిలో నిన్ను దహింపనా యేమి ?
అని పల్కె సీత దివ్య స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన . ౧౨౪
క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు
కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు .
తన కాంతలెల్ల కలవరమొందగ
గర్జన సేయుచు దిక్కులదరగ . ౧౨౫
సీతనెటులైన వొప్పించుడని
వొప్పుకొననిచో భక్షించుడని .
రావణాసురుడు అసురవనితలను
ఆజ్ఞాపించి మరలిపోయెను . ౧౨౬ | శ్రీ హనుమాను |
అందున్న వొక వృద్ధ రాక్షసి
తోటి రాక్షసుల ఆవల ద్రోసి .
కావలెనన్న నన్ను వేధింపుడు
సీతను మాత్రము హింసింపకుడు . ౧౨౭
దారుణమైన కలగంటి నేను
దానవులకది ప్రళయమ్మేను .
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౨౮
శుక్లాంబరములు దాల్చినవారు
రామలక్ష్మణులు అగుపించినారు .
వైదేహికి యిరువంకల నిలచి
దివ్యతేజమున వెలుగొందినారు . ౧౨౯
తెల్లని కరిపై మువ్వురు కలసి
లంకాపురిపై పయనించినారు .
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౩౦
దేవతలందరు పరిసేవింప
ఋషిగణంబులు అభిషేకింప .
గంధర్వాదులు సంకీర్తింప
బ్రహ్మాదులు మునుముందును దింప . ౧౩౧
సీతారాముడు విష్ణుదేవుడై
శోభిల్లెను కోటి సూర్య తేజుడై .
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౩౨
తైలమలదుకొని రావణాసురుడు
నూనె త్రాగుచూ అగుపించినాడు .
కాలాంబరమును ధరియించినాడు
కరవీరమాల దాల్చినాడు . ౧౩౩
పుష్పకమందుండి నేలబడినాడు
కడకొక స్త్రీచే యీడ్వబడినాడు .
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౩౪ | శ్రీ హనుమాను |
రావణుండు వరాహముపైన
కుంభకర్ణుడు ఒంటెపైన .
ఇంద్రజిత్తు మకరముపైన
దక్షిణ దిశగా పడిపోయినారు . ౧౩౫
రాక్షసులందరు గుంపుగుంపులుగ
మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ .
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౩౬
తెల్లని మాలలు వలువలు దాల్చి
తెల్లని గంధము మేన బూసికొని .
నృత్య మృదంగ మంగళ ధ్వనులతో
చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో . ౧౩౭
తెల్లని కరిపై మంత్రివర్యులతో
వెడలె విభీషణుడు దివ్యకాంతితో .
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . ౧౩౮
విశ్వకర్మ నిర్మించిన లంకను
రావణుండు పాలించెడు లంకను .
రామదూత వొక వానరోత్తముడు
రుద్రరూపుడై దహియించినాడు . ౧౩౯
ప్రళయ భయానక సదృశమాయెను
సాగరమున లంక మునిగిపోయెను .
అని పల్కు త్రిజట మాటలు వినుచు
నిద్రతూగిరి రాక్షస వనితలు . ౧౪౦
హృదయ తాపమున జానకి తూలుచు
శోకభారమున గడగడ వణకుచు .
జరిగి జరిగి అశోక శాఖలను
ఊతగాగొని మెల్లగ నిలచి . ౧౪౧
శ్రీరాముని కడసారి తలచుకొని
తన మెడజడతో వురిపోసుకొని .
ప్రాణత్యాగము చేయబూనగా
శుభ శకునములు తోచె వింతగా . ౧౪౨
సీతకెంత దురవస్థ ఘటిల్లె
నా తల్లినెటుల ఊరడించవలె ?
నన్ను నేనెటుల తెలుపుకోవలె
తల్లినెటుల కాపాడుకోవలె ?౧౪౩
యే మాత్రము నే ఆలసించినా
సీతామాత ప్రాణములుండునా ?
అని హనుమంతుడు శాఖలమాటున
తహతహలాడుచు మెదలసాగెను . ౧౪౪
నను గని జానకి బెదరక ముందే
పలికెద సీతారామ కథ .
సత్యమైనది వ్యర్థము గానిది
పావనమైనది శుభకరమైనది . ౧౪౫
సీతా మాతకు కడు ప్రియమైనది
పలుకు పలుకున తేనెలొలుకునది .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౪౬
దశరథ విభుడు రాజోత్తముడు
యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు .
దశరథునకు కడు ప్రియమైన వాడు
జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు . ౧౪౭
సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు
పితృవాక్య పరిపాలన శీలుడు .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౪౮
శ్రీ రాముని పట్టాభిషేకము
నిర్ణయమైన శుభసమయమున .
చిన్న భార్య కైక దశరథు చేరి
తనకొసగిన రెండు వరములు కోరె . ౧౪౯
భరతునకు పట్టాభిషేకము
పదునాల్గేండ్లు రామ వనవాసము .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౦ | శ్రీ హనుమాను |