శ్రీ మహా శాస్తా చరితము - 9 పాలకడలిలో అమృత మధనం

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పాలకడలిలో అమృత మధనం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  (ABADPS)*

ఆదిశక్తి , అజ్ఞానుసారము , అండచరాచరములను సృష్టించు సృష్టికర్త. త్రిమూర్తులలో ఒకడైన
బ్రహ్మదేవుడు పంచేంద్రియజ్ఞానము గల మానవులను సృష్టించెను. లోకపరిపాలనకై యక్ష , గంధర్వ , రాక్షస , దేవతలను వరుసక్రమముగా సృష్టించెను. భూలోకమున ఒంటరి జీవితము సాధ్యపడని కారణముగా , సంతతి యొక్క ఆవశ్యకత నెరిగి , తన మనస్సు ద్వారా తన యొక్క మానస
పుత్రులను సృష్టించెను.

మానవ జీవితపు ఆదిపురుషులుగా మనుపు , సద్రూపుడు జన్మించిరి. దేవ , దానవులకు జన్మనిచ్చుటకై కాశ్యపమహాముని జన్మించెను. తపస్సంపన్నుడైన కశ్యపమహాముని భార్యలైన అదితి
గర్భమందు దేవతలు , దితి గర్భమున రాక్షసులు పుత్రులుగా జన్మించిరి. దేవదానవుడు జన్మతః
సోదరులే అయిననూ భిన్నమైన గుణస్వభావములు కలిగియుండిరి. వారి మధ్య ఎల్లప్పుడూ వైరము
పొడసూపుచుండినది. ఎంతోకాలముగా రాక్షసుల వలన బాధలు పొందిన దేవతలు త్రిమూర్తుల
సహాయముతో అమరావతిని తమ రాజధానిగా చేసికొన్నవారైరి. దేవలోక వాసుడైన మహేంద్రుడ
తన పదవి , రాజభోగము స్థిరము కాదు అన్న సత్యమును మరచినవాడాయెను. బాధల నుండి విముక్తి పొందిన దేవతల యొక్క ప్రవర్తనలో మార్పు కానవచ్చెను. పదవి , అధికార దర్పముతో
కూడిన వ్యామోహమున , తమకు తామే అధికులమను అహంకారము గలిగి ప్రవర్తించసాగిరి.

ఆ కాలమున భూలోకమున గల పర్వతములకు కూడా రెక్కలుండేవట. రెక్కలున్న కారణముగా
ఒక చోట నుండి , మరొక చోటికి ఎగిరి పోవుటయూ సర్వసామాన్యముగా జరుగుచుండినదట.

ఒక చోట నుండి , మరొక చోటికి తమ తమ ఇష్టానుసారము ఇష్టమువచ్చినట్లు దిగుచుండుటచే
పర్వత భారము వలన ఆ ప్రాంతములు భూమండలము మొత్తము క్రుంగిపోవునని ఎరిగిన నారదుడు , ఆ పర్వతములకు కదలిక అను లేకుండునట్లుగా చేయుమని దేవతలను ప్రార్థించగా , అహంకార పూరితుడైన ఇంద్రుడు విచక్షణా రహితుడై ప్రతి పర్వతము వద్దకూపోయి , వాటి రెక్కలు విరచివేయసాగెను. కదలికలు లేని
శిలారూపములుగా నుండునట్లు చేసెను. అందులకై అతడు *'పర్వత భక్షారీ'* గా పిలువబడినాడు.

ఈ కారణముగా పలువురు , పలు తెరగుల స్తుతించిన పొగడ్తల మైకములో ఇంద్రుడు
తేలియాడుచుండెను. అతడి గర్వము మరింతగా పెరిగిపోయినది. తమ యొక్క ఈ కారణభూతులు త్రిమూర్తులే నను విచక్షణ మరచినవాడై , కైలాస పర్వతమును ఆక్రమించెను. ఇందులకు కోపగించిన నందీశ్వరుడు , ఇంద్రుని మూర్చిల్లజేసి అమరావతిలో పడునట్లుగా చేసెను.

ఈ వృత్తాంతమును ఎరిగిన ఈశ్వరుడు , ఇంద్రుని వద్దకు దుర్వాసమహామునిని పంపెను , అత్రిమహర్షి , అనసూయా దంపతులకు రుద్రాంశ సంభూతుడై జన్మించినవాడు దుర్వాసముని.
అతడు పరమేశ్వర ఆదేశానుసారం విద్యాధరుల యొక్క వన మార్గము గుండా పోవుచుండెను.
అతడి వాలకము ఎట్లుండెననగా అతుకులు గలిగిన వస్త్రములను ధరించి , ఒంటినిండా బురద పూయబడినవాడై , చూచుటకు ఒక ఉన్మత్తునివలె గోచరించుచూ వెడలసాగెను. దారిలో అతడు ఒక
దేవకన్యను చూచెను. ఆమె అద్భుత సౌందర్యరాశియై , చేత పుష్పమాలికను ధరించి యుండెను. *'ఈ  మాల నీకు ఎటుల లభించినది'* అని ఆమెను ప్రశ్నింపగా ,

తన తపశ్శక్తిని హెచ్చిన మహాశక్తి , తాను ధరించిన పుష్పమాలను తనకు వరముగా ప్రసాదించిన వైనమును తెలిపెను. దుర్వాసుల వారు ఆ పుష్పమాలను తనకు ప్రసాదించమని వేడుకొనగా , ఆమె
మిగుల సంతుష్ఠురాలై భక్తి పూర్వకముగా అతడికి ప్రణమిల్లి , ఆ మాలను అతడికి అందజేసెను.

మాతృ స్వరూపిణి అయిన ఆదిశక్తి స్వయముగా ధరించి , ప్రసాదించిన పుష్పమాలను ,
దుర్వాసుడు భక్తి పూర్వకముగా గైకొని , తన జటాజూటమున ధరించెను. *“ఓకన్యామణీ ! బ్రహ్మా
మొదలగు దేవతలకు సైతము అనితర సాధ్యమైన ఈ పుష్పమాల భాగ్యవశమున నీ వలన
లభించినది.

*నీకు తెలియకనే , భవిష్యత్తున జరుగబోవు ఒక మంగళకరమగు శుభకార్యమునకు కారణభూతురాలివైనావు.ఆ మహాశక్తి యొక్క అనుగ్రహము వలన నీ భక్తి ఎన్నటికీ కొనియాడబడుతుంది”* అని దీవించెను. తరువాతి ప్రయాణమున వీణ , వాసన ద్రవ్యములు ,
పుష్పమాలికలు, పలు ఆభరణములు ఇలా పలురకములైన బహుమతుల నందుకొనుచూ , దుర్వాసుడు ఆనందపరవశుడై తనలో తాను మాట్లాడుకొనుచూ , నవ్వులు చిందించుచూ , పాడు కొనుచూ
నడవసాగెను.

ఇంద్రుని యొక్క అహంకారపు ప్రవర్తనను గమనించిన దేవగురువైన బృహస్పతి - విచక్షణా
జ్ఞానము లేక అహంకారముగా ప్రవర్తించినచో , ఎదుర్కొన బోవు ప్రమాదమును , దాని వలన కలగబోవు దుస్థితిని హెచ్చరించెను. త్వరలోనే ఇంద్రునికి అమరావతి ఎన్నో దుశ్శకునములు గోచరించసాగెను. కారణమేమైయుండునని బృహస్పతిని ప్రశ్నింపగా , పర్వతములకు చేసిన పాపఫలితమేనని తెలిపెను. పాపము
పాపము చేసినవారు , పరిహార ప్రాయశ్చిత్తము చేసికొనక , తప్పించుకొనుట
అసాధ్యము అని తెలిపెను. ఆ మాటలు నిజమేనన్నట్లుగా జరిగినది తరువాత జరిగిన వృత్తాంతము.

జగన్మాత అయిన లలితా పరమేశ్వరి జడలోని పూవూలను ధరించి వచ్చిన దుర్వాసమహాముని ,
దేవేంద్రుడు చేసిన అతిధమర్యాదలకు సంతసించినవాడై , *“ఈ మాల నీ వద్ద ఉండుటయే పాడి”*
అంటూ ఇంద్రునికి ఇచ్చెను. పొగడ్తల మైకమున తేలియుండు ఇంద్రుడు నిర్లక్షవైఖరితో ఆ మాలను , తాను అధిరోహించియున్న శ్వేతగజమైన ఐరావతము మెడలో వేసెను.

ఆ పుష్పమాలికల సుగంధ సౌరభములకు ఆకర్షింపబడిన తుమ్మెదలు ఘీంకారము చేయుచూ
ఐరావతమును చుట్టుముట్టినవి. వాటి నాదమునకు విసిగిపోయిన ఐరావతము కోపముగా ఆ
మాలను కిందకు విసరివైచెను. ఆదిశక్తి ప్రసాదమైన ఆ పుష్పమాలను కించపరచుట చూసిన
దుర్వాసముని మిక్కిలి కోపిష్ఠి ఆయెను. కోపమునకు మారుపేరైన దుర్వాసుడు ఇంద్రుని మాత్రమే కాక దేవతలందరినీ శపించెను.

*“దేవేంద్రా ! సాక్షాత్తూ ఆదిశక్తి మెడలో ధరించి ఇచ్చిన ఈ పుష్పమాలిక జగమంతయూ
నమస్కరించదగినది. అట్టి మాలను దేవలోక అధిపతివన్న అహంకార గర్వముతో అవమానించితివి.

దీనికి ఫలితమును అనుభవింతువు గాక. ఇదే నా శపము. దేవ , రాక్షస , మానవలోకములు
మూడూ అమంగళములగు గాక. నశించునుగాక. దేవలోకపు వాసులంతా తమ దివ్యశక్తులను
కోల్పోవుదురుగాక. మదించిన ఐరావతము అడవి ఏనుగుగా మారిపోవును అని శపించెను.

గర్వభంగమైన ఇంద్రుడు ప్రాయశ్చిత్తవదనుడై , తన తప్పిదమును మన్నింపుమని పలు విధముల ప్రార్థించెను. కానీ కోపము వీడని దుర్వాసుడు బదులీయక అచటి నుండి నిష్క్రమించెను. శాపఫలితముగా విజయలక్ష్మి ఇంద్రుని వదలిపోయెను.

ఇంద్రుడు తాను చేసిన తప్పిదమును గ్రహించినవాడయ్యెను. శాపఫలితముగా దేవతల యొక్క అందమైన ఆకారములు నల్లగా మారిపోయినవి. ఇంద్రుని శరీరము గుర్తించని విధముగా మారిపోయినది. దేవలోకమున అందముగా శ్వేత వర్ణముతో నడయాడు ఐరావతము నల్లనిబొగ్గు ,
వంటి వర్ణము కలిగిన అడవి ఏనుగుగా మారిపోయెను.

దేవతలకు కలిగిన దుస్థితి విన్న రాక్షసులకు ఎంతయో సంతోషము కలిగినది. ఇదే అదునుగా
*'మలకుడు'* అను రాక్షసుని ఆధిపత్యమున , అమరావతిని చుట్టుముట్టగా , శాపఫలితముగా
సహజదివ్యశక్తులను కోల్పోయిన దేవతలు దిక్కుతోచక పారిపోయిరి. రాక్షసులు అమరావతిని
ఆక్రమించిరి. ఇన్ని విపరీత పరిణామములను ఎదుర్కొన్న దేవతలు త్రిమూర్తుల శరణుజొచ్చిరి.

శ్రీమహా విష్ణువు వారికి 
అభయమీయుచూ *“దేవతలారా ! మీరు మరల దివ్యశక్తులుగా మారుటకు నేనొక ఉపాయము చెప్పెదను. అద్భుత శక్తులు గలిగిన పలువిధములైన మూలికలను , పాలకడలిలో వైచిచిలుకుము. అట్లు చిలుకుట ద్వారా లభించు అద్భుత వస్తువుల కారణముగా , మీరు కోల్పోయిన దివ్యశక్తులను తిరిగి పొందుదురు. అమృతము చివరగా లభించును. అది సేవించినచో మరణము లేని జీవితము , దివ్యతేజస్సు మీకు లభించును”* అని తెలిపెను.

పాలకడలిని చిలికినచో అమృతము లభించుట మాట నిజమే. కానీ తమ సహజమైన దివ్యశక్తులను , బలమును పోగొట్టుకుని నిరాశ్రయులుగా , నిస్తేజముగా , నీరసముగా నుండు దేవతలకు పాలకడలి చిలుకునంతటి బలపరాక్రమములు ఎట్లు కలుగను” అని చింతించిరి. దేవతల
యొక్క చేతకాని తనమును గ్రహించిన మహా విష్ణువు ఒక ఉపాయము తెల్పెను. ఆ ప్రకారము పాలకడలి చిలుకుటకు రంగము సిద్ధమైనది. మంధర పర్వతము పాలకడలి చిలుకు కవ్వమైనది.
వాసుకి తాడుగా మారెను. దేవతల యొక్క మాయోపాయము చేత , భయంకరమైన విషము కక్కు వాసుకి యొక్క తలభాగమున రాక్షసులు , తోకవైపు దేవతలు నియమించబడిరి. అపూర్వ దివ్యశక్తులు
గల మూలికలు పాలకడలిలో చేర్చబడినవి. పాలకడలి చిలుకుట ప్రారంభమైనది. దేవదానవులు చేసిన తప్పిదం ఏమనగా ఏ పని ప్రారంభించినను వినాయకుని స్తుతించుట ఆచారము. ఆ పని
చేయకపోవుటచే విఘ్నము కలిగి మంధర పర్వతము పాతాళమునకు విసరివేయబడినది. తప్పిదమును గ్రహించిన దేవదానవులు పరిపరివిధముల వినాయకునికి క్షమాపణలు వేడి , ప్రార్థించగా , మంధర
పర్వతము మునుపటివలె సహజస్థితికి వచ్చెను. శ్రీమహావిష్ణువు కూర్మావతారము దాల్చి పర్వతమును తన వీపున దాల్చెను. దేవదానవులు చాలాకాలము పాలకడలిని చిలుకుతూ శ్రమించగా లభ్యమైనది
అమృతం కాదు. హాలహల విషము.

సెగలు కక్కుచూ గోచరించిన హాలహల విషము దరికి చేరుట ఎవరికినీ సాధ్యపడలేదు.
అరుణవర్ణధారియైన అచ్యుతుడు విషము చెంతకుపోగా విషము యొక్క నీలవర్ణము తాకి
నీలవర్ణుడాయెను. అందరూ భయపడి పారిపోయిరి. భోళా శంకరుడైన పరమేశ్వరుడు ఆ విషమును మింగివేసెను. మింగుట అయితే జరిగినది గానీ , ఈ విషము అథోముఖముగా కంఠము దాటి పోయినచో , తనలోనే ఇమిడియున్న అఖిలమంతయూ నాశనము అగునన్న భావన కలిగి , ఆ
విషమును తన కంఠ ప్రదేశమున పొందుపరచి , నీలకంఠుడైనాడు పరమేశ్వరుడు. ఆ సమయమున
వెదజల్లబడిన విషపు బిందువులు తాకిడి కారణముగా నాగులు విషపూరితములైనవి.

హాలాహల తాకిడి అణగిన తరువాత దేవాసురులు మరల కడలి చిలుకుట ప్రారంభించిరి. ఒకే
సమయమున పలు విధములైన ఆకారములను దాల్చిన శ్రీమన్నారాయణుడు దేవాసురులకు తోడ్పడినాడు. ఎంతో కాలము శ్రమించిన అనంతరము పాలకడలి సంతసించి అద్భుత వరములను అనుగ్రహించినది. ముందుగా కామధేనువు , కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము , అద్భుత
సౌందర్యరాశులైన అప్సరకన్యలు , పలు అద్భుత వస్తువులు లభించినవి. అద్భుత కళలుగల చంద్రుడు జన్మించి ఆదిశంకరుని జటాజూటమున ఆభరణమాయెను.
పిమ్మట లభ్యమైన కౌస్తుభమణి
శ్రీమన్నారాయణుని కంఠమునలంకరించినది. తరువాత సర్వమంగళ స్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మి అవతరించినది. పురుషోత్తముడై నారాయణుని భర్తగా వరించినది. పిమ్మట ఏతెంచిన వారుణిదేవిని
రాక్షసులు తమ స్వంతము చేసికొనిరి. *'ఉచ్ఛైశ్రవం'* అను అశ్వమును కూడా రాక్షసులు హస్తగతము
చేసికొనిరి. అద్భుతకళలతో జన్మించిన శ్రీమహాలక్ష్మి కడగంటి చూపుల కారణముగా దేవతలు
తాము కోల్పోయిన దివ్యతేజస్సును పొందిన వారైరి.

చివరగా , దామోదరుడు , తన అంశ అయిన ధన్వంతరి రూపుడై చేత అమృత కలశముతో
ఆవిర్భవించగా , ఎంతోకాలముగా ఓపికగా మధనము చేయుచూ శ్రమించిన అసురులు
అమృతభాండమును చూచినంతనే , తాము మాత్రమే త్రాగవలెనన్న దురాశతో బలవంతముగా
అపహరించి పారిపోయిరి.

దేవతలు , అసురులు నిరంతరము శ్రమకోడ్చి సాధించిన అమృతమును చూచినంతనే దురాశకలిగిన దానవులు తాము మాత్రమే అనుభవించు ఆలోచన కలిగినది. స్వార్థపరులైన దానవుల కుత్సితమును
శ్రీహరి గ్రహించెను. వారి దురాశ ఫలితముగా అమృతమును గ్రోలు అర్హతను వారు కోల్పోయిరని భావించెను.
దానవుల నుండి అమృతమును గ్రహించి దేవతలకు మాత్రమే పంచవలెనను ఉపాయము పన్నినాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకియైన శ్రీ లలితా పరమేశ్వరిని ధ్యానించెను. తాను కూడా ఆమెలోని ఒక అంశయే కదా అను సత్యమును గ్రహించినవాడై ఆమెలో ఐక్యము చెంది , ఒక
అద్భుత లావణ్యరాశియగు మోహినిగా అవతారము దాల్చెను. లభించిన అమృతమును తాము
మాత్రమే త్రాగవలెనన్న తొందరపాటులో నున్న అసురుల ముందు మోహిని రూపుడై శ్రీహరి
ప్రత్యక్షమాయెను , ఆ సౌందర్యరాశిని చూచిన రాక్షసులు , దేవతలతో తమకు గల వైరమును సైతము మరచి మోహపరవశులై శిలలవలె నిలబడియుండిరి.

మోహిని వారితో *'ఈ అమృతము కొరకు మీలో మీకు ఈ వైరమేల ? నా స్వహస్తములతో ఈ అమృతమును నేను స్వయముగా ఇరువురికీ సమముగా పంచి ఇచ్చు బాధ్యత నాదే'* అన్నంతనే ఆమె రూపలావణ్యములకు ముగ్ధులై పరవశులై యున్న అసురులు , తాము ఏమి చేయుచున్నారో
తెలియని ఉన్మాద స్థితిలో ఉండి , ఆమె చుట్టూ మూగిరి. తాను తలచినట్లుగానే జరుగుచున్న సంగతిని గ్రహించిన మోహిని వారితో ఇటుల మూగియుండగా అమృతము పంచుట సాధ్యము కాదనియూ , వరుస క్రమమున రమ్మనియూ కోరెను. ఆమె సౌందర్యమునకు మైమరచియున్న
అసురులు ఆమెను , ఆమె మాటను ఎదిరించు శక్తి లేక వరుస క్రమములో నిలుచుని యుండిరి.
ముందుగా పన్నిన ఉపాయము అమలు పరచునట్లుగా మోహిని ముందుగా దేవతలకు అమృతము పంచసాగెను. అమృతము గ్రోలిన వెంటనే కోల్పోయిన దివ్యత్వమును తిరిగి పొందిన దేవతలు
మరణము లేని యోగమును , క్రొంగొత్త తేజస్సును పొందిర వారైరి.

దానవుల వరుసలోని *'సింహికేయుడు'* అను అసురుడు మోహిని యొక్క కుట్రను గ్రహించినవాడై ,
ఆ దివ్యత్వమును తాను కూడా పొందవలెనన్న దురాశతో , రూపు మార్చి దేవతల వరుసలో
ప్రవేశించి అమృతమును గ్రోలెను. సూర్యచంద్రులు ఈ మోసమును మోహినికి తెలియజేయగా , తనచేతిలోని గరిటెతో ఆమె సింహికేయుని తలని తుంచివేసినది. అమృతమును సేవించిన
కారణముగా , మరణము లేని సింహికేయుడి తల నాగుపాముగానూ , శరీరము మానవ శరీరముగానూ , మరియొక ఆకారము తల మానవ ఆకృతి , శరీరము నాగుపాముగానూ ఇటుల రెండు రూపముగా
రూపుదాల్చి రాహు , కేతువులుగా నవగ్రహ పదవి నందెను.

ఈ సంభవము జరిగిన తరువాతనూ అసురులలో చైతన్యము కలుగలేదు. కారణము వారు
మోహిని పట్ల మోహ పరవశత్వముతో ఉండిరి. ఇంతలో అమృతభాండము ఖాళీ అయిపోయినది.
మత్తు వదలిన దానవులకు జరిగిన మోసము అర్థమయినది. ఇంతలో దివ్యతేజస్సును , బలమును పొందిన దేవతలు రాక్షసులతో యుద్ధమునకు తలపడిరి. వారి ధాటికి తాళలేని దానవులు యుద్ధము
చేయుశక్తి లేక పాతాళ లోకమునకు పారిపోయిరి. దేవేంద్రుడు మరల రాజై పరిపాలించసాగెను. 

దేవర్షి అయిన నారదమహాముని శ్రీమహావిష్ణువు యొక్క అవతార రహస్యమును గ్రహించిన వాడయ్యెను. మోహిని అవతారము ద్వారా లోకమునకు ఒక గొప్ప మేలు కలుగబోవు విషయమును గ్రహించెను. కైలాస పర్వతమును చేరిన నారదుడు , శ్రీ హరి మాయా మోహినిగా రూపుదాల్చి , దానవుల అంతుచూచిన వైనమును ఈశ్వరునికి ఎరింగించెను. మిక్కిలి సంతోషము కలిగిన ఈశ్వరుడు , తన భార్య అయిన పార్వతీదేవితో పరంధాముని అభినందించుటకై పాలసముద్రమును
చేరెను. *"శ్రీధరా ! జగన్మోహినిగా నీవు రూపుదాల్చిన వృత్తాంతమును ఎరింగితిని. అఖిలమ్ములనే మోహపరవశులను చేసిన నీ మోహిని రూపును నాకు చూడ ఇచ్ఛయైయున్నది”* అనగా , బదులీయని
విష్ణువు అచట నుండి అంతర్ధానమాయెను.

చేయునది లేక ఈశ్వరుడు వెనుతిరిగెను. పయన మార్గమున , అలసట తీర్చుకొనుటకై ఒక ఉద్యానవనమును ప్రవేశించెను. సుగంధపరిమళములు వెదజల్లు పుష్పములతో , కోకిల గానములతో ,
ఆ చోటు భాసిల్లుట చూచి ఆనందపరవశుడాయెను. ఇదంతయూ మాయా
మోహనుని నాటక ప్రాతిపదికలే. ఇంతలో ఒక మూలగా ఒక దివ్య తేజస్సు కనబడెను. అందెల రవళులు , మంద్రస్థితిలోని వీణానాదము వినబడెను. అదంతయూ ఒక అద్భుత సౌందర్యరాశికి
సంబంధించినదిగా గుర్తించిన పరమశివుడు ఆమె అందమునకు మోహితుడై ఆమెను సమీపించెను. 

పరమశివుని కోరిక మేరకు , మోహిని రూపును చూపవలెను అని మాత్రమే తలచిన శ్రీహరి , ఎదురుచూడని విధముగా పరమశివుడే తనను మోహించునని ఎదురుచూడని శ్రీహరి ఇది ఏ మాత్రమే ఊహించని పరిణామముగా నెంచి , భయకంపితురాలై ఈశ్వరుని చేతికి అందకుండా పారిపోయి జంబూద్వీపములోని ఒక వనమున ప్రవేశించినది. ఒక మహావృక్షపు నీడన సేదదీరుచున్న ఆమెను సమీపించినాడు పరమశివుడు. పరుగెత్తి పరుగెత్తి అలసిసొలసిన ఆమె మేని నుండి చిందిన
స్వేదము ఒక మహానదిగా మారినది. ఆ నది గండకీ నదిగా రూపాంతరము చెంది , ఆ నదిలోని
గులకరాళ్ళు సాక్షాత్తు విష్ణువు పాదముద్రలు పొందిన సాలగ్రామములుగా ప్రసిద్ది గాంచెను. అప్పటికి మోహిని రూపును ఆకళించుకున్న పరమశివుడు , తన మోహమును అణచుకొనలేనివాడై ,
*“నారాయణా ! నీవు నా పత్ని అయిన పార్వతి యొక్క అంశవే. నా భార్య అయిన పార్వతి ఒక్కొక్క కారణము చేత ఒక్కొక్క అవతారము దాల్చును. నా భార్యగా ఉండు సమయమున భవానిగానూ , ఉగ్రమూర్తిగా మారినపుడు అపరకాళికాదేవిగానూ , యుద్ధసమయమున దుర్గా దేవిగానూ , స్థితికారకత్వము పొంది సర్వజనులనూ కాచువేళ శ్రీమహావిష్ణువుగానూ రూపుదాల్చును. కాబట్టి ఈ రూపున నున్న నీవు నా భార్య అయిన పార్వతివే గాని , వేరు కాదు”* అనెను.

వారిరువురి సంగమ ఫలితముగా , స్వయంభువుగానూ, అద్భుత రూపునిగానూ , ఆనందమయ
మూర్తిగానూ , తారక ప్రభువుగానూ రూపుదాల్చిన *మహాశాస్తా* పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తిని విష్ణువు యొక్క పలిపాలనా శక్తిని పుణికి పుచ్చుకొనెను.

*తతః సముదితో దేవో మహా శాస్తా మహాబలః*
*అనేక కోటి దైత్యేంద్ర గర్వ నిర్వాహణక్షమః*

అమిత బలశాలిగానూ , అనేక కోటి దానవులను చీల్చి చెండాడు శక్తిగలవానిగానూ రూపుదాల్చెను.

*"మురారియూ , ముక్కంటియూ కూడిన శుభవేళ జనియించిన ఓ శాస్తా ! మముగావుమయా !
(స్కందపురాణము)



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!