శ్రీ మహాశాస్తా చరితము - 14 పాల కొరకు ఏడ్చిన బాలకుడు

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పాల కొరకు ఏడ్చిన బాలకుడు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


స్వామి అవతార విధి జరిగినది. సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే బాలక రూపంలో అవతరించినది కదా ! తన బాల లీలల ద్వారా తన మహిమలను తెలియజేయ నారంభించెను.

పార్వతి యొక్క మేనినుండిన పిండితో జనియించినవాడు గణపతి. ఈశ్వరుని యొక్క నేత్రదృష్టి నుండి జన్మించినవాడు స్కందుడు. మరి మోహినిగా వచ్చినది విష్ణుమూర్తియా ? లేక పార్వతితో లయించిన పరమేశ్వర మూర్తియా ? తన జగన్మోహన రూపముతో ఈశునితో జరిపిన సంగమ ఫలితమే కదా ఈ మూర్తి అవతార విశేషము.

రత్నత్రయంగా పిలువబడు ముగ్గురి దేవతలలో శివ , విష్ణువు , శక్తి స్వరూపిణి ముగ్గురి అంశలు కలగలపు అయిన రత్నమే కదా శాస్తా.

అందుచేతనే గణపతి , కుమారస్వాములకన్నా శాస్తా తల్లికి మెచ్చిన ముద్దుబిడ్డ యనుటలో
ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. ఏది ఏమైననూ బాహ్య ప్రపంచానికి ఈతడు హరిహర పుత్రుడే కదా యను లోటు కలుగనివిధముగా కలుగవిధముగా జగన్మాత అయిన పార్వతిదేవికి అత్యంత హృదయానందము కలుగజేయువాడయినాడు.

శాస్తా అవతార ఆవిర్భావము కొరకై కదా విష్ణుమూర్తి మోహినిగా మారినది. శాస్తా అవతరించిన అనంతరము మోహిని రూపధారి అయిన విష్ణుమూర్తి తన అసలు రూపంలోకి మారిపోయెను.

పసిబిడ్డ తల్లి ప్రేమకై అలమటించసాగెను. తన బాధను వ్యక్తము చేయుట తెలియని బిడ్డ వెక్కి
వెక్కి ఏడ్వసాగెను.

*'అమ్మా'* అంటూ కడు దీనముగా ఏడ్చుచూ అఖిలమంతయూ చుట్టి వచ్చినాడు బిడ్డ. లోకపావని అయిన ఆదిశక్తి మాతృస్వరూపిణి కదా తన బిడ్డను వదలుకుంటుందా ? పరుగెత్తి వచ్చి ఎదకు హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. మాతృప్రేమ ఉప్పొంగగా ఆర్తిగా హత్తుకుని , ఒడిలో పరుండజేసి స్తన్యమీయసాగెను. దేదీప్యవంతమైన కనులు కాంతితో మెరయుచుండగా సాక్షాత్తూ జగజ్జనని యొక్క అమృతము అను స్తన్యమును ఆనందపరవశుడై గ్రోలుచుండెను.

హరిహరులిరువురూ ఈ దృశ్యమునుగాంచి అమితానందము నందిరి. ఎంతో ప్రేమగా ముద్దాడిన
శ్రీహరి బాలకుని పరమేశునితో కైలాసమునకు పంపెను.

కైలాసగిరిని చేరిన హరిహరసుతుడు దినదినాభివృద్ధి పొందుతూ , తన బాల చేష్టలతో అందరినీ ఆనంద పరవశులను చేయుచుండెను.

బాల శాస్తా తన ముద్దు ముద్దు చేష్టలతో అందరినీ అలరించుచుండెను. ఎప్పుడూ అతడి చుట్టూ
ప్రధమ గణములు , శక్తిగణములు పరివేష్టింపబడి యుండెను. మరి శాస్తా ఏమో తల్లి అయిన పార్వతి ఒడిలో చిరునవ్వులు చిందించు ముగముకలవాడైయుండెను. ఆ చిరునవ్వులు చూచుటకే వారంతా ఎప్పుడూ కూడియుందురు.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat