శ్రీ మహాశాస్తా చరితము - 15 బాలస్వామి యొక్క వైకుంఠలీలలు

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*బాలస్వామి యొక్క వైకుంఠలీలలు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

ఒకమారు పరమశివుని యొక్క దేవసభకు హాజరైన లక్ష్మీ నారాయణులు ముద్దులొలుకు బాలస్వామిని చూసి ప్రేమానందము బొంది తమతో వైకుంఠమునకు గొనిపోయిరి.

ముప్పొద్దులూ ఒకేలాగున ప్రకాశించు వైకుంఠము అతడి బాలచేష్టల ద్వారా మరింత శోభాయమానమైనది. శ్రీదేవి భూదేవి ఇరువురూ మార్చి మార్చి బాలకుని ముద్దు చేయసాగిరి.
గరుత్మంతుడు , ఆదిశేషుడు , విష్వక్సేనుడు వంటి భవబంధాలకు అతీతులైనటువంటి వారు సైతము అతడిపట్ల ఆకర్షితులైనారు.

వైష్ణవ గణముల కధిపతియైన విష్వక్సేనుడు ఆ కుమారుని ముద్దు చేయనెంచి మహాలక్ష్మి యొక్క అనుమతితో తనవెంట తీసికొనిపోయెను. ఆరుబయట పలువిధములైన ఆటపాటలు చూపెను.
పిల్లవానికి సంతోషము కలుగులాగున తన చేతులు , కాళ్ళను విధవిధములుగా కదిలించుచూ ,
మూతి వంకరలు తిప్పుచూ , హాస్యపు చేష్టలతో పలువిధములగా వినోదములు చూపెను. అతడి చేష్టలకు బాలాశాస్తా ఎంతగానో ఆనందించెను. ఇది అంతయూ చూసిన వైష్ణవ గణములన్నియూ బాలకుని చుట్టూ మూగి తమ హర్షధ్వానములను తెలిపిరి.

అంతలోనే అటుగా వచ్చిన శ్రీదేవి ఈ ముద్దు మురిపెములు చూసి సంతోషము ఉప్పొంగి , బిడ్డను తన ఒడిలో నుంచుకుని చుట్టూ ఉన్నవారందరూ చేయు హర్షధ్వానాలను తిలకించసాగినది. లక్ష్మీదేవి ఒడిలో నున్న బాలకుని నేత్రముల ఉజ్వలకాంతితో వైకుంఠమే ప్రతిఫలించినదట.

బాలకునికి ఆకలి వేయ నారంభించినది. ఓరకంట లక్ష్మీనారాయణులను చూడగా వారిరువురూ విష్వక్సేనుల వారి వినోద కార్యక్రమములలో లీనమైయుండిరి. ఇదే అదనుగా సవ్వడిచేయక
లక్ష్మీదేవి యొక్క ఒడినుండి దిగి , తనవలెనే ఉండు ఒక మాయబాలకుని తన స్థానంలో ఉంచి , పాలసంద్రంవైపుగా పోయెను. తన ఆకలికి కావలసినన్ని పాలు ఇక్కడే కదా ఉన్నవియనుకొనుచూ
పాలసముద్రములోని పాలనన్నిటినీ త్రాగివైచెను.

సవ్వడి సద్దుమణిగిన పిమ్మట లక్ష్మీనారాయణులు వెనుదిరిగి చూడగా పాలకడలి కానరాక దిగ్ర్భాంతులైరి. జరిగినదంతయూ తన మనోనేత్రం ద్వారా గాంచిన శ్రీపతి ఇటుల అనెను. ఈ లోకమంతయూ నా విష్ణుమాయ ఆవరించియుండగా , మాయానాటక సూత్రధారియైన నన్నే మెప్పించు విధముగా ఈ బాలకుడు మనలను మోసగించినాడు. తనకు బదులుగా ఒక మాయబాలకుని మన చెంతనుంచి పాలసముద్రములోని పాలనన్నిటినీ తాగివేసినాడు. అన్ని లోకములను ఒకే చేతిలో ఔపోసన పట్టగల పరబ్రహ్మ స్వరూపుడైన మన బిడ్డడి లీలా వినోదమే ఇది అంతయూ అంటూ చిరునవ్వు చిందించెను.

ఇది చూసినవారందరూ ఎంతో విస్మయము పొందిరి. లక్ష్మీ నారాయణులిరువురూ , పాలకడలి వద్ద తనకు ఇది అంతయూ ఏమాత్రము తెలియనట్లుగా ఆటలాడుకొను బాలకుని చూచి తండ్రీ  !పాలకడలియే నా నివాస స్థలం. అందుగల పాలను అన్నిటినీ నీవు త్రాగివైచినావు కదా. ఇక ఇందు మేము వాసము చేయుట ఎట్లు అంటూ హాస్య ధోరణిలో అడుగగా ,

జరిగినదంతయు తనకు ఏమీ తెలియదు అన్న రీతిని అమాయకముగా ముఖం పెట్టి , తాగిన
పాలనన్నిటినీ బయటికి ఉమ్మి వేయగా పాలసముద్రము మరల మునుపటి స్థితిని సంతరించుకొనెను. .

సహజముగానే శిశువులందరి ఆటపాటలు సంతోషము కలిగించునవే. సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపుడే బాలకుడు అయినప్పుడు అతడి లీలలకు సకల జగత్తుకు మైమరపు నందుటలో ఆశ్చర్యము లేదు కదా !

బాల్యవస్థలోనే ఆ శిశువు భువన బ్రహ్మాండమంతయూ సంచరించుచూ తన లీలావినోదముల చేత అందరినీ అలరించుచుండెను.

ఒక్కొక్కసారి చిత్ర విచిత్ర రీతిలో భూతగణములతో ఆటలాడుచుండును. మరుక్షణంలోనే పదునాలుగు లోకములను చుట్టి వచ్చుచుండెను.

ఒక్క క్షణం శిశువు వలె చేతులు చప్పట్లు కొడుతూ ఆనందించసాగెను.

కొంత సేపు తరువాత జ్ఞానస్వరూపుని వలె గోచరించుతూ పర్వతములపైన , వనములయందునూ అమరియుండి చేతిలో వీణను ధరించి సకల లోకములూ మైమరచు విదముగా మంద్ర స్వరములో వీణగానము చేయుచుండువాడు.

మరుక్షణమే అచటినుండి మునులు తపమాచరించు స్థలమునకు బోయి చేతిలో కర్రతో వయోవృద్ధుని వలె వేషముబూని మునులను ఆశీర్వదింపసాగెను.

అంతలోనే బ్రహ్మచారి వలె గోచరించుతూ వేద అధ్యయనము చేయసాగెను. చతుర్వేదములన్నియు
స్వామి వేళ్ళయందు నర్తనమాడు ఆశబూని వచ్చినట్లుండును మరుక్షణమే సుందర స్వరూపుడై తేజోవంతుడై పులిపై ఎక్కి విహారము చేయుచూ వేదములన్నియూ స్తుతించు విధముగా కనబడెను.

మరునిముషంలోనే యువరాజు వేషధారియై అశ్వముపై అడవులయందు ఊరేగుచుండెను.

శివపార్వతులు తమ అనుంగు బాలుని ఎంతో మురిపెముగా పెంచసాగిరి. శివ విష్ణువుల సమైక్య రూపముగా అవతరించిన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపులు కువలయ రక్షణకై అవతరించిన స్వామి , బాలశిశువుగా దోగాడుతూ తల్లిదండ్రులను ఆనందపరచసాగెను. కైలాసవాసులందరూ ఆనంద తన్మయత్వముతో ఊగిసలాడు విధముగా బాలశాస్తా పలువిధములైన లీలలు సాగించెను. బాల్యదశ గడిచి విద్యావంతునిగాను , యౌవనవంతునిగానూ బాలశాస్తా పెరిగి పెద్దవాడయ్యెను.

ఒకసారి గజాననుడైన వినాయకుడు , తన చిట్టి తమ్ముడైన బాలశాస్తాని తన మూషిక వాహనంపై కూర్చుండబెట్టి లోకమంతా సంచరించసాగెను.

అది తెలిసిన సరస్వతీ దేవి వారిని తమ లోకమునకు ఆహ్వానించినది సేవించువారికి తన్మయానందమును ప్రసాదించు స్వామిని చూచుటకు ఎవరికి కోరిక ఉండదు ? అన్నదమ్ములిరువురూ సత్యలోకమునకు ఏగిరి.

ఇది చూచిన సరస్వతిదేవి ఆనందపడుతూ తన భర్త అయిన బ్రహ్మదేవుని వద్దకేగి ,
*'శివతనయులిరువురూ మనవద్దకు వచ్చుచున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలుకవలెయునని కోరికగా ఉన్నది ప్రభూ'* అనినది.

వేదఘోషలు చేయు ఋషులు , మనస్సును అవలీలగా జయించిన యోగులు , సత్యలోకమున వసించు జీవన్ముక్తులు ఇలా అందరితోనూ కూడి బ్రహ్మదేవుడు వినాయకుడు , విష్ణుపుత్రుడైన శాస్త్రాని ఆహ్వానించుటకు పూర్ణకుంభ స్వాగతం పలుకుటకై ఆయత్తమయ్యెను.

వేదఘోష ప్రతిఫలించుచుండగా బాలకులిరువురూ సత్యలోకమున ప్రవేశించిరి. తమ కన్నబిడ్డలుగా భావించిన బ్రహ్మదేవుడు , సరస్వతులిరువురూ వారిని ప్రేమగా ఆహ్వానించి 64 రకముల ఉపచారములు చేసి సంతోషము నందిరి.

వారిరువురికీ సుగంధ జలములతో మంగళస్నానము గావించిరి. పిదప వినాయకునికి ధవళ వర్ణపు పట్టు వస్త్రములతోనూ , మహాశాస్తాకి పసుపు రంగు పట్టు వస్త్రములను ధరింపజేసి ఆరాధించిరి. అందమైన ఆసనములపై ఆసీనులను చేసి , అమృతము వంటి శాకపాకములతో విందు చేసిరి. 

బిడ్డల మనస్సుల నెరిగిన తల్లిగా సరస్వతీ దేవి వినాయకునికి ఇష్టమైన మోదకములను , మహాశాస్తాకి ఇష్టమైన చక్కెర పొంగలి తినిపింపజేసి సంతోషించినది. ఎంతో ప్రీతిగా తనకు ఇష్టమైన మోదకములను ఆరగించి ఆనందించెను వినాయకుడు. శాస్తా తల్లితో 🌹 *"తల్లీ నామీద ప్రేమతో పెట్టిన చక్కెర పొంగలి ఈ పసుపు రంగు పట్టువస్త్రాలు నాకు ఎంతో ప్రీతి అయినవి. ఈ ప్రేమకు చిహ్నముగా నేను మీకు ఒక మాట ఇచ్చుచున్నాను. ఎప్పటికీ ఇవి నాకు ప్రియమైనవిగానే ఉండుగాక. నాకు ఎవరైతే వీటిని ప్రియంగా ఇచ్చుదురో నా అనుగ్రహము వారికి ఎన్నటికీ ఉండును”*🌹 అనెను. ఈ మాటలకు వాగ్దేవి ఎంతగానో ఆనందించెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!