శ్రీ మహాశాస్తా చరితము - 16 ఇంద్రునితో శాస్తా ఒనర్చిన యుద్ధము

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఇంద్రునితో శాస్తా ఒనర్చిన యుద్ధము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

పలువిధములైన దివ్యలీలలను ఒనర్చుతూ ఆనందిస్తున్న సమయంలో , ఒకనాడు శాస్తా తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారములను చేసిన అనంతరము , రాజకుమారుని వలె దుస్తులను ధరించి తన పరివారములైన శివగణములతో క్రీడను సలుపుటకై బయలుదేరి వెళ్లెను.

ఆటలాడుకొంటూ హిమాలయ పర్వత శ్రేణులలోని ఒక ప్రదేశము చేరెను.

ఆ ప్రదేశము ఇంద్రునికి చెందినది. దేవతల అధిపతి అయిన ఇంద్రుడు , కాళికేయుడను అసురుని వలన తన రాజపదవిని , అమరావతిని కోల్పోయిన పిమ్మట తన భార్య అయిన ఇంద్రాణితో ప్రకృతి అందాలతో పచ్చగా అలరారుతూ , హిమాలయ పర్వత శ్రేణిలోని ఆభాగంలో నివసించుచుండెను. అచ్చోటు పచ్చని చెట్లతోనూ , అతిమధురములైన రుచికర ఫలవృక్షాలు కలిగి అందమైన ఉద్యానవనంగా అలరారుచుండెను. దాన్ని తన ప్రాణమువలె కాపాడుతుండెను.

బాలశాస్తా తన స్నేహితులైన శివగణములతో వినోద క్రీడలు సలుపుతూ తనకు తెలియకునే క్రీడా సంరంభంలో నున్న సమయంలో అచ్చోటకేతెంచెను. ఆ క్రీడ ఎటుల నున్నదంటే , వారి ధాటికి ఆగలేక పర్వతములు చెదరిపోయి సముద్రముల ఉప్పొంగి స్థానభ్రంశములు చెందినవి. మిన్ను మన్ను ఏకమైనవి. సప్తలోకములు గిరగిరా తిరిగినవి. మరు నిమిషంలో యధాశక్తికి వచ్చెడివి. ఆ బాల క్రీడలకు లోకములన్నియు పరిభ్రమించినవి.

అలసిపోయిన శివగణములు శాస్తా వద్దకేగి క్రీడలతో ఎంతగానో అలసిపోయిన మాకు , ఎంతో ఆకలిగా ఉన్నది. ఆకలి తీరుటకు మీరు ఏదైనా చేసి మా ఆకలి తీర్చుడు ప్రభూ' అంటూ మొరలిడిరి.

శాస్తా - సమీపంలో ఉన్న ఇంద్రుని ఉద్యావనములోని ఫలవృక్షములను చూపి *“మీకు కావలసిన ఫలములు అచటనున్నవి. వాటితో మీ ఆకలి తీర్చుకొనుడు ! అని గవ్వల ఆటలో మునిగిపోయెను. ఆకలిమీదున్న శివగణములు తమ ఇష్టానుసారము కొన్ని ఫలములను తింటూ కొన్ని ఫలములు అందకపోవుటతో చెట్లనే కూల్చివేయుచూ , చెల్లాచెదురు చేయసాగిరి. ఇది చూసిన కాపలాదారులు వీరితో యుద్ధమునకు దిగిరి.*

తమ చేతికి అందిన వృక్షములనే ఆయుధములగా చేసి కాపలాధారులిపై విసరసాగిరి శివగణములు. ఆ ధాటికి తాళలేక కొన ఊపికి చేతపట్టుకుని కాపలాదారులు ఇంద్రునితో ఇలా
మొరపెట్టుకునిరి. దుష్టబాలురు కొందరు మన ఉద్యానవమును నాశనము చేసి మమ్ములను కూడా ఎంతగానో బాధించిరి. వజ్రాయుధపాణియైన తమరే ఆ బాలర భరతము పట్టవలెననిరి.

వెనువెంటనే ఇంద్రుడు ఉద్యావనమునకు బోయి , అచ్చోటు అతి బీభత్సముగా నుండుట చూసి దిగ్ర్భాంతి చెందెను. కోపోద్రేకుడై శివగణములపైకి బాణములను వెదజల్లెను. ఏమాత్రము తొట్రుపాటు
లేక శివగణములు వృక్షములతో వాటిని ఎదుర్కొనిరి. ఎదురువచ్చిన దేవసేనను మూర్ఖబలముతో వెనుదిరుగ వైచిరి. అమితకోపము కలవాడైన ఇంద్రుడు దివ్య అస్త్రములను ప్రయోగింపనారంభించెను.
ఎడమచేతితో అతి లాఘవంగా శివగణములు ఎదుర్కొనసాగెను. ఇంద్రుడు పరమశివుని ధ్యానించి అతిశక్తివంతమైన శివాస్త్రమును శివగణములపై చివరిసారిగా ప్రయోగించెను. తమ ప్రభువైన పరమశివుని అస్త్రమును ఎదుర్కొను శక్తి లేని శివగణములు దానికి కట్టుబడిన వారై మూర్ఛిల్లిరి.

*ఆకలి తీర్చుకొనుటకు వెళ్ళిన గణములు ఎంత సేపటికీ రాకపోవుటతో , శాస్తా తనవద్ద ఉన్న కొందరు వీరులను వెళ్ళినవారిని వెదకుటకై పంపెను. వెళ్ళినవారు ఉద్యానవమునకు ఏగి , పరిస్థితి చూసి వెంటనే వచ్చి శాస్తాకి వివరించగా , కోపావేశుడైన శాస్తా రాకుమార దుస్తులతోనే ఉద్యానవనమునకు  వెళ్ళి ఇంద్రునితో శివాష్ట్రములతో నా మిత్రులను పడగొట్టినవారు ఎవరు ?అంటూ భీకరిల్లెను.”* అమరాధిపతియూ దేవేంద్రుడనూ అయిన నేనే ఈ పని చేసినది అంటూ ఇంద్రుడు బదులిచ్చెను.

శాస్తా నీ రాజధాని అయిన అమరావతి ఎక్కడో ఉన్నది. నీది కాని ఈ చోటు నీకెటుల స్వంతమగును. నా మిత్రులకు ఇంతటి దుస్థితి కలుగచేసిన నిన్ను దండించియే తీరుదును అంటూ ఇంద్రుని ఎదుర్కొనెను.

ఇంద్రుడు కూడా యుద్ధము చేయనారంభించెను. అతడు ప్రయోగించిన బాణములు స్వామి
పాదములపై పుష్పములగా కురియసాగెను. ముందుగా శాస్తా ఇంద్రునితో యుద్ధమును ఆటలాడు రీతిగా ఆరంభించినా , ఇంద్రుని ధాటి పెరిగిపోవుట చూసి అతడికి బుద్ధి చెప్పు రీతిలో తానునూ
తీసిపోనటుల భీకరముగా యుద్ధము చేయుచూ , బాణమును ఒకదానివెంట ఒకటి అను రీతిలో సంధించసాగెను. ఆ దెబ్బలకు ఓర్వలేని దేవ సేన కుప్పకూలిపోయెను. ఇంద్రుడు కూడా శాస్తా ధాటికి ఆగలేక నిరాయుధపాణి అయ్యెను.

తన దుస్థితికి వగచిన ఇంద్రుడు తనకు సహాయముగా రమ్మని అష్టదిక్పాలకును అర్థించెను. తమ ప్రభువైన ఇంద్రుని దుస్థితి చూసి కోపము చెందిన అష్టదిక్పాలకులు ఒక్కసారిగా శాస్తాని
చుట్టుముట్టి బాణములు వేయసాగిరి. తనలో తాను చిరునవ్వు నవ్వుకుంటూ శాస్తా తాను ఏమాత్రం తీసిపోనివానిలా ఎనిమిది దివ్యరూపములుగా గోచరిస్తూ అష్టదిక్పాలకును ఎనిమిది మూర్తులుగా
ఎదుర్కొని వారిని ఓడించెను. స్వామి ముందు అష్టదిక్పాలకులు ఏమాత్రము ? వారు ఓడిపోయి అవమాన భారముతో క్రుంగిపోయిరి.
ఇక తనను ప్రదర్శించు సమయము ఆసన్నమైనదని తలచిన శాస్తా తన ఎనిమిది రూపాలను ఒక్క రూపముగా చేసుకొని దివ్యమంగళ స్వరూపిగా సాక్షాత్కరించెను. శాస్తా ఉనికిని తెలుసుకున్న ఇంద్రుడు మొదలగు పరివారమంతా స్వామి పాదారవిందములను పూజించిరి. మూర్ఛిల్లిన శివగణములు కూడా క్రొంగొత్త శక్తితో లేచి కూర్చొనెను.

శాస్తా ఇంద్రుని చూచి *“దేవేంద్రా ! ఇదంతయూ నా లీలా వినోదములోని ఒక భాగమే. ఈ యుద్ధములో మీరు పోగొట్టుకున్న వీరులు , మీరు పోగొట్టుకున్న ఆయుధములు అన్నియూ మరలా మీకు వచ్చి చేరును. ఇచట అందమైన ఉద్యానవనము మునుపటివలెనే అలరారును”* అని
ఆశీర్వదించి తన శివగణములతో అచటినుండి బయలుదేరెను.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat