శ్రీ మహాశాస్తా చరితము - 17 వృషభారూఢ శాస్తా

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*వృషభారూఢ శాస్తా*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


ప్రతి నిత్యమూ ఒక్కొక్క బాల చేష్టలతో మంగళకరమైన లీలావినోదములు చేయు పార్వతీ పరమేశ్వరులను రంజింపజేయుచూ , శాస్తా కైలాస పర్వతమునందు నడయాడసాగెను.

ఒకనాడు కృపాసముద్రులైన శివపార్వతులను స్తుతించుచూ , వారి ఆశీస్సులనందుకొనుటకై ,
సిద్ధగణములు కైలాసమునకు వచ్చుచుండిరి. ఆ సమయమున శివపార్వతులు కొంత ఏకాంతముగా గడుపనెంచి , చేరువనున్న ఉద్యానవనమునకు పోయిరి.

పరమశివుని నివాసమునకు చేరువగా శివగణములతో క్రీడించుచున్న బాలశాస్తా ఇవి చూచెను.
భక్తుల హృదయాంతరంగములను ఎరిగినవాడు కదా శాస్తా. దివ్య దంపతుల సందర్శనార్థము వచ్చిన సిద్ధగణములు , వారు అచట లేకపోవుటచే నిరాశ చెందుదురు కదా యని తలచి ఒక
ఉపాయము పన్నెను. శివగణములలో అగ్రగణ్యుడైన *'మహాబలుని'* పిలచి , ఆది దంపతుల
దర్శనార్ధమై వచ్చిన సిద్ధగణములు నిరాశ చెందరాదు. కాబట్టి నీవు నందిరూపుడవైన వృషభముగా మారుదువుగాక. నేను పార్వతీ పరమేశ్వరుల వేషము బూని నీపై అధిరోహించి వారిని ఆశీర్వదించి పంపుదుము”* అని పలకెను.

అన్నదే తడవుగా , మహాబలుడు భారీకాయము , పెద్ద చెవులు , సుందరత్వము బలము గలిగిన వృషభముగా మారెను. శాస్తా కూడా గరళము మ్రింగిన నీలకంఠునిగాను జ్ఞానమహేశ్వరి పార్వతిగానూ ద్వంద్వరూపములుగా గోచరించు ఆకృతి కలవాడై వృషభమును అధిరోహించియుండెను.

తేజోమయమైన ఈ దృశ్యమును గాంచిన సిద్ధగణములు తన్మయత్వము పొందిరి. అంతలోనే తెప్పరిల్లి అమితమైన ఆనందముతో శివపార్వతులను పలులెరగులు స్తుతించిరి. శివపార్వతులు రూపునిగా ఉన్న శాస్తా వారి ప్రార్ధనలు , వారి స్తుతులను విని , వారు కోరిన వరములనిచ్చి
పంపివైచెను.

ఆనంద పరవశులైన తరలి వెళ్లుచున్న సిద్ధగణములు - దారిలో
దారిలో ఉద్యానవనము నుండి వచ్చుచున్న శివపార్వతులను చూసి ఆశ్చర్యపడిరి. లోకమాతకు , పరమశివునికి నమస్కరించి,
*“తల్లిదండ్రులారా ! మీ నివాస స్థలమున ఇప్పుడే మిమ్ములను వీక్షించి , మీ ఆశీర్వాదము పొందిన ఆనందముతో వచ్చుచున్న మాకు మీరు ఎదురేగుట ఆశ్చర్యముగా ఉన్నది”* అంటూ తమ
సందేహము వెలిబుచ్చిరి.

శివపార్వతులకు అయోమయము కలిగి *“మేము ఇప్పుడే ఉద్యానవనము నుండి వచ్చుచుచున్నాము. మీరు మమ్ములను చూచినట్లు చెప్పుట మాకు ఆశ్చర్యముగా ఉన్నది'*  అంటూ తమ దివ్యదృష్టితో జరిగినదంతయూ తెలిసికొనిరి.

సిద్ధగణములతో *“మా దర్శనార్ధము వచ్చిన మీకు మేము అచట లేకపోవుట నిరాశ కలుగజేయును అను భావము వలన భక్తుల పాలిట అమితమైన కరుణ గలిగిన బాలశాస్తా మా ఇరువురి రూపముగానూ , మహాబలుడు వృషభరూపునిగానూ మీకు దర్శనమిచ్చి మిమ్ములను ఆనందపరచెను”*
అని తెలిపి , వారికి ఆశీస్సులు తెలిపి , పంపివైచెను.

పిదప తమ అనుంగు పుత్రుని పిలిపించెను. తాను చేసిన లీలా వినోదము తల్లిదండ్రులకు
తెలిసిపోయినదే నన్న సిగ్గుతో నిలబడియున్న బాలశాస్తా తల్లిదండ్రులను ప్రదక్షిణ నమస్కారములు
గావించి జరిగినదంతయూ వివరించెను. జరిగినదంతయూ శాస్తా చెప్పినది విన్న శివపార్వతులు మిక్కిలి సంతోషము పొంది , *“సిద్ధగణములకు నీవు చూపిన వృషభారూఢ దర్శనము మాకు చూడ ఇచ్చగానున్నది”* అనిరి.

మునువు సిద్ధగణములకు దర్శనమునిచ్చిన విధముగానే శివశక్తి స్వరూపుడై , వృషభారూఢుడై ,
కోటి సూర్యప్రభలతో వెలుగొందుతూ శాస్తా దర్శనమిచ్చెను. అది చూచి ఆనందము పొందిన పార్వతీ దేవి *'చాలు నాయనా. నీ స్వీయ రూపమునకు మారిపోవుము'* అనెను. తల్లి మాటలను విన్న
శాస్తా మునుపటి బాలుని వలె మారిపోయెను. కానీ వృషభరూపధారియైన మహాబలుడు అటులనే
ఉండెను.

లోకనాయకి తన పుత్రుని చూచి *'వత్సా !మహాబలుడింకనూ వృషభ రూపమున ఉండుటకు కారణమేమి'*  అని అడుగగా *"మాతా ! మీరు నన్ను మాత్రమే సహజ రూపమునకు రమ్మనిరి. మహాబాలునితో మీరు అనలేదు కాబట్టి అతడు ఇంకనూ అదే వేషమున ఉన్నాడు'* అని కను సైగ
చేసెను.

ఇది చూచిన పరమశివుడు *'పుత్రా ! ఈ వృషభ వాహనము నీకు మిగుల ఉచితముగా నున్నది. మహాబలుడు అటులనే కొనసాగునటుల వరమును అనుగ్రహింపుము. వృషభారూఢ సుందర
నాయధేయుడవై భక్తుల పాలిట పెన్నిధిగా వెలుగొందుదువుగాక అని ఆశీర్వదించెను.

మహాబలుని భక్తితత్పరతను ఎరిగిన శాస్తా , అరిషడ్వర్గాలను జయించిన మునులకు సైతము లభించని విధముగా , వృషభ వాహనమూర్తిగా ప్రకాశింపసాగెను.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!