శ్రీ మహాశాస్తా చరితము - 30 సింహదంష్ట్రుని సంహారము

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*సింహదంష్ట్రుని సంహారము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

ఒకానొక సమయమున రాక్షస కులమున జనించిన *'సింహదంష్ట్రుడు'* అను అసురుడు , తపస్సునకు నెంచి అవలీలగా వరములనొసగు బ్రహ్మ దేవుని వేడుతూ ఘోర తపస్సును ఆచరించెను.
తపస్సునకు మెచ్చి వరమును ఒసగవలసిన బాధ్యత బ్రహ్మదే కదా ! రక్కసుని తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను. రాక్షసుడు కోరిన వరములను అనుగ్రహించెను. అఖిల లోకములు తనకు లోబడి
నడుచునట్లుగానూ , అమిత బలపరాక్రమములను ఒసగమనియూ కోరెను.

వరమును పొందిన మరుక్షణము నుండియే తన బలపరాక్రమములను ప్రదర్శించుటకై ఒక
గొప్ప రాక్షస సేనను ఆయుత్తపరచెను. బలశాలురగు వీరులను దళపతులను గావించెను. వెళ్ళిన ప్రతిచోటా తన బల గర్వమును ప్రదర్శింపుతూ రాజులను ఓడించుతూ , ఒక్కొక్కసారి చంపివైచుచూ యుండెను. సింహదంష్ట్రుని సహోదరుడైన ఉగ్రనేత్రుడనువాడు అన్నగారికి కుడిభుజము వలె ఉండి తమకు లొంగని వారిని తమ దురాక్రమణలతో వారిని అణచివైచుచుండెను. రాక్షస సముదాయము
అంతయూ కూడి సింహద్రష్టుని తమ నాయకునిగా చేసికొనెను. అతి త్వరలోనే లోకములన్నియూ
రాక్షసరాజుకు కప్పము చెల్లించు నిర్బంధము పాలయ్యెను. హిమవత్ పర్వతమునకు చేరువలో
తనకంటూ ఒక ప్రత్యేకమైన నగరము నిర్మించుకొని అందుండియే రాజ్యపరిపాలన చేయుచుండెను. రాక్షసరాజు పరిపాలనలో అధర్మమునకు పెద్దపీట వేయబడినది. ధర్మవంతులైన వారు సిగ్గుతో తలదించుకొనిరి. దేవతలందరూ స్వామిని ధ్యానించుతూ , రాక్షసుని సంహరించు తరుణమునకై వేచియుండిరి.

ఇంతలో ఒకనాడు దుష్టుడైన ఉగ్రనేత్రుడు సర్వాధికారములు పొందినవాడై ప్రజలందరినీ
బాధించసాగెను. వరుణ లోకమునకు బోయి అచటి వారినందరినీ బాధింపసాగెను. వారందరూ ఆపద్భాంధవుడు , అసహాయ సహాయుడైన శ్రీ మహాశాస్తాని ధ్యానించుతూ తమ కష్టములను కడతేర్చుమని మొరపెట్టుకొనిరి.

శాస్త్రలోకమున నున్న మహావీరణునికి మిక్కిలి కోపము జనించినది. వరుణ లోకమున
సంచరించుచున్న ఉగ్రనేత్రుని ముందు ప్రత్యక్షమయ్యెను. ఇరువురి నడుమ ఘోరముగా పోరు సాగినది. స్వామి అనుగ్రహము పొందిన వీరణుని ముందు ఎవరికైనా ఓటమి తప్పదు కదా! మహావీరణు దండాయుధము చేత ఉగ్రనేత్రుడు చంపబడెను.

ఇదంతయూ విన్న సింహదంష్ట్రుడు కొదమ సింహము వలె ఘర్జించసాగెను. నా ప్రియ
సోదరుని చంపినది శాస్తా యొక్క దాసుడైన వీరణుడు వలననే కదా ! అందులకు కారణభూతుడైన శాస్తానే నేను బలిగొందును అంటూ గర్జించసాగెను. తన శోకమునంతయూ కోపముగా మార్చుకుని
మరుక్షణమే తన సేనలతో యుద్ధమునకు బయలుదేరెను.

తాను బ్రహ్మవలన పొందిన వరగర్వముతో , ఎవరితో పోరు సలుపబోవుచున్నామో తెలియని మదగర్వముతో శాస్తాతో యుద్ధమునకు తలపడెను. చక్రవర్తులకే చక్రవర్తియైన మహాశాస్తా ఇది గ్రహించెను. ప్రియ భక్తులకు మంగళకరముగానూ , అసురులకు అతిభయంకరముగానూ గోచరించు విధముగా ఒక రూపు దాల్చి సింహదంష్ట్రుని ముందు నిలిచెను. స్వామి యొక్క ఎడమ భాగమున
నున్న మూడు కరములందునూ శంఖము , బాణము , కేటయమును ధరించిన యుండెను.

కుడి భాగమున గల మూడు కరములందునూ బాణము , కత్తి , చక్రాయుధము వంటివి ధరించి మంగళకరము మూర్తీభవించు ఒక శునకము నందు కూర్చుండియుండు విధముగా గోచరించెను.

*"సింహదంష్ట్రా ! ఉన్నతమైన తపస్సు కారణముగా నీవు గొప్ప వరములను పొందినావు. అందులకు ఎంతయో ఉన్నత పదవిని అందినావు. కానీ ధర్మమార్గమును తప్పి నడుచునప్పుడే నీకు పోగాలము దాపురించు సమయము ప్రారంభమైనది. నీ దుష్ట ప్రవర్తన పలువురిని బాధించినది. వారు నన్ను శరణుగోరితిని. వారి కోరికను ఇప్పుడే నేను నెరవేర్చుబోవుచున్నాను అంటూ చిరునవ్వు నవ్వెను స్వామి.*

స్వామి తన కరముననున్న చక్రాయుధమును అసుర సైన్యంపై ప్రయోగించెను. అది మహాజ్వాలగా
మారి యుద్ధరంగమున పలు కోణముగా నిప్పులు గ్రక్కుచూ , అమరసేనలు కనులు మూసి
తెరచునంతలో వారిని మాడ్చి మసిగావించెను. సింహదంష్ట్రుడు సంహరింపబడెను. వికటాట్టహాసము చేయుచూ , ఆర్భాటముగా పోరు సలుపనెంచిన సింహదంష్ట్రుడు తన ఉనికే తెలియని విధముగా
మరణించెను.

*“పరాశక్తి పుత్రునికీ జై”* అంటూ దేవతలందరూ శునక వాహనునికి తమ హర్షధ్యానములను
తెలుపుకొనిరి. పుష్ప వర్షము కురిసినది. మంగళ నీరాజనములు అందచేసిరి. దేవతలందరూ
ఆనంద పరవశులైరి.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat