*మహారాజైన బ్రాహ్మణ కుమారుడు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
బ్రాహ్మణ కుమారునకు *'విభుడు'* అను నామకరణము గావించిన మహారాజు అల్లారుముద్దుగా
పెంచుకొనసాగెను. సకల కళా వల్లభునిగా వెలుగొందుచూ ఆ శిశువు చిరుప్రాయము నుండియే
మేధావిగా భాసిల్లుచుండెను. సకల లోక నాయకుడైన మహాశాస్తాని ఆరాధించుతూ పెరుగసాగెను.
జన్మతః తాను బ్రాహ్మణుడనని తెలిసిననూ , రాజరికపు పాలన వలన మహారాజునకు కావలసిన
అర్హతలన్నియూ పొందియుండెను. తగిన తరుణము రాగానే సోమపాలుడు విభునకు పట్టాభిషేకము చేసి తన మాట చెల్లించుకుని , వానప్రస్థము బూని వనమునకు బోయెను. ఇక విభుడు స్వామియొక్క
అనుగ్రహము వలన ప్రజారంజకముగా , నీతి నియమములతో పరిపాలించుచుండెను.
ఇంతలో ఒకనాడు అడవిలో రహస్య జీవనము చేయుచుండెడి విభుని యొక్క అగ్రసోదరులిరువురూ
కట్టెలు సేకరించు నిమిత్తమైపోవుచుండగా మహాకేతువు యొక్క కాపలా భటుల దృష్టిలో పడిరి. తమ
ప్రభువైన మహాకేతువు ఆజ్ఞమీరి వనముల సంచరించు వారిని తక్షణమే చెరయందు పడవైచి బాధించసాగిరి.
తన బిడ్డలు పడు బాధలు చూచి విప్రనందనుడు అమితముగా దుఃఖింపసాగెను. సోమపాలునికి తాను దత్తతగా ఇచ్చిన ఆ బిడ్డడే కదా నేడు దేశమును పరిపాలించు ప్రభువు. తనకు సహాయము చేయువాడు అతడే అని నిశ్చయించుకొనెను.
తండ్రిని చూచిన విభుడు అమితముగా ఆనందించి , సాదరముగా ఆహ్వానించి ఆదరించెను.
మహాకేతువు యొక్క దురంతములను , పలువురు విప్రులను బంధించి అతడు చేయి దుశ్చేష్టలను తండ్రి ద్వారా విన్న విభుడు ఆగ్రహమునుబూని , ఎటులైననూ మహాకేతువును ఓడించి , తన సోదరులను , మిగతా విప్రులను కాపాడుదునని ప్రతినబూనెను.
అంతట తన సైన్యముతో మహాకేతువు యొక్క రాజ్యమునకు దండెత్తిపోయెను. ఎంతో
వీరిచితముగా , ఆవేశముగానూ , పోరాడిననూ మూర్ఖులైన అసుర బలము ముందు దిగదుడుపే ఆయెను. అంతకంతకూ తన సైన్యము నీరసించుట చూచిన విభుడు సకలలోక సంరక్షకుడు , శత్రు సంహారకుడు అయిన శ్రీ మహాశాస్తాని పలు తెరగుల ధ్యానించెను. ప్రార్థించెను. *“వేదనాయకా ! విప్రపూజ్యా ! ధర్మమును నశింపజేయునెంచి విప్రవర్యులను చెరపట్టిన రాక్షసరాజు ఎన్నియో దుండగములు చేయుచున్నాడు. ముల్లోకములకు ధర్మము నిలుచుటకు వేదములు అవసరము కదా ! ఈ వేదములను వల్లించు విప్రులను వధియించుట పాపము కదా ! అధర్మపరుడైన రాక్షసుని సంహారము తక్షణ కర్తవ్యము కదా !”* అని పలువిధముల ప్రార్థించెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*