*మహాశాస్తా యెక్క గురుకుల వాసము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
నిర్దిష్ట కాలమున బాలకునికి ఉపనయనము జరిగినది. బ్రహ్మచారి అయిన విశ్వేశ్వరుడు
విద్యాభ్యాసమునకై గురుకులవాసమునకు పోయెను.
స్వామి గురుకుల వాసము చేయు సమయమున, ఒకనాడు *'చిత్రభాను'* అను రక్కసి అచ్చటికి
ఏతెంచినది. ఈమె వేరెవరో కాదు. కరడుగట్టిన కఠినాత్ముడైన రాక్షసునిగా పేరుగాంచిన మకుటాసురుని సేనాధిపతి అయిన కంబళాసురుని కుమార్తెయే. నరమాంస భక్షణము నందు ఆమెకు మిక్కిలి ప్రీతి.
గురుకులమున గల పలువురు బాలురలో నొకనిని యెంచుకొని , తన చేటల వంటి చేతులతో ఈడ్చుకొని పోసాగెను.
దీన్ని గమనించిన విశ్వేశ్వరుడు ఆమెను అడ్డగించి *"దుష్టురాలా ! నేటి నుండి నీకు దుష్టకాలము ఆరంభమైనది”* అనెను. మరియు *"మర్యాదగా ఈ బాలుని వదలివేయుము”* అని గర్జించెను.
అప్పటివరకూ విశ్వేశ్వరుని గమనించని ఆమె , అతడిని తేరిపార చూసినది. అతడి అంద
చందములకు సమ్మోహితురాలైనది. *“అవును కదా ! మిక్కిలి తేజస్సుతో ప్రకాశించు నిన్ను వదలి. అర్భకుడైన ఈ బాలుని భుజించుట తప్పే. రమ్ము. నిన్ను నేను ఆహారముగా గైకొందును”* అనెను.
ఆమెను తప్పించుకొను ప్రయత్నము చేయునట్లు నటించిచూ ఈమెను గురుకులమునుండి
బహుదూరముగా గొనిపోయెను. జన సంచారము లేనిచోట ఆగి , ఆమె ముందు గంభీరముగా నిలిచెను. ఆ రక్కసి అతడిని చూసి *“ఏమయ్యా ! నన్ను తప్పించుకోవాలని చూచుచుంటివా ? చూడు నిన్ను ఏమి చేయుదునో”* అంటూ తన చేతి వేళ్ళయందుండు విషపు గోర్లతో గుచ్చసాగెను. శాస్తా తన శరీరమును ఉక్కువలె మార్చుకొనగా , విషపుగోర్లు ఆ ఉక్కు శరీరమును తాకి నుగ్గు నుగ్గుగా మాసిపోయినవి. వాటి వెంట రక్తపు ధారలు కారసాగినవి. బాధతో సెగలు కక్కుచూ శాస్తాపైకి కఠిన శిలను ఒకదానిని విసరివైచెను. స్వామి ఆమె పైకి తిప్పి కొట్టెను. ఆ బండరాయి తాకినంతనే రక్కసి
తల పగిలి అక్కడికక్కడే చనిపోయెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*