శ్రీ మహాశాస్తా చరితము - 39 బాలకుని హూంకారము

P Madhav Kumar

*బాలకుని హూంకారము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

తన కుమార్తె మరణ వృత్తాంతము నెరిగిన కంబళాసురుడు , ఇది దేవేంద్రుని పనియేనని
అపార్థము చేసికొని , అతడిని వెదకుటకై నాలుగు పక్కలా చారులను పంపి గాలించసాగెను. హిమాలయ పర్వత గుహలయందు దాక్కుని , అజ్ఞాత వాసము చేయుచున్న దేవేంద్రునికి ఈ విషయము తెలిసి , భయపడిపోయి స్వామి చెంతకు చేరి తనను కాపాడమని వేడుకొనెను. స్వామి అతడికి అభయమిచ్చి పంపెను.

పలుచోట్ల దేవేంద్రుని వెదకి , అతడిని కానరాక , చివరికి బాల శాస్తా ఉండు చోటికి తన
బలగములతో వచ్చి చేరినాడు కంబళాసురుడు. పెను సముద్రము వంటి రక్కసుని సైన్యము ముందు బాలకుడైన బాలశాస్తా గంభీరముగా నిలచెను. అతడు అందరివలెనే అర్భకుడైన బ్రాహ్మణ బాలునిగా నెంచి రాక్షసుడు అతడితో *"బ్రాహ్మణ బాలకా ! నీ కులవైరి అయిన దేవేంద్రుడు , నాతో తలపడుటకు భయపడి నా కుమార్తెను సంహరించినాడు. అతడిపై పగ తీర్చుకొనుటయే నా కర్తవ్యము. ఇంద్రుని జాడ నీకు తెలియునా ? అని ప్రశ్నించెను.*

బాలశాస్తా చిరునవ్వు నవ్వుతూ ! *"సేనాపతీ ! నీ కుమార్తెను చంపినది నేనే , ఇంద్రుడు కాదు”* అని గంభీరముగా పలికెను. ఇది విన్న రాక్షసుడు మిక్కిలి కోపించి తన చేతి వింటితో బాణములు సంధించి స్వామిపైకి విసరసాగెను.

అది చూచిన స్వామి హేళనతో కూడిన చిరునవ్వు నవ్వినంతనే అతడి చేతిలో విల్లు , బాణములు అదృశ్యమైపోయినవి. నిరాయుధుడైన రాక్షసునితో పోరు సల్పుట ఉచితము కాదని భావించిన స్వామి ఆ రాక్షసుని , అతడి సైన్యమును చూసి గట్టిగా హుంకారము చేయగా , అవన్నీ భస్మీపటలమై
పోయినవి. దేవోత్తముడైన స్వామి యొక్క పరాక్రమమును చూచిన దేవతలు సంతోషించి పుష్ప వర్షమును కురిపించిరి.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat