Dussehra: దసరా రోజు జమ్మి చెట్టుని పూజించి పాలపిట్టని చూస్తే శుభప్రదమని భావిస్తారు. పండగ విశిష్టత తదితర ముఖ్య విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
Dussehra : చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా. ఈరోజున విజయదశమి అని కూడా అంటారు. హిందూమతంలో విజయదశమి పండుగకి -ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగని దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు.
సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్ళిన రావణుడిని శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఈ పండుగని చెడు మీద మంచి విజయానికి, అన్యాయంపై న్యాయం గెలిచిందనే చిహ్నంగా భావిస్తారు. విజయదశమి సందర్భంగా ప్రజలు పది తలల రావణుడి దిష్టి బొమ్మని దహనం చేస్తారు. రాంలీలా నిర్వహిస్తారు.
దసరా ఎందుకు జరుపుకుంటారు?
శ్రీరాముడు రావణుడిని నరికి చంపినందుకు గాను దసరా చేసుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత విజయ దశమి రోజున సంహరించిందని నమ్ముతారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి విశిష్ట పూజలు చేస్తారు. పశ్చిమ బెంగాల్ లో దసరాని పెద్ద వేడుకగా నిర్వహిస్తారు.
దుర్గా పూజ పదో రోజున బెంగాలీలు బిజోయ దశమి పాటిస్తారు. ఈరోజున దుర్గామాత ప్రతిమలని ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు. దసరా రోజున శమీ పూజ, అపరజిత పూజ, పాలపిట్ట చూడటం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు.
శమీ చెట్టుని ఎందుకు పూజిస్తారు?
విజయదశమి రోజుల్లో జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. అపరాజితాదేవిని శమీ వృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. అమ్మవారి సహస్ర నామాలలో అపరాజిత ఒకటి. అంటే పరాజయం లేనిదని అర్థం. జమ్మి చెట్టులో అపరాజిత దేవి కొలువై ఉంటుందని నమ్ముతారు.
పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకి పూజ చేశాడని చెబుతున్నాయి. మహా భారతంలో అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు పాండవులు వారి ఆయుద్ధాలని శమీ వృక్షం మీద భద్రపరుస్తారు. అజ్ఞాత వాసం పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు శమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలు తీసుకుని వెళ్ళిన తర్వాత చేసిన యుద్ధంలో గెలిచారు.
జమ్మి చెట్టు దేవతా వృక్షాలలో ఒకటిగా భావిస్తారు. క్షీర సాగర మథనంలో పాల సముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షాలలో జమ్మి చెట్టు ఒకటి. అందుకే యాగాలు కోసం నిప్పు రాజేయడానికి జమ్మి చెట్టు కలప ఉపయోగిస్తారు.
పాలపిట్ట దర్శనం
దసరా పండుగలో శమీ చెట్టుతో పాటు పాలపిట్టకి ప్రాధాన్యత ఉంటుంది. ఆరోజు పాలపిట్టని చూస్తే చాలా మంచి శకునంగా భావిస్తారు. పాండవులు అరణ్య వాసం ముగించుకుని తిరిగి వెళ్తుంటే పాలపిట్ట కనిపించింది. అది చూసినప్పటి నుంచి వారికి అన్ని శుభాలే కలిగాయట. శ్రీరాముడు కూడా రావణాసురిడితో యుద్దానికి బయలుదేరిన సమయంలో పాలపిట్ట కనిపించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు. అందుకే పాలపిట్ట దర్శనం చేసుకుంటే శుభప్రదమని భావిస్తారు.