నవరాత్రులు - శరన్నవరాత్రులు - శ్రీ మహిషాసుర మర్ధని దేవి

P Madhav Kumar


Navaratri 9th Day : శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసుర మర్ధని దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

దుర్గా మాత
దుర్గా మాత

శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం రోజు మహర్షవమిగా ప్రాశస్త్యం పొందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్దనీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తూ ఉంటుంది.

మహిషాసురుడనే రాక్షసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది, ఇంద్రుడిని ఓడించి, దేవతకు కూడా హాని తలపెట్టడంతో అందరూ శివకేశవుల దగ్గరకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. సమస్త దేవతల నుండి శక్తి వెలువడి, ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది, మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి దుష్టశక్తిని అణచదలచింది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా పోరు సలిపి, ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రాక్షసుని అంతమొందించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించింది. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు సిద్ధి ధాత్రిగా పూజిస్తారు.

దుర్గామాత తొమ్మిదో శక్తిరూపం సిద్ధిధాత్రి. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పరమేశ్వరిని మహిషాసుర మర్ధని అవతారంలో అనేక విధాలుగా పూజించి, జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధని శైలసుతే...అని కొలుస్తారు. ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి శాంతింపచేస్తారు. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ధరించవలసిన వర్ణం కాఫీ రంగు.

నవరాత్రులు 9 వ రోజు - శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉️🕉

♦️మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత:

సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలు ధరించి, సింహ వాహినియై దర్శనమిస్తుంది.

దుర్గా నవరాత్రులలో  9వ రోజు నవమి, మహర్నవమి అంటారు.   మహర్నవమి చాలా పవిత్రమైన రోజు.   ఎందుకంటే?  దేవి ఉపాసకులు ఉపవాసాలుండి,  శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి,  ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు.  9 రోజులలో ఏ రోజు చేయకపోయినా, ఈ 3 రోజులు (మూలా నక్షత్రం -- దుర్గాష్టమి -- మహర్నవమి) పూజ చేస్తే  అమ్మవారు కరుణిస్తుంది.   

విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం. శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది.  

కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. ఈ తల్లి దర్శనం వల్లే కాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది. వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు.   

🌻చదువుకోవలసిన స్తోత్రాలు:

మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి,  కాళీ కవచం,  కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం,  కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి.   ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి.  "ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు.  మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.

🌻మహిషాసురమర్దిని చరిత్ర:

మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపః శక్తితో ఎన్నో వరాలు పొందాడు, అతనికున్న వర మహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. 

ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి,  ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు. తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి,  చివరగా దుర్గాదేవి అష్ట భుజాలతో, సింహవాహినిగా మహిషాసురుణ్ణి  సంహరించింది. దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది..

ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం,  సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. 

శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక!  తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి,  సింహవాహిని.  కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది. ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.

ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం.   ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--,  లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి.   ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకి గాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని,  కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం.   

ఈ అమ్మవారి స్మరణ,  ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు.   ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది.   లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి".

అలంకరించే చీర రంగు: ముదురు ఎరుపు రంగు చీర
నైవేద్యంగా: చక్రపొంగలి, గారెలు...

శ్రీ మాత్రే నమః....🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat