కార్తీక మాసం శ్రవణ నక్షత్రం - కోటి సోమవారం

P Madhav Kumar


కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు ... శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస ఫలితం దక్కుతుంది.


ఈ కోటి సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.


కార్తీక మాసం శివుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనద . ఈ కార్తీకమాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి దైవాన్ని కొలుస్తారు. ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. 


కోటి సోమవారం అయిన రోజున ఉదయం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి మరోసారి ఈశ్వరుడిని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. 


అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. 


ఈ కార్తీకమాసం మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. కార్తిక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీటిలో స్నానం చేస్తున్నట్లు భావించాలి. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat