కార్తీకమాసంలో వచ్చే పండుగలలో చాలా ముఖ్యమైనదే కాక, పండుగలన్నింటికి కూడా చాలా ముఖ్యమైనదిగా చాలా ప్రాంతాల వారిచేత పరిగణించబడేది దీపావళి. ఇది అమావాస్య నాడు వచ్చే వెలుగుల పండగ. దీపాలు వెలిగించి, టపాకాయలు పేల్చి అవనిశిని దీప్తమంతం చేస్తుంది కనుక దీనికి దీపావళి అని పేరు వచ్చిందని అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట. అయినా,ఈ పండుగని ఎందుకు చేసుకుంటున్నామో, దీపాలు వెలిగించటానికి గల కారణం ఏమిటో చెప్పే కారణాలు మాత్రం చాలా వున్నాయి.
నరకాసుర వధ :
వాటన్నింటిలోనూ ముఖ్యమైనవీ, అందరూ అంగీకరించేది నరకాసురువధ. నరకుని శ్రీకృష్ణుడు సత్యభామ తోడ్పాటుతో సంహరించింది చతుర్దశి నాడు కానీ, ఆ సంతోషాన్ని అందరూ వ్యక్తపరిచి వేడుక చేసుకుంది మాత్రం మరునాడట. అదే దీపావళి. అజ్ఞానానికి ప్రతీక అయిన నరకుని అంతమొందించి విజ్ఞానజ్యోతిని వెలిగించిన దానికి ప్రతీకగా దీపాలు వెలిగించటం దీపావళి అంతరార్థం అనీ, ఇంట దీపం వెలిగించటంతో పాటు గుండెల్లోనూ, సమాజంలోనూ కూడా వెలిగించాలనీ, అప్పుడే దీపావళి పండుగ నిజమైన సంబరం అవుతుందనీ పెద్దలు మనకు సూచనప్రాయంగా అందించిన సంప్రదాయం. మనకు ఆశ్వయుజ కృష్ణ అమావాస్య, ఉత్తర దేశీయులకు కార్తీక అమావాస్య అయిన దీపావళి రోజున అనేక శుభ సంఘటనలు అన్ని యుగాలలోనూ జరిగినవట వాటి జ్ఞాపకార్థం దీపావళి జరుపుకోవటం ఆనవాయితీ అయిందట.
సీతారాముల ఆగమనం :
త్రేతాయుగంలో సుమారుగా 22 లక్షల సంవత్సరాలకి పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని వధించి సీతా సమేతుడై అయోధ్యకు వచ్చిన సందర్భంలో సీతారాములను ఆహ్వానించటానికి పౌరులు నగరాన్ని ఆవునేతి దీపాలతో అలంకరించారట. ఆ దీపాలు వారి మనస్సులలో ఉన్న ఆనందానికి చిహ్నం శ్రీరాముడు లేని రోజులన్నీ తమకు చీకటి అనీ, రాముని ఆగమనం తమ జీవితాలకి వెలుగునిచ్చిందనీ తెలియపరచటానికే దీపాలు. ఆ రోజు కార్తీక అమావాస్య అనీ, ఆ సంతోషకర సంఘటనకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆ రోజు దీపాలు వెలిగించి ఉత్సవం జరుపుకుంటారని దీపావళి పండుగ మూలం త్రేతాయుగం నుండి ఉందని ఒక విశ్వాసం.
మహావీరుని జన్మదినం :
జైనమత ప్రవర్తకుడు అయిన మహావీరుడు జన్మించింది కూడా దీపావళి రోజునేనట. అందువలననే జైనులు కూడా దీపావళిని పరమ పవిత్రదినంగా భావిస్తారు. విక్రమాదిత్య చక్రవర్తి 30 లక్షలమంది శకులను హూణులను భారత భూమి నుండి పారదోలినది కూడా దీపావళి శుభదినానే. ఆనాటి నుండే విక్రమశకం ప్రారంభమైంది.
సిక్కులకు పవిత్ర దినమే :
దీపావళితో సిక్కులకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సిక్కుల గురువు గురుగోవిందసింగ్ ను మొగలు చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. కొన్నాళ్ళకు చక్రవర్తి గురుగోవిందసింగ్ ను మాత్రం విడుదల చేయటానికి నిశ్చయించుకున్నాడు కాని, గురుగోవిందసింగ్ తానొక్కడే విడుదల అవటానికి ఇష్టపడక, కోటలోని వారందరినీ కూడా తనతో పాటు విడుదల చేయాలని పట్టుపట్టాడు. జహంగీర్ ఆయన మాట మన్నించి అందరినీ విడుదల చేశాడు. ఆ శుభదినం కూడా దీపావళే. భారతదేశంలో ఉన్న అన్ని సంప్రదాయాలకీ దీపావళితో ఏదో ఒక విధమైన సంబంధం ఉంది. అందరూ పవిత్రదినంగా భావించి, వేడుకలు జరుపుకుంటారు.
లక్ష్మీ ఆవిర్భవించిన రోజు :
పురాణాలలో కూడా దీపావళికి సంబంధించి అనేక ఇతివృత్తాలు కనిపిస్తాయి ... నరకాసురవధ కాక విష్ణుపురాణం మార్కండేయ పురాణాలలో లక్ష్మీపూజ చేయాలని, అలా చేస్తే అది విశిష్ట ఫలదాయకమని చెప్పబడింది. రాముడు అయోధ్యకి రావటమో, కృష్ణుడు నరకుని సంహరించటమో జరిగిన రోజున వారిద్దరినీ కాక లక్ష్మిని పూజించటం విశేష ఫలదాయకం అవటానికి కారణం ఏమిటి?
క్షీర సముద్రాన్ని మదించినప్పుడు విశిష్ట వస్తు సముదాయాలన్నీ అందులోనుండి ఉద్భవించాయి కదా! త్రయోదశి నాడు ధన్వంతరి జన్మించాడని చెప్పుకున్నాం. అమావాస్య నాడు లక్ష్మి జన్మించిందట. లక్షి అనగా విస్పష్టమైన గుర్తు అవి కలిగి, వాటిపై ఆధిపత్యం కలిగిన దేవీమూర్తీ (వెలిగేరూపం) లక్ష్మీదేవి. ఆమె విష్ణువుని చూచి ఇష్టపడిందట. విష్ణువు ఆమెను తన వక్షస్థలంలో చేర్చాడట. ఆమె అష్టవిధమైన రూపాలతో అలరారిందట. వారే అష్టలక్ష్ములు. ఆమె జన్మదినం కనుక ఆనాడు తనను పూజించినవారికి అష్టైశ్వరాలను ప్రసాదించుతుందట. లక్షీదేవి అమావాస్యనాడు పుట్టినందువల్లనే కాబోలు, అమావాస్యనాడు ఆడపిల్ల పుట్టటం శుభం అనీ, ఆపిల్ల అపురూప సుందరి, ఐశ్వర్యవంతురాలు, అదృష్టవంతురాలు అవుతుందనే నమ్మకం ఉంది. దేవలోకం వారికి కూడా దీపావళి శుభప్రదమే ఒకప్పుడు దుర్వాసమహర్షి ఇచ్చిన పారిజాత పూల దండని ఇంద్రుడు అగౌరపరిచాడట. అది విష్ణువు ఇచ్చినదే అయినా, ముని తన మెడలొ వేసుకున్నదాన్ని దేవలోక రాజైన తాను ధరించటం అవమానం అని భావించి, పారవెయ్యటానికి భయపడి తానెక్కిన ఏనుగు కుంభస్థలం మీద అలంకరించాడు. కాని అది ఏనుగు తలమీంచి కిందపడింది. దానిని ఏనుగు కాలితో తొక్కింది. దుర్వాసుడు అది చూసి స్వర్గలక్ష్మి ఇంద్రుని తొలగిపోతుందని శపించాడు. ముని శాపం ప్రకారం ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోయి దీనుడై వున్నాడు.
దేవతలందరికీ పెద్ద దిక్కు అయిన బ్రహ్మను ప్రార్థిస్తే, అతడు ఇంద్రుని విష్ణువు వద్దకు తీసుకొని వెడతాడు. అప్పుడు విష్ణువు అభయం ఇస్తాడు. ఆ అభయ ప్రదానం కారణంగా, విష్ణువు లక్షిని స్వీకరించగానే ఇంద్రుని శాపం అంతం అయి, పూర్వవైభవాన్ని తిరిగి పొందుతాడు. ఆ కారణంగా దేవతలంతా ఆనందోత్సాహాలతో లక్ష్మీదేవి జన్మదిన వేడుకలను జరుపుతారు. తాము చీకట్లలోనుండి వెలుగులోకి వచ్చిన దానికి చిహ్నంగా దీపాలు వెలిగించి, జ్యోతి స్వరూపంగా లక్ష్మిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ విధంగా దీపావళి దేవతలు కూడా జరుపుకునే పండుగ అయింది.
దీపం ఉన్న ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది :
అన్ని పండుగలకి, మనం తలంట్లు పోసుకోటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండివంటలు చేసుకోవటం, బంధు మిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది కాని, ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది `దీపాలు వెలిగించటం, టపాకాయలు కాల్చటం దీనికి సంబంధించి విష్ణుపురాణంలో ఒక కథ కనపడుతుంది` దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యా స్తమయసమయం, అనగా సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది.
''దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము''
''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు.
వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం, శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు, చీకట్లు పోగొట్టి కాని, ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. 'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన:'' ఆ అగ్నిదేవుని మన ఇంటి యందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే, ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం!!!
''సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతిమిరాపహమ్'' ఇంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవటం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెపుతారు. చతుర్మాస్యం పూర్తి అయి శ్రీమహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెపుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనక దీపాలు వెలిగించాలట.
దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికీ ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్రదర్శనం చేయాలంటారు. ఈనెల అంతా కృత్తికల పేరు గలది కదా! ఆ వివరాలు ఉపొద్ఘాతంలో చెప్పుకున్నాం.
తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు.
అంటే కార్తీక మాసాధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రం లక్ష్మిని ఆరాధించాలి.
టపాకాయలు కాల్చటం ఎందుకు?
ఆనందోత్సాహ ప్రకటనకి టపాసులు పేలుస్తారు. కానీ దీపాల వరుసలకి, టపాసులు పేల్చటానికి మరొక కారణం కూడా ఉన్నట్టనిపిస్తుంది. వానలు వెనకపట్టి ఉంటాయి. ఇంక చలిగాలులు వచ్చేకాలం. బురద, తడి, వానలు కారణంగా పెరిగిన క్రిమికీటకాదులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభిస్తాయి. పంటపొలాలు కోతలకి వచ్చి వాటిలో బాగా పెరిగిన పురుగులు, దోమలు మొదలైనవి వీరవిహారం చేయటం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో గంధకం, పొటాషియం వంటి రసాయనాల పొగపట్టినట్లైతే, వాటి విజృంభణను నివారించవచ్చు. పొగ వెయ్యండి అంటే అందరూ వెయ్యరుకదా! పండగలో భాగంగా చెయ్యమంటే తప్పకుండా చేస్తారు. ప్రారంభం అయిన రోజుల్లో ఈ ఉద్దేశం ఉందో లేదో, చర్చ అనవసరం. ఇప్పుడైతే ప్రయోజనం అదే, పైగా, ఈ మధ్య విన్నమాట`డెంగ్యూ ఫివర్ కలిగించే దోమలు కూడా టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే పొగవల్ల నశిస్తాయట.
ఒక్కదీపం వెలిగించటంకాక, దీపాలు అనేకం వెలిగించటంలో ఉన్న పరమార్థం కూడా ఇదే! పూర్వకాలం సౌకర్యాలు ఎక్కువ లేని రోజుల్లో శరదృతువు ప్రయాణానికి అనుకూలమైన కాలం గనుక అందరూ అప్పుడే ప్రయాణాలు చేసేవారు. అటువంటి బాటసారులకు దారి చూపటానికి కాబోలు ఎత్తైన ప్రదేశంలో ఒక దీపం పెట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇప్పటికీ దేవాలయాలలో అలా ఒక దీపం ఎత్తైన స్థంభంపై వెలిగించటం చూడవచ్చు. చీకటి, అజ్ఞానాల మీద గెలుపుకి ప్రతీక అయిన దీపావళి, కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటే దివ్వ దీపావళి అవుతుంది.