ఎందుకయ్యా జాగుసేతువు నందివాహన శంకరా
అందుకొన రావయ్య మంగళ హరతిదిగో పురహారా
మందమతితో నిన్ను మరిచిన మాకు గతి నీవే హరా
సుందరేశ్వర నీ పదాలకు వందనము గంగాధరా
ఫాలలోచన పాపయోచన బాల చంద్ర కళాధరా
నీలలోహిత భక్త సేవిత నిత్య మంగళ విగ్రహా
కేల శూలము బట్టి లోకాలేలు దొర నీవేనయా
లీలగా మమ్మేలగా రాజాలవా కరుణామయా
ఎన్ని జన్మలు ఎత్తినానో నిన్ను చేరక దైవమా
కన్న తండ్రీ దర్శనమ్మిడి కనుల పండుగ సేయవా
ఎన్నటికి నీవాడనో గిరిజేశ శ్రితమందారమా
విన్నపము లాలించి వేగమె విశ్వనాధా బ్రోవుమా