శ్రీ లలితా త్రిపుర సుందరీ
శ్రీ దేవి నవరాత్రులు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉
🍃🌷అమ్మవారు ఈ రోజున "శ్రీ లలితా మహా త్రిపుర సుందరిగా" పూజలు అందుకుంటుంది.
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి ఆది పరాశక్తి యొక్క శక్తివంతమైన "త్రిపురత్రయం' లో రెండవ శక్తి రూపాలలో ఒకటి.
దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ అమ్మవారు. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని భక్తితో ఆరాధిస్తారు.
⚜️అలంకరించే చీర రంగు: కుంకుమ రంగు, బంగారు వర్ణం
⚜️నైవేద్యం: క్షరాన్నం, దద్దోజనం, అల్లంగారెలు.
⚜️అర్చించే పూల: వివిధ రకాలు
⚜️పారాయణం: శ్రీ లలితా సహస్రనామం
సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ తల్లి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు.
దారిద్ర్య దుఃఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈ తల్లి సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి.
🍃🌷పురాణగాథ - భండాసురవధ:
పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా, పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై నియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మథుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటునకు చింతించి, అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మథుడు కన్పించాడు. కోపంతో శివుడు మూడవకన్ను తెరచి, ఆ కంటి మంటలలో మన్మథుణ్ణి మసి చేశాడు.
కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో ప్రోగుచేస్తూ ఉండగా, ఆ బూదిడ నుండి భయంకరాకారంతో రాక్షసుడొకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై, ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై, భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు.
దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా, "ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడ"ని విష్ణువు వివరించాడు. అపుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు.
బ్రహ్మ, విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తి పరచగా, ఆ యజ్ఞవేదిక నుండు ఆమె ఆవిర్భవించిది. ఆమె, శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణకిరీటం, ఆపై అర్థచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమెనాలుగు చేతులలోపాశం, అంకుశము, చెఱకు విల్లు, ఐదు పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్త్రోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది. భండాసురుణ్ణి సంబరించ గలనని దేవతలకు అమె అభయ మిచ్చింది.
కొన్నాళ్ళకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారిగలుగా 'తల్లి' వెంట నిలిచారు.
ససైన్యంగా తన పైకి యుద్దానికి వస్తున్న పరాశక్తిని చూచి, భండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు భండుని సేనలను సర్వనాశనం చేశాయి. అపుడు భండాసురుడు తన ముప్పది మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమల మధ్యభాగం నుండు బాలాదేవతను సృష్టించింది. భండపుత్రులను సంహరింపుమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞమేరకు బాలా దేవత భండాసురుని పుత్రులందరినీ సంహరించిది.
తన పుత్రులందరూ మరణించడం చూచి, భండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, వేఱొకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురుకొల్పాడు తన పరిచారికలైన వారాహీ శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహీ దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా, శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది.
తనసైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా, భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్రాస్త్రాల బారినుండి తన్ను తాను రక్షించు కోవడానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూచింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞమేరకు గణపతి భండాలురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్రప్రయోగంతో భండాసురుణ్ణి నేలకూల్చింది.
భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా పరాశక్తిగా ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలమూ తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకొన్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి 'అలాగే' అని వారికి అభయప్రదానం చేసి అంతర్థానమైంది. దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు.
🍃🌷శ్రీ లలితా సహస్రనామ విశిష్టత:
ఇది లలితాదేవిని స్తుతిస్తూ వెయ్యి పేర్లతో కూడిన స్తోత్రం. లలితాదేవిని త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, కామాక్షి అని కూడా పిలుస్తారు.
భండాసుర వధ హిందూ పురాణాలలో ముఖ్యంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడినది.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మాండ పురాణం లో 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది.
అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని, శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు.
శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును.
భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు.
శ్రీ లలితా సహస్రనామ శ్లోకం:
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ‖ 1
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రములు తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.
శ్రీమాత్రే నమః….🙏🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿.
మంత్రము:
"ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః" అనే మంత్రము 108 మార్లు జపించవలెను.

