**
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
_*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం!*_
_*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్!!*_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
_*ఈశ్వర ఉవాచ:*_
🪷 సాంబమూర్తి చెప్పుచున్నాడు...
🪷 ఓ సనత్కుమారా♪! ఇక ముoదు _*శనివార వ్రత విధిని*_ చెప్పెదను వినుము♪. ఆ వ్రతమును అచరించుటచే మాంద్యము పోయి చురుకుగానుండును♪.
🪷 శ్రావణమాసములో శనివారమునందు నృసింహమూర్తి, శనైశ్చరుడు, ఆంజనేయస్వామి అను ముగ్గురి యొక్క పూజను జేయవలయును♪.
🪷 గోడమీద గాని, స్తంభము మీదగాని, జగత్ప్రభువు అగు నృసింహమూర్తి యొక్క ప్రతిమను, లక్ష్మీ దేవి ప్రతిమను పసుపు కలిపిన మంచిగంధముతో లిఖించి శుభ ప్రదములగు నల్లని పుష్పములు, ఎఱ్ఱని పుష్పములు, మొదలగు వానిచే బూజించి, కజ్జికాయలు, చక్కెరములు, నివేదన జేసి ఆ పిండివంటకములనే తాను అనుభవించవల యును, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును♪. నూనెతోను, నేతితోను అభ్యంగనము జేయుట నృసింహమూర్తికి ప్రియమగును♪.
🪷 శనివారమునందు అన్ని కర్మల యందును నూనె ఉపయోగించుట ముఖ్యము కాఁబట్టి, బ్రాహ్మణులకు సువాసినీ స్త్రీలకును నూనెతో అభ్యంగన స్నానము జేయించవలయును♪. శనివారమునందు తానును కుటుంబ సహితముగా నూనెతో అభ్యంగనము చేయవలయును♪. గారెలతో కూడ అన్నమును నివేదన చేసినయెడల నృసింహమూర్తి సంతోషించును♪.
🪷 ఈ ప్రకారము శ్రావణమాసములో నాలుగు శనివారముల యందు వ్రతము చేసిన యెడల వాని యింట లక్ష్మీదేవి స్థిరముగా నివసించి యుండును♪. ధనము, ధాన్యము, సమృద్ధిగా ఉండును♪. పుత్రులు లేనివాడు పుత్రులు కలుగువాడగును ఈ లోకంబున సమస్త సుఖములను అనుభవించి, అంత్యకాలమందు మోక్షము నొందును♪.
🪷 నృసింహమూర్తి అనుగ్రహము వలన పది దిక్కుల యందు వ్యాపించునట్టి కీర్తి గలవాడగును♪. ఇది శ్రేష్ఠమైనది కాఁబట్టి, నృసింహ వ్రతమును నీకు జెప్పితిని♪.
🪷. ఈ ప్రకారముగానే, శనైశ్చరుని యొక్క ప్రీతికొరకు చేయదగిన వ్రతమును జెప్పెదను వినుము♪.
🪷 ఒక కుంటి బ్రాహ్మణుని గాని లేక కుంటిలేని బ్రాహ్మణుని గాని తీసుకొనివచ్చి, నువ్వులనూనెతో తలంటి, వేడినీళ్లు పోసి స్నానము చేయించవలెను♪. శ్రద్ధ గలవాడై నృసింహ వ్రతమునకు చేసిన పదార్థములనే చేసి, భుజింపచేయవలయును♪.
🪷 శనైశ్చరుఁడు నాయందు దయ గలవాడుగా ఉండవలయునని, శనిదేవుడు సంతోషించుట కొరకు నువ్వులనూనె, యినుము, నువ్వులను, మినుములు, కంబళి, పీటలను దానమియ్యవలయును♪. నువ్వుల నూనెతో శనైశ్చరునకు అభిషేకము చేయవలయును♪. శనిదేవుని పూజించుటకు నువ్వులను, మినుములను, అక్షతలుగా ఉపయోగింపవలయును♪.
🪷 ఓ మునీశ్వరుఁడా! ఈ శనైశ్చరుని ప్రార్థన జేయు విధానమును జెప్పెదను సావధానుడవై వినుము♪. నల్లని వర్ణము గలవాడును, మెల్లగా నడచువాడును, కాస్యప గోత్రుడును, సౌరాష్ట్ర దేశాధిపతియు, సూర్యుని కుమారుడును, వరములను ఇచ్చువాడును, దండకారణ్య మండలంబున ఉండువాడును, ఇంద్రనీల మణులతో సమాన కాంతి గలవాడును, బాణములను ధనుస్సును ధరించువాడును, శూలమును ధరించువాడును, గద్ద వాహనము గలవాడును అధిదేవత యముడును, ప్రత్యధిదేవత బ్రహ్మయు గలవాడును, కస్తూరి ఆగరు మిళితమైన గంథమును పూసికొనినవాడును, గుగ్గిలము ధూపముగా గలవాడు, పులగమునందు ప్రీతిగలవాడును అగు శనైశ్చరుడు నన్ను రక్షించుగాక యని ధ్యానము జేయవలయును♪.
🪷 ఓ బ్రాహ్మణోత్తమా! శనైశ్చరుని పూజించుటకు యినుప ప్రతిమ చేయించుట ముఖ్యము♪. శనిని ఉద్దేశించి పూజింపునప్పుడు నల్లని వస్తువులను దానమియ్యవలయును♪.
🪷 రెండునల్లని వస్త్రములను, నల్లని ఆవును దూడను, దానమియ్యవలయును♪•. ఈ ప్రకారము యధావిధిగా పూజించి ప్రార్థించవలయును, స్తోత్రమును జేయవలయును♪.
🪷 రాజ్యభ్రష్టుడైన నలమహారాజు పూజింపఁగా సంతోషించి తిరిగి నలమహారాజునకు స్వకీయమైన రాజ్యము వచ్చునట్లుగా చేసిన శనైశ్చరుఁడు నన్ను అను గ్రహించుగాక♪.
🪷 నల్లని కాటుక వంటి ఆకారము గలవాడును, మెల్లని నడకచే సంచరించువాడును, సూర్యుని వలన ఛాయాదేవి యందు పుట్టినవాడు అగు శనైశ్చరునకు నమస్కారము చేయుచున్నారము♪.
🪷 కోణములయందు నుండువాడును పింగలవర్ఞము గలవాడునగు ఓ శనైశ్చరుడా♪! నీకు నమస్కారము చేసెదను♪. దీనుడనై నీకు నమస్కరించితిని, గాన నాయందు అనుగ్రహము కలవాడవగుము♪.
🪷 యీ ప్రకారము స్తోత్రము ప్రార్థన చేసి, మాటిమాటికి నమస్కరింపవలయును♪. బ్రహ్మ క్షత్రియ వైశ్యులనెడి మూడు వర్ణముల వారును పూజించునప్పుడు (శంనోదేవీ రభిష్ట యే) అను వేదోక్త మంత్రముచే పూజింపవలయును♪. శూద్రులు శనైశ్చర నామమంత్రముచే పూజింపవలయును♪. స్థిరచిత్తము కలవాడై యీ ప్రకారముగా శనైశ్చరుని పూజించిన వానికి స్వప్నమందైనను శని వలన భయము కలుగదు♪.
🪷 ఓ బ్రాహ్మణుడా! యీ ప్రకారము శ్రావణమాసములో ప్రతి శనివారము నందును భక్తితో పూజించి శనైశ్చరుని గురించిన వ్రతమును చేయువానికి శనైశ్చరుని వలన గలిగే అరిష్టములు కొంచెమైనను కలుగవు♪.
🪷 తన జన్మరాశియందు గాని, అది మొదలు రెండింట, నాలుగింట, ఐదింట, ఏడింట, ఎనిమిదింట, తొమ్మిదింట, పండ్రెండవ స్థానము, యీ చెప్పబడిన స్థానముల యందు శని యున్న యెడల పీడను కలుగచేయును♪. ఆ శనైశ్చరుడు సంతోషించి పీడను పోగొట్టుటకు (శమగ్నిః) అను మంత్రముచే జపము చేసి యింద్రనీలమణిని దానమిచ్చిన యెడల శని సంతోషించి పీడను పోగొట్టును♪.
✅ ఇక ముందు, ఆంజనేయస్వామికి ప్రీతికరమగు పూజావిధిని జెప్పెదను వినము♪
🪷 శ్రావణమాసములో శనివారము నందు రుద్రసూక్తము జెప్పుచు, నూనెతో అభిషేకము చేసిన యెడల ఆంజనేయస్వామి సంతోషించును.
🪷 నూనెలో సిందూరము కలిపి సమర్పించవలయును♪. దాసాన పుష్పమాలికలు, జిల్లేడు పువ్వుల మాలికలు, మందార పువ్వుల మాలికలు, మొదలగువానిచే పూజింపవలయును, మఱియు శ్రద్ధాభక్తులు కలవాడై తన శక్తికొలది షోడశోపచారములచే పూజించిన ఆంజనేయస్వామి సంతసించును మఱియు విద్వాంసుడు ఆంజనేయ ద్వాదశ నామములను జపింపవలెను♪.
🪷 హనుమాన్, ఆంజనానూనుః వాయుపుత్రః, మహాబలః, రామేష్టః, ఫల్గుణసఖః, పింగాళః అమితవిక్రమః, ఉదధిక్రమణః, సీతాశోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాతా, దశగ్రీవదర్పహా, అని చెప్పబడు ఆంజనేయుని పండ్రెండు నామములను ప్రాతఃకాలంబున పఠియించువానికి అశుభము కొంచమైనను కలుగదు♪. వానికి నమస్త సంపదలు కలుగుచున్నవి♪.
🪷 శ్రావణమాసములో శనివారము నందు ఈ ప్రకారముగా ఆంజనేయస్వామిని పూజంచిన మనుష్యుడు వజ్రముతో సమానమగు శరీరము గలవాడును రోగము లేని వాడును బలవంతుడును అగును♪. విశేషమగు బుద్ధిగలవాడై మిక్కిలి చురుకుగా కార్యములను సాధించును♪. శత్రువులు నశించెదరు మిత్రులు వృద్ధినొందెదరు♪.
🪷 ఆంజనేయస్వామి అనుగ్రహము వలన కీర్తి గలవాడును, పరాక్రమవంతుడును అగును♪. మఱియు ఆంజనేయుని అలయము నందు గూర్చుండి ఆంజనేయుని కవచము లక్షపర్యాయములు పారాయణ చేసిన వాడు అణిమాద్యష్ట సిద్ధులు కలిగి ప్రభువగును, వానిని చూడగానే యక్షులు, రక్షస్సులు, భేతాళములు, పిశాచ ములు మొదలగునవి భయంనొంది గడగడ కడకుచు వేగముగాపారిపోవును•.
🪷 ఓ సనత్కుమారుడా♪! శనివారమునందు రావిచెట్టునకు పూజ చేయుటయు, ప్రదక్షిణము చేయుటయు మంచిది♪. బుద్ధిమాంద్యము కలవాడు ముఖ్యంగా చేయవలయును♪. యిట్లు ఏడు వారములు రావి చెట్టునకు ప్రదక్షిణలు చేసిన యెడల నమస్తసంపదలు కలుగును♪. శ్రావణమాసములో చేసిన మిక్కిలి ముఖ్యము♪.
_*||ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - శనివార వ్రత కథనం నామోధ్యాయ స్సమాప్తః|*_
