12. శ్రావణమాస మహాత్మ్యము - 12వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

12. శ్రావణమాస మహాత్మ్యము - 12వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar


♦️ద్వాదశాధ్యాయము:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు... 

ఓ సనత్కుమారుడా! ఇక ముందు శుభప్రదమగు స్వర్ణగౌరీ వ్రతమును చెప్పెదను వినుము. ఆ వ్రతము శ్రావణ శుద్ధతదియ యందు చేయవలయును.


ఉదయమున స్నానం చేసి, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, సంకల్పము చేసి, పార్వతీపరమేశ్వరులను షోడశోపచారములచే పూజ చేయవలయును.


ప్రపంచమునకు ప్రభువును దేవతలలో ఉత్తముడవు అగు, ఓ సాంబమూర్తీ! నేను చేయునట్టి పూజను గ్రహించుము,నేను జేయు పూజాస్థలమునకు వచ్చి నివసింపుమని ప్రార్థించవలెను.


మహాదేవియగు పార్వతీదేవి యొక్క తృప్తి కొఱకును, వ్రతం సంపూర్తినొందుటకును, పదహారు వాయనములను దంపతుల కొఱకు ఇవ్వవలెను.


 బ్రాహ్మణులు సంతోషించుట కొఱకు వాయనములను ఇచ్చుచున్నానని సంకల్పం చేసి, బ్రాహ్మణులను పిలచి,ల వేపుడు బియ్యం, పదహారు పిండివంటలతో నిండియున్నవియు, నూతన వస్త్రములతో జుట్టబడినవియు, పదహారు వెదురు పాత్రలను వ్రతం సంపూర్తినొందుటకు సర్వాలంకార భూషితులును పతివ్రతలు అగు సువాసినీ స్త్రీలకు ఇచ్చుచున్నాను, నా కార్య సమృద్ధి నిమిత్తమై వారు గ్రహింతురుగాక, యని ఇవ్వవలయును. యిట్లు పదహారు సంవత్సరములు గాని యెనిమిది సంవత్సరాలు గాని, నాలుగు సంవత్సరాలు గాని, ఒక్క సంవత్సరం గాని, తత్కాలమందుగాని, చేసి పిమ్మట ఉద్యాపనం చేయవలెను. 

 పూజ చేసిన పిమ్మట కధను చెప్పిన వానిని పూజింపవలెను.


🌻సనత్కుమార ఉవాచ:

ఓ స్వామీ! యీ వ్రతమును పూర్వం చేసినవారెవరు, దీని మహిమ యెటువంటిది, ఉద్యాపనం చేయు విధమెట్టిది - దీనినంతయు సవిస్తరంగా చెప్పుమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను.


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు... 

ఓ మునీశ్వరా! నీవు వేసిన ప్రశ్న యోగ్యంగా ఉన్నది. కాఁబట్టి, దాని వివరమంతయు నీకు చెప్పెదను వినవలయును. స్వర్ణగౌరీవ్రతం మనుష్యులకు సమస్త సంపదలనిచ్చును.


పూర్వ కాలంబున సరస్వతీ నదీతీరంబున సువిలమను ఒక పట్టణం కలదు. ఆ పట్టణంబున కుబేరునితో సమాన సంపదగల చంద్ర ప్రభుడను ఒక రాజు, ఆ రాజునకు సౌందర్యంచే మన్మధుని తిరస్కరించు నట్టి రూపలావణ్యం కలవారును, పద్మముల వంటి నేత్రములు కలవారును, మహాదేవి విశాల అను పేర్లుగల యిద్దరు భార్యలు కలరు. ఆ రాజు, వారిరువురిలో పెద్ద భార్య యందు మిక్కిలి ప్రేమ గలవాడై యుండెను. ఆ రాజు ఒకనాడు వేటాడుట యందు ఆసక్తి గలవాడై అడవికి వెళ్లి కౄరమృగములగు సింహములను, పెద్దపులులను, అడవి పందులను, అడవి దున్నలను, ఏనుగులను, సంహరించి, అలసినవాడై దప్పికచే పీడింపబడి జలం నిమిత్తమై ఆ అడవి అంతయు దిరిగెను.


పద్మములవంటి నేత్రములు గల ఆ రాజు ఇట్లు వనమంతయు తిరుగగా చక్రవాకములు, కారండవములు, తుమ్మెదలు, కోయిలలు, మొదలగు పక్షులతో వ్యాప్తమైనదియు, వికసించిన పద్మములు, మల్లెలు, జాజులు, తెల్ల కలువలు, నల్ల కలువలు, మొదలగు పుష్పములతో నిండియున్నదియు, మనోహరమగు ఒక దేవతల కొలను కనుపింపగా దానివద్దకేగి, జలమును పానముచేసి ఒడ్డున భక్తితో పార్వతీ దేవిని పూజింపుచున్న అప్సర స్త్రీలను జూచి మీరు చేయుచున్న వ్రతమేమి!? అని ఆ స్త్రీలనడిగెను.


ఓ రాజా! మేము చేయునది, స్వర్ణగౌరీ వ్రతము. శ్రేష్ఠమైనది. మనుష్యులకు సమస్త సంపదలనొసగును. కాఁబట్టి, నీవును ఈ వ్రతమును చేయమని యా స్త్రీలు చెప్పిరి.


🌻రాజోవాచ:

ఈ వ్రతమును ఏ విధిగా చేయవలయును, చేసినందు వలన ఫలమేమి కలుగును, దీనినంతయు సవిస్తరముగా జెప్పుమని రాజు ప్రశ్న చేయగా, ఆ  అప్సర స్త్రీలు చెప్పుచున్నారు.... 


శ్రావణమాసములో తదియ దినంబున ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేయవలయును. యీ వ్రతమునందు పార్వతీపరమేశ్వరులను మిక్కిలి భక్తి కలిగి సంతోషముతోగూడి పూజింపవలయును. అనంతరము పదహారు పోగులు పోసిన తోరమును మగవాడు కుడిచేతికిని, ఆడది యెడమ చేతికిని కట్టుకొనవలెను. లేక తోరమును కంఠమునందైనను ధరింపవచ్చును. అని స్త్రీలు చెప్పిరి.


అనంతరము ఆ రాజు నియమముగల మనస్సుతో గూడినవాడై,  ఆ స్వర్ణగౌరీ వ్రతమును చేసి పదహారు పోగులుగల తోరమును కుడిచేతికి కట్టుకొని దేవతలలో ఉత్తమురాలవగు ఓ గౌరీ! నీ వ్రతమును చేసి తోరమును గట్టుకొంటిని కాఁబట్టి నాయందు అనుగ్రహము కలదానివగుమని ప్రార్థించి, వ్రతమును పూర్తిచేసి యింటికి వెళ్లెను.


ఆ రాజు ఇంటికి వెళ్లగానే కుడిచేతినున్న తోరమును జూచి పెద్ద భార్య మిక్కిలి కోపము కలదగుచు,  రాజు వలదువలదు అన్ననూ.. వినక, రాజు చేతినుండెడి తోరమును తెంచివేసి యింటికి వెలుపల ఉండెడి ఎండిన చెట్టు మీద పారవేయగా, ఆ చెట్టుకు తోరము తగిలినంతనే ఆ చెట్టు చిగుళ్లు పువ్వులు కలదాయెను.


ఇది యంతయు రెండవ భార్య చూచి,  మిక్కిలి ఆశ్చర్యముకలదై వ్యాకులతను జెంది, తెగిపోయి అక్కడ పడియున్న తోరమును తీసుకొని తనహస్తమునకు కట్టుకొనగా,  ఆ వ్రత మహిమ వలన ఆ రెండవ భార్యయందు మిక్కిలి ప్రేమం గలవాడాయెను. వ్రతమును ఉల్లంఘన చేయుటచే రాజు కోపించి పెద్ద భార్యను వెళ్ళగొట్టగా.. ఆమె అడవులయందు దిరుగుచు, దేవిని ప్రార్థించుచు, అక్కడక్కడ కనపడిన మునుల ఆశ్రమములకు పోగా, వారు ఓ పాపాత్మురాలా! అడవులందు ఏల తిరిగెదవు,  యింటికి పొమ్ము అని పలికినప్పటికి వినక, మహాఘోరమగు ఆ అడవియందే తిరుగుచు, అలసి, విచారపడుచు ఒకచోటున కూర్చుండెను.


అనంతరము గౌరీదేవి ఆ  రాజుయొక్క భార్యయందు దయ కలిగి, ఎదుట ప్రత్యక్షము కాగానే, ఆ రాజు భార్య గౌరీ దేవిని చూచి సాష్టాంగ దండప్రణామము చేసి, ఓ దేవీ! భక్తవరదే! శంకరవామాంగే! మంగళమంగళే! నీకు నమస్కారము అని యీ ప్రకారము ప్రార్థించి, ఆ గౌరీదేవి వలన స్వర్ణగౌరీ వ్రతమును దెలిసికొని, భక్తితో యధావిధిగా ఆచరింపగా, గౌరీదేవి సంతోషించి వరములనిచ్చెను. అనంతరము ఆమె యింటికి వెళ్లగా,  వ్రత మహిమచే తన భర్త తిరిగి తనయింటనుంచుకొని పూర్వము వలెనే ప్రేమతో నుండెను.


అనంతరము ఆ రాజు పెద్ద భార్య గౌరీదేవి యొక్క అనుగ్రహము వలన సమస్త కోరికలను పొందెను. ఇట్లు ఆ రాజు యిద్దరు భార్యలయందు సమాన ప్రేమ గలవాడై, సమస్త సంపదలను అనుభవించి కొంతకాలము రాజ్యము చేసి,  అంత్యకాలమందు ఆ యిద్దరు భార్యలతోగూడ కైలాసము చేరెను.


ఓ మునీశ్వరుడా! శుభప్రదమగు ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేసినవాడు నాకు, గౌరీదేవికిని ప్రియమైనవాడగుచు విశేషమగు సంపదను పొంది శత్రువులందరినీ జయించి శ్రేష్ఠంబగు శివుని నివాసస్థానమైన కైలాసమును జేరుదురు.

ఓ మునీశ్వరుడ! యీ స్వర్ణగౌరీ వ్రతమునకు ఉద్యాపన విధానమును జెప్పెదను, సావధానముతో వినుము. యోగ్యమైనతిథి వారములు గల దినమందు తారాచంద్ర బలయుక్తముగా ఉండునప్పుడు, చేయదలచినవాడై మంటపము నేర్పరచి అష్టదళములు గల పద్మమును లిఖించి, అచ్చట ధాన్యమును రాశిగా బోసి దానిపైన పదిహారు నవటాకుల యెత్తుగల రాగి కలశమును నువ్వులతో నిండించి యందుంచి, దానిపైన పార్వతీపరమేశ్వరుల ప్రతిమలనుంచి, వేదోక్తమంత్రములచే ఆవాహనాదులను గావించి, రెండు తెల్లని వస్త్రములను, యజ్ఞోపవీతములను ఉంచి, యధావిధిగా పూజనంతయు గావించి, ఆ రాత్రి జాగరణము చేయవలెను. 

అనంతరము మరునాడు ఉదయమున ప్రాతఃకాల పూజ గావించి, ముందుగా నవగ్రహ హోమము చేసి, పిమ్మట ప్రధాన దేవతకు హోమము చేయవలెను.

నువ్వులు బియ్యము నెయ్యి కలిపి హోమంచేసి, ధనవంతుడైనచో, విశేషముగా చేయవలెను, లేక వెయ్యి పర్యాయములు గాని, నూరు పర్యాయములు గాని హొమము చేసిన పిమ్మట ఆచార్యునకు వస్త్రములు, ఆభరణములు ఆవులు మొదలగువానిని పూజించి ఇచ్చి, పదహారుగురు దంపతులకు వాయనదానమిచ్చి, పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి, తన శక్తికొలది, వారికి విశేష దక్షిణలను ఇచ్చి, ఆనందముతో గూడినవాడై, బంధువులతో గూడ అనంతరము తాను భుజింపవలయునని సాంబమూర్తి, సనత్కుమారునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - తృతీయా తిథౌ స్వర్ణగౌరీ వ్రత కథనం నామ ద్వాదశోధ్యాయ స్సమాప్తః..                  

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow