14. శ్రావణమాస మహాత్మ్యము - 14వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

14. శ్రావణమాస మహాత్మ్యము - 14వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar


♦️చతుర్దశాధ్యాయము:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి  చెప్పుచున్నాడు..

ఓ మునీశ్వరా! యిక ముందు శ్రావణ శుద్ధ పంచమి దినంబున చేయతగిన వ్రతం చెప్పెదను.


చవితియందు ఒక్కసారి భుజించి, పంచమి దినమున రాత్రి భుజించ వలయును. బంగారంతో గాని, వెండితో గాని, కొయ్యతో గాని, మట్టితో గాని ఐదు పడగలు గల సర్పం ఏర్పరచి దానిని పంచమి దినమున పూజింపవలయును. మరియు ద్వారమునకు రెండు ప్రక్కలను విషముతో అధికంగా నుండు సర్పములను గోమయంతో లిఖించి, గరిక చిగుళ్లు, కరవీర పుష్పములు, గన్నేరు పుష్పములు, జాజిపువ్వులు, సంపంగి పువ్వులు, గంధం, అక్షతలు, మొదలగు వానిచే పూజించిధూపదీపాదులను ఇవ్వవలయును. 


అనంతరము నెయ్యి, పరమాన్నము, కుడుములు, మొదలగువానిచే బ్రాహ్మణులను భుజింపచేయ వలయును మఱియు అనంతరము వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, కర్కోటకుడు, నాగుడు, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, కాళీయుడు, తక్షకుడు, మొదలగు సర్పరాట్టులను మఱియు ఇతర సర్పములను గోడయందు పసుపు తోటి, మంచిగంధముతోటి, ఆకారములను లిఖియించి పుష్పములు మొదలగు వానిచే పూజింపవలయును. పుట్టయందు పూజచేసి దానిలో నుండు సర్పములు తాగుటకు పాలు పోయవలయును. 


మఱియు నేతితో మిళితమైన పంచదార మొదలగు మధుర పదార్ధములను ఇష్టమైనట్లు ఉంచవలయును. ఆ దినంబున పోళీలు మొదలగునవి చేయ గూడదు. ఇనుము పాత్రను వాడగూడదు. నివేదనకు పరమాన్నమును భక్తితో ఉంచ వలయును. వేయించిన శనగలును బియ్యమును జొన్నలును సర్పములకు నివేదన చేయవలయును. వానినే తాను భుజింపవలయును. ఆ నివేదన చేయబడిన శనగలు మొదలగు వానిని పిల్లలకు పెట్టవలెను. వానిని భుజించిన పిల్లలు దంతపుష్టి గలవారగుదురు, మఱియు స్త్రీలు అలంకరించుకొని పుట్టవద్ద సంగీతము పాడుటయు, వాద్యములను వాయించుటయు, విశేషమహో త్సవములను జరుపుటయు చేయవలయును. యిట్లు చేసిన యెడల, వానికి ఎప్పటికిని సర్పముల వలన భయము కలుగబోదు.


ఓ మునీశ్వరుడా! ప్రపంచమునకు మేలు కొఱకు మఱియొక సంగతిని నీకు తెలియ పరచెదను దానిని వినుము. ఓ చిన్నవాడా! సర్పముచే కరవబడినవాడు, మృత్యువునొంది, అధోగతుడై తిరిగి సర్పముగా బుట్టును. కాఁబట్టి,  అట్టి దోషములేమియు పొంద కుండా ఉండుటకుగాను, నాగ పంచమీ వ్రతమును చేయవలెను. కాఁబట్టి, పూర్వము జెప్పిన రీతిగా ఒక్కసారి భుజించుటయు, బ్రాహ్మణులతో గూడ సర్పపూజ గావించుటయు చేయవలెను. ఈ ప్రకారము పండ్రెండు మాసములలో ప్రతి మాసమునందును వ్రతము ఆచరించవలయును. సంవత్సరము పూర్తికాగానే శుక్ల పక్ష పంచమి దినంబున సర్పముల తృప్తికొఱకు బ్రాహ్మణులను, యతీశ్వరులను భుజింపచేయ వలెను. కథలను వినిపించిన వానికి రత్నములతో గూర్చబడిన బంగారపు నాగ ప్రతిమను, దూడ గలదియు, బంగారపు కొమ్ములు గలదియు, వెండి డెక్కలుగలదియు విశేషముగా పాలు ఇచ్చునదియు ఐన గోవును దానమివ్వ వలయును.


దానమిచ్చు సమయమున - సమస్తమును వ్యాపించినవాడును, సమస్తమును ఇచ్చువాడును, ఎవనిచే జయింపబడని వాడును అగు భగవంతుని స్మరింపుచు,  నిట్లు చెప్పవలెను... 


ఓ భగవంతుడా! నా వంశంబున సర్పదష్టులై మృతినొంది, అధోగతులు అయియుండిరేని వారందరు ఇప్పుడు నేను జేసిన వ్రాత ప్రభావముచే ముక్తి నొందుదురు గాక! అని చెప్పి మంచి గంధముతో కలిపిన అక్షతలను ఉదకముతో గూడ భక్తి పూర్వకముగా భగవంతుని ఎదుట ఉదకముతో విడువవలెను. ఈ ప్రకారము వ్రతమాచరించిన యెడల ఇదివరలో మృతినొందిన వారు,  ఇకముందు మృతినొందెడి వారును సర్పముల వలన భయమునొందక స్వర్గమును పొందగలరు.


ఓ మునీశ్వరుడా! ఈ ప్రకారము తన వంశస్తులనందరిని తరింపజేసి తానును అప్సర స్త్రీలచే సేవింప బడును. శివలోకమును పొందును. తనకు శక్తి కొలది లోభింపక వ్రతమును చేసినవాడు పూర్వం చెప్పబడిన ఫలమును పొందును. భక్తి కలవారై శుక్ల పక్ష పంచమి యందు సర్పములను పుష్పముల చే పూజింపుచు నక్తభోజనము చేసిన వారి యొక్క గృహముల యందు భయము ఎంత మాత్రము కలగనీయక సర్పములు మణుల కాంతులతో ప్రకాశింపుచు సంతోషముతో తిరుగుచుండును.


ఈ వ్రతమును ఆచరింపని బ్రాహ్మణులు గృహదానమును స్వీకరించినయెడల విశేష నరకమును అనుభవించి సర్పరూపులగుదురు.


ఎవరైనను సర్పములను చంపినచో వారు మృతినొందిన పిమ్మట రెండవ జన్మమునందు పుట్టిన సంతావము నశించువారుగాని పుత్రులు లేని వారుగాని కాగలరు. స్త్రీల యందు కార్పణ్యముగా ఉన్నట్టివారును, ఆక్షేపణలను చేసిన వారును, అబద్ధము పలికినవారును సర్పములుగా పుట్టుదురు. 


మఱియు ఇతరములగు అనేక కారణముల వలన సర్ప స్వరూపములుగా పుట్టెదరు, కాఁబట్టి, అట్టి సమస్త దోషములకును ఈ చెప్పబడిన వ్రతము మిక్కిలి ప్రాయశ్చిత్తముగా చెప్పబడెను. ద్రవ్యలోపం లేకుండా నాగపంచమీ వ్రతమును చేసిన యెడల సమస్త సర్పములకు అధిపతులగు శేషుడును, వాసుకియు సంతృప్తులై వ్రతము చేసిన వానికి మేలు చేయుట కొఱకు దోసిలి పట్టుకొని ప్రభువులగు విష్ణుమూర్తిని సాంబమూర్తిని ప్రార్థించెదరు.


సర్వదేవతా సార్వభౌములగు శివకేశవులు - శేషవాసుకుల విజ్ఞాపనచే సంతుష్టాంతరంగులై సమస్త కోరికలనొసగుచున్నారు. ఇట్లు వారు ఒసగిన సమస్త కోరికలను ఇహలోకంబున అనుభవించిన పిమ్మట నాగ లోకమునకేగి అచ్చట సంభవించిన సమస్త భోగములను అనుభవించి, అనంతరం మంగళపదములగు వైకుంఠము, కైలాసము  లోకముల కేగి అచ్చట శివవిష్ణువులకు భృత్యగణములతో చేరి, సేవ చేయుచు, అనంతరం పరమ సుఖకరమగు ముక్తినొందెదరు.


ఓ చిన్నవాడా! ఇట్టి శ్రేయస్కరముగు నాగపంచమి వ్రతమును జెప్పితిని, మఱియు ఇంతకంటే మఱియొక వ్రతం ఏదియైనను నీవు వినదలచినచో దానిని గూర్చి అడుగుము చెప్పెదను.. అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను. 


♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - "నాగపంచమీ" వ్రత కథనం నామ చతుర్దశో ధ్యాయ స్సమాప్తః.  

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow