వినాయకునికి విఘ్నాలను తొలగించే దేవుడు అని పేరు. ప్రతిరోజూ, ప్రతి పనికీ ముందు స్మరించమన్నారు. అటువంటి విఘ్నేశ్వరునికి తిరిగి ప్రత్యేకంగా ఒక పండుగ
దినం ఎందుకు! అనేకమంది దేవతలుండగా వారందరికీ ప్రత్యేకంగా పూజాదినం లేనప్పుడు ఒక్క గణపతికి మాత్రమే ఆ ప్రత్యేకత ఎందుకు? ఆయన గణాధిపతి కాబట్టా! కాదు. వినాయకచవితి అనేది ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన పండుగగా చెప్పవచ్చు.
భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆకాశంలో వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. ఋగ్వేదంలో వున్న ఖగోళ విజ్ఞానం ఈ విషయం తెలియచేస్తుంది.
సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుని నాడు పూజించాలనే ఒక నియమం ఉంది.
కాబట్టి భాద్రపద శుద్ధ చతుర్థినాటి సూర్యోదయంలో కనిపించే వినాయక నక్షత్రాలు ఈ లోకంలోని సమస్త జీవులమీదా సత్ ప్రభావం చూపేలా ప్రజలు ప్రార్థన చేసే సంప్రదాయమే వినాయక చతుర్థి.
