చెన్నై రాజా అన్నామలై పురం అయ్యప్ప ఆలయం*
ఉత్తర శబరి యను పేరుగాంచిన పై అయ్యప్ప స్వామి వారి దేవాలయము చెన్నై శాంథోమ్ బీచ్ రహదారిలో అడయార్ వెళ్ళే మార్గాన రాజా అన్నామళై పురమునందు యున్నది. ఈ ఆలయమును శబరిమల పోలిన నమూనాతో నిర్మించియున్నారు. ఇందుకొరకై యున్న స్థలమును డా॥ రాజా యమ్.ఏ.యమ్. రామస్వామి శెట్టియార్ గారు దాతృత్వముతో విరాళంగా ఇవ్వడంతో పాటు ఆలయ నిర్మాణ ఖర్చులన్నియూ తామొక్కరే భరించి ఈ ఆలయమును అతిమనోహరముగా రూపొందించియున్నారు. శబరిమల వంశావళి ప్రధాన తాంత్రి వర్యులగు శ్రీ కంటరారు మహేశ్వరారు తంత్రి వర్యుల కరకమలములచే ఈ ఆలయ ప్రతిష్ఠలు జరుపబడినది. వారి తనయులగు కంఠరారు మోహనారు తంత్రివర్యులు కొంతకాలం ఈ ఆలయ పూజా ఆరాధనలను నిర్వహించి యున్నారను గొప్పకూడా ఈ ఆలయమునకు గలదు. ఇచ్చటి అయ్యప్ప పంచలోహ విగ్రహమును నాగర్ కోవిల్ శ్రీ పట్టం ఆచారిగారు. అత్యద్భుత కళానైపుణ్యముతో జనాకర్షనీయముగా తయారుచేసి యున్నారు. గణపతి , శ్రీనాగరాజ , మణికాపురత్తమ్మ , కరుప్పస్వామి , కడుత్తస్వామి , పదునెట్టాంబడి , మరియు ద్వజస్థంబములతో గూడిన ఈ ఆలయము చెన్నైపట్టణమునకే తలమాణిక్యముగా విరాజిల్లుచున్నది అనిన మిన్నగాదు. ఇచ్చటనూ నిత్యగణపతిహోమముతో మొదలిడబడిన శ్రీస్వామివారి దర్శనము ఉదయం 11.30 గంటలకు ఉచ్చపూజతో మూయబడి మరలా సాయంత్రము 5.30 గంటలకు సన్నిధి తెరవబడి దీపారాధన , పుష్పాభిషేకంతో రాత్రి 8.30 గంటలకు హరివరాసనముతో మూయబడును. మండల మకర విళ్ళకు ఉత్సవ కాలంలో మరోగంటసేపు అధికముగా ఆలయము తెరచియుండును. వేలసంఖ్యలో భక్తులు ఈ ఆలయమున మాలధరించి ఇరుముడికట్టుకొని శబరిమలకు వెళ్ళివస్తున్నారు. ఏసుదాస్ , వీరమణి , వీరమణిదాసన్ వంటి పరమ భాగవతోత్తముల భజనలు మండల మకర ఉత్సవకాలంలో జరుగును. మండల కాలమునందు నిత్యాన్నదానము కూడా ఈ ఆలయమున జరుగును. చెన్నై వెళ్ళే భక్తులు రాజా అన్నామలై పురంలోని ఈ అయ్యప్ప ఆలయమును దర్శించి తరించగలందులకు మనవి.
